05/09/2026
*స్పందన మానసిక వికాస కేంద్రంలో ఉపాధ్యాయ దినోత్సవం*
*ప్రపంచ స్థితిని మార్చగలిగేవాడే ఉపాధ్యాయుడు*
*విశాలాంధ్ర బుక్‌హౌస్ ఎడిటర్ గడ్డం కోటేశ్వరరావు గారు*
🔯 *స్పందనలో మానసిక దివ్యాంగులు చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయం*
🔯 *నా శిష్యుడు వెంకట్ ఈ సమాజానికి చేస్తున్న సేవలకు ఉపాధ్యాయుడిగా గర్వపడుతున్న*
ప్రపంచ స్థితిని, స్వరూపాన్ని మార్చగలిగే శక్తి ఉపాధ్యాయుడికి ఉందని వి.కె.ఆర్. కళాశాల విశ్రాంత లెక్చరర్,వామపక్ష వాది, ఆంధ్రప్రదేశ్ విశాలాంధ్ర బుక్‌హౌస్ ఎడిటర్ గడ్డం కోటేశ్వరరావు గారు అన్నారు.హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం గన్నవరం మండలం దావాజిగూడెంలోని స్పందన మానసిక వికాస కేంద్రంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గడ్డం కోటేశ్వరరావు మాట్లాడుతూ, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సాధారణ ఉపాధ్యాయుడి స్థాయి నుంచి భారత రాష్ట్రపతి స్థాయికి ఎదిగారని, విద్యార్థుల అభ్యున్నతికి అందించిన సేవలకు గుర్తింపుగా సర్వేపల్లి జయంతిని దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవంగా మనమంతా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
ఉపాధ్యాయులు తమ వృత్తికి అంకితభావంతో పనిచేస్తూ విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించాలని సూచించారు. ముఖ్యంగా మానసిక దివ్యాంగ బాలలకు బోధించే ఉపాధ్యాయులు ప్రేమ, నైపుణ్యం, ఓర్పు, సహనంతో పాటు బాధ్యతాయుతంగా పనిచేసినప్పుడే వారి జీవితాల్లో మరింత మెరుగైన మార్పు తీసుకురాగలమన్నారు.గన్నవరం ప్రాంతంలో దివ్యాంగుల సంక్షేమం కోసం స్పందన మానసిక వికాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి, ఎంతోమంది దివ్యాంగ బాలల అభివృద్ధికి కృషి చేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న తన శిష్యుడు, హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ చైర్మన్ సంకాబత్తుల వెంకట్ సేవలను గడ్డం కోటేశ్వరరావు గారు ప్రశంసించారు. దివ్యాంగ బాలల తల్లిదండ్రుల్లో భరోసా కల్పిస్తూ వారి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయడం అభినందనీయమని, దివ్యాంగుల అభివృద్ధి కోసం హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థలు, సేవాభావం కలిగిన ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. స్పందన మానసిక వికాస కేంద్రం అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని గడ్డం కోటేశ్వరరావు గారు తెలిపారు.
ఈ సందర్భంగా హెల్పింగ్ హ్యండ్స్ సొసైటీ చైర్మన్ సంకాబత్తుల వెంకట్ మాట్లాడుతూ గురుపూజోత్సవం సందర్భంగా వేలాది మంది విద్యార్థులను ఉన్నత స్థాయికి తీర్చిదిద్దిన మా మాష్టారు గడ్డం కోటేశ్వరరావు (జీకేఆర్)ను స్పందన లో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవం నకు ముఖ్య అతిధిగా విచ్చేసి ఆశీస్సులు అందించడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన అన్నారు.స్పందన మానసిక వికాస కేంద్రం ఏర్పాటు చేసి సేవలందించడం నా పూర్వజన్మ సుకృతం అని వెంకట్ అన్నారు.
గురుపూజోత్సవ విశిష్టత పురస్కరించుకొని ముఖ్యఅతిథిగా విచ్చేసిన గడ్డం కోటేశ్వరరావు గారిని స్పందన మానసిక వికాస కేంద్రంలోని బాలలకు ఉత్తమ సేవలందిస్తున్న ఉపాధ్యాయులను హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ తరఫున ఘనంగా సత్కరించడం జరిగింది. బాలలకు స్వీట్లు, పండ్లు అందించడంతో పాటు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ సెక్రటరీ సంకాబత్తుల రజిత వెంకట్, దినేష్ రాణి గారు స్పందన మానసిక వికాస కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.