11/07/2026
సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరగాలనే పోరాటంలో జనసేన ఎప్పుడూ ముందుంటుంది - ఆలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్‌చార్జి శ్రీ తెర్నేకల్ వెంకప్ప గారు.
ఆలూరులో మీడియాతో మాట్లాడిన జనసేన పార్టీ ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీ తెర్నేకల్ వెంకప్ప గారు, సుగాలి ప్రీతి ఘటన (2017) అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.
నేరాన్ని ఛేదించడంలో ఆధారాలే (సాక్ష్యాలే) కీలకం.దురదృష్టవశాత్తు గత ప్రభుత్వాల హయాంలోనే సాక్ష్యాలు తారుమారు చేయబడ్డాయి.
నేర విచారణలో నిజాన్ని వెలికితీయేది వ్యక్తులు కాదు, సాక్ష్యాలే. ప్రభుత్వాలు మారవచ్చు, పరిస్థితులు మారవచ్చు, కానీ బలమైన ఆధారాలు ఉన్నంత వరకు న్యాయం తన దారిని వెతుక్కుంటూ వస్తుంది. అందుకే సాక్ష్యాలను పరిరక్షించడం, నిజాలను వెలికితీయడం ప్రతి వ్యవస్థ బాధ్యత.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "2017లో సుగాలి ప్రీతికి జరిగిన అన్యాయం అత్యంత విషాదకరం. ఒక ఆడబిడ్డకు జరిగిన ఈ ఘటనపై అప్పటి ప్రభుత్వాలు తగిన చొరవ చూపకపోవడంతో కేసు సంవత్సరాల పాటు ముందుకు సాగలేదు. అయితే జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఈ అంశాన్ని రాష్ట్ర, జాతీయ స్థాయికి తీసుకెళ్లి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు" అని తెలిపారు.
కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా లక్షలాది జనసైనికులతో కర్నూలులో ర్యాలీ నిర్వహించి, సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారేనని వెంకప్ప అన్నారు.
"సుగాలి ప్రీతి తల్లి స్వయంగా చెబుతున్నారు... కర్నూలు జిల్లాకే పరిమితమైన ఈ అంశాన్ని రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చర్చించేలా చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారేనని. ఆయన చేసిన నిరంతర పోరాటం, ఒత్తిడి వల్లే ప్రభుత్వం స్పందించి కుటుంబానికి సహాయం అందించింది" అని పేర్కొన్నారు.
ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించి, సంబంధిత ఉన్నతాధికారులు, హోంమంత్రి, డీజీపీ, సీఐడీ అధికారులతో మాట్లాడి కేసు పురోగతిపై ఆదేశాలు ఇచ్చారని తెలిపారు.
ప్రస్తుతం డీఎన్‌ఏ నివేదికలు, సాక్ష్యాల నిర్వహణపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని, అందువల్ల ఈ కేసులో నిజానిజాలు వెలుగులోకి రావాలంటే సమగ్ర విచారణ జరగడం అవసరమని అన్నారు. బాధ్యులెవరో చట్టమే తేల్చాలని స్పష్టం చేశారు.
అదే విధంగా 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఈ కేసును పూర్తిస్థాయిలో విచారించే అవకాశం ఉన్నప్పటికీ ఎందుకు న్యాయం జరగలేదనే ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం బాధిత కుటుంబం మాజీ ముఖ్యమంత్రిని కలవడం ద్వారా న్యాయం ఎలా జరుగుతుందనే సందేహం ప్రజల్లో వ్యక్తమవుతోందని పేర్కొన్నారు.
బాధిత కుటుంబం తమ కుమార్తెకు న్యాయం కోసం పోరాడటాన్ని తాము పూర్తిగా గౌరవిస్తున్నామని, ఒక ఆడబిడ్డకు జరిగిన అన్యాయం అత్యంత బాధాకరమని అన్నారు. అయితే ఈ అంశాన్ని రాజకీయ కోణంలో కాకుండా, నిజమైన న్యాయం జరిగే దిశగా ముందుకు తీసుకెళ్లాలని కోరారు.
ఈ కేసును రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రజల దృష్టికి తీసుకువచ్చింది జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారేనని ప్రజలకు తెలుసన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే బాధిత కుటుంబాన్ని కలిసి వారికి న్యాయం జరగాలని బహిరంగంగా డిమాండ్ చేశారని, అనంతరం ఈ అంశాన్ని రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు.
పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ బాధిత కుటుంబాలకు అండగా నిలిచే నాయకుడని, ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు తన సొంత నిధులతో సహాయం చేయడానికి ముందుంటారని తెలిపారు. కౌలు రైతుల కుటుంబాలకు కూడా స్వయంగా ఆర్థిక సహాయం అందించి వారి పక్షాన నిలిచిన నాయకుడని అన్నారు.
అలాంటి వ్యక్తిపై నిరాధార ఆరోపణలు చేయడం బాధాకరమని, ఒక కుటుంబానికి అండగా నిలిచిన నాయకుడిని అపార్థం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. రాజకీయాలకు అతీతంగా జరిగిన సంఘటనలను ఒకసారి గుర్తు చేసుకుని, అంతరాత్మతో ఆలోచించాలని కోరారు.
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ బాధిత కుటుంబాలకు భరోసాగా నిలిచే నాయకుడని, కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలవడం ఆయన వ్యక్తిత్వమని తెలిపారు. ఏ కుటుంబాన్నీ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే నాయకుడు ఆయన కాదని రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసన్నారు.
బాధిత కుటుంబం న్యాయం కోసం పోరాడటం సమర్థనీయమేనని, అయితే ఆ పోరాటాన్ని కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడం బాధాకరమని పేర్కొన్నారు. రాజకీయ ప్రేరేపణలకు లోనుకాకుండా, అసలు సమస్యకు న్యాయం జరిగే దిశగా అందరూ సహకరించాలని కోరారు.
ఒక ఆడబిడ్డకు న్యాయం జరగాలని కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదని, కానీ ఆ బాధను రాజకీయ వేదికగా మార్చకుండా చట్టబద్ధంగా న్యాయం జరిగేలా కృషి చేయాలని అన్నారు. బాధిత కుటుంబ సభ్యులు కూడా గతంలో తమకు అండగా నిలిచిన వారి సహకారాన్ని గుర్తు చేసుకుని, రాజకీయాలకు అతీతంగా న్యాయం కోసం ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరారు.
చివరిగా, బాధిత కుటుంబ సభ్యులు గత పదేళ్ల పరిణామాలను ఒకసారి గుర్తు చేసుకుని ఆత్మపరిశీలన చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 2015 నుంచి ఇప్పటి వరకు జనసేన పార్టీ, పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, జనసైనికులు సుగాలి ప్రీతి కుటుంబానికి ఏ విధంగా అండగా నిలిచారో గుర్తు చేసుకోవాలని అన్నారు.
"మా లక్ష్యం ఎప్పుడూ రాజకీయాలు కాదు... సుగాలి ప్రీతి కుటుంబానికి పూర్తి న్యాయం జరగాలన్నదే. అదే సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. రాజకీయాలకు అతీతంగా నిజం వెలుగులోకి వచ్చి బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరగాలని జనసేన పార్టీ కోరుకుంటోంది" అని శ్రీ తెర్నేకల్ వెంకప్ప గారు స్పష్టం చేశారు.