03/09/2026
భారతదేశం బుద్ధుని దేశమైతే… మరి ఇంతకాలం చెప్పిన విష్ణు అవతారాలు ఎక్కడ?
అమెరికాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ భారతదేశాన్ని “బుద్ధుని దేశం”గా పేర్కొంటూ, మన దేశం శాంతిని కోరుకునే దేశమని చెప్పారు. బుద్ధుని దేశంగా భారత్ శాంతిని కోరుకోవాలని, ఇతర దేశాలు యుద్ధం వైపు వెళ్లే అవకాశం ఉన్నందున మన దేశానికి రక్షణ శక్తి అవసరమని ఆయన వివరించారు.
ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది.
ఇన్నాళ్లు హిందుత్వ సిద్ధాంతంలో విష్ణువును ప్రధాన దేవుడిగా, రాముడు కృష్ణుడు విష్ణువు అవతారాలుగా, రామాయణం మహాభారతం పురాణాలను హిందూ సంప్రదాయానికి ముఖ్యమైన ఆధారాలుగా చెబుతూ వచ్చిన ఆర్‌ఎస్‌ఎస్ నాయకత్వం, అమెరికా వంటి విదేశీ గడ్డపై ప్రపంచానికి భారతదేశాన్ని మాత్రం బుద్ధుని దేశంగా ఎందుకు పరిచయం చేస్తోంది?
ప్రపంచానికి చెప్పడానికి బుద్ధుడే ఎందుకు గుర్తుకు వస్తున్నారు?
విదేశాల్లో బుద్ధుడి గురించి మాట్లాడితే ఆయన ఒక చారిత్రక వ్యక్తిగా, ఆయన బోధనలు మరియు బౌద్ధ సంప్రదాయం చారిత్రక ఆధారాలతో చర్చించగలిగేవిగా ఉండటం వల్లనా? విష్ణువు అవతారాల గురించి, రాముడు కృష్ణుడు గురించి పురాణ కథనాలను చారిత్రక సత్యాలుగా చెబితే ప్రపంచం ప్రశ్నిస్తుందనే విషయం తెలుసు కాబట్టినా?
అలా అయితే స్వదేశంలో పరిస్థితి ఎందుకు భిన్నంగా ఉండాలి?
విదేశాల్లో బుద్ధుడిని భారతదేశానికి ప్రతినిధిగా చూపించి, స్వదేశంలో మాత్రం రాముడు కృష్ణుడు విష్ణువు అవతారాలు, పురాణాలనే ప్రధాన సత్యాలుగా ఎందుకు ప్రచారం చేయాలి?
భారతదేశం నిజంగా బుద్ధుని దేశమైతే, బుద్ధుని చరిత్రను భారత ప్రజలకు కూడా అదే గౌరవంతో చెప్పాలి. అదే సమయంలో రాముడు, కృష్ణుడు, విష్ణువు అవతారాల విషయంలో ఏది చరిత్ర, ఏది మత విశ్వాసం, ఏది పురాణ సంప్రదాయం అనే తేడాను కూడా స్పష్టంగా చెప్పాలి.
ఒక దేశానికి రెండు రకాల చరిత్రలు ఉండవు. విదేశీయుల ముందు ఒక మాట, స్వదేశ ప్రజల ముందు మరో మాట ఉండకూడదు.
అందుకే ప్రశ్న సూటిగా ఉంది.
విదేశాల్లో బుద్ధుడు నిజం… స్వదేశంలో రాముడే నిజం అన్నట్టుగా ఎందుకు మాట్లాడుతున్నారు?
భారతదేశం బుద్ధుని దేశమైతే… ఇంతకాలం చెప్పిన విష్ణు అవతారాల స్థానం ఏమిటి?
ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది ప్రజలు కాదు. ఇన్నాళ్లు ఈ సిద్ధాంతాలను ప్రజలకు వివరించిన ఆర్‌ఎస్‌ఎస్ నాయకత్వమే.
చరిత్రను దేశాన్ని బట్టి మార్చకండి. ప్రజలకు నిజం చెప్పండి. ఆధారాలను చూపండి.
హిందువులారా మేల్కోండి. ప్రశ్నించండి. ఆధారాలను పరిశీలించండి.
✍️ Bandapalli Shiva Reddy.