08/11/2026
పాలకొల్లు: మానసిక దివ్యాంగుల ముఖాల్లో చిరునవ్వులు నింపుతూ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కుటుంబ సమేతంగా దీపావళి వేడుకలు జరుపుకున్నారు. పాలకొల్లులోని అంజలి మానసిక దివ్యాంగుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి నిమ్మల, ఆయన కుటుంబ సభ్యులు విద్యార్థులకు నూతన వస్త్రాలు, దీపావళి బాణాసంచా సామాగ్రి, స్వీట్లు, పండ్లు అందజేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి బాణాసంచా కాల్చి వారిలో ఆనందోత్సాహాలు నింపారు. కుటుంబానికి దూరంగా వసతి గృహంలో ఉంటున్న విద్యార్థులతో ఆప్యాయంగా గడుపుతూ వారిని సంతోషపరిచారు.
ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ.. అభం శుభం తెలియని చిన్నారులైన మానసిక దివ్యాంగ విద్యార్థులతో కలిసి దీపావళి జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్న వీరితో కలిసి పండుగ జరుపుకోవడం ద్వారా తమ కుటుంబ సభ్యులతోనే దీపావళి జరుపుకున్నామనే ఆత్మీయ భావన వారిలో కలుగుతుందన్నారు.
దైవ స్వరూపులైన మానసిక దివ్యాంగులను ఆదరించడం, అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. దాతలు, స్వచ్ఛంద సంస్థలు మానవతా దృక్పథంతో ముందుకొచ్చి ఇలాంటి విద్యార్థులకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు.
అనంతరం మంత్రి నిమ్మల కుటుంబ సభ్యులు గోమాతకు దానా వేసి పూజలు నిర్వహించారు. ఆప్యాయత, అనురాగాల మధ్య అంజలి పాఠశాలలో దీపావళి వేడుకలు ఆనందంగా సాగాయి.