15/10/2026
కడప జిల్లాలో మారిన సీన్..... వైసీపీకి అంత ఈజీ కాదు.!
మాజీ సీఎం జగన్ సొంత జిల్లా కడప జిల్లాలో ఈ సారి స్థానిక సంస్థల ఎన్నికల పోరు హోరాహోరీగా సాగనుంది. ఈ సారి ఎన్నికలను అధికార కూటమితో పాటు వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. జిల్లాలోని కడప మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు మొత్తం 9 మున్సిపాలిటీల్లోనూ అధికార పార్టీ దూకుడు పెంచడంతో, వైసీపీకి ఎదురుగాలి వీస్తోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
గతంలో YSR కుటుంబానికీ, వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్న కడపలో ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా మారుతున్నాయి. ఎన్నికలు సజావుగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగితే ఫలితాలు ఎలా ఉంటాయన్నదానిపై ఎవరి అంచనాలు వారు వేస్తున్నప్పటికీ, ప్రస్తుత రాజకీయ సమీకరణాలు, అధికార పక్షం వ్యూహాలతో వైసీపీకి గెలుపు సవాల్‌గా మారిందనే చెప్పాలి.
కడప మున్సిపల్ కార్పొరేషన్‌లో YSR హయాం నుంచి వారి ఫ్యామిలీ హవానే నడిచింది. అయితే ప్రస్తుతం ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అధికార పార్టీలో అభ్యర్థి ఎంపికపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, వైసీపీ తరఫున బండి నిత్యానంద్‌రెడ్డి సతీమణి దీప్తిరెడ్డి బరిలో నిలవనున్నారు.
జిల్లాలో కడప తర్వాత అతిపెద్దదైన ప్రొద్దుటూరులో పోటీ నువ్వా-నేనా అన్నట్లుగా సాగనుంది. ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వర్గం, టీడీపీ మాజీ ఇంచార్జ్ జీవీ ప్రవీణ్‌రెడ్డి వర్గాల మధ్య టికెట్ పోరు నడుస్తోంది. మరోవైపు వైసీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి వ్యూహాత్మకంగా బీసీ అభ్యర్ధిని బరిలోకి దించే యోచనలో ఉన్నారు. అధికార బలంతో ఫలితాలను తారుమారు చేయాలనే వ్యూహంలో కూటమి నేతలు ఉన్నారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకం. ఇక్కడ వైసీపీ తరఫున వైఎస్ మనోహర్‌రెడ్డి సతీమణి బరిలో నిలవనున్నారు. కుప్పంలో గెలుపునకు ప్రతికారంగా పులివెందులలో ఎలాగైనా పాగా వేయాలని టీడీపీ పెద్దలు పట్టుదలగా ఉన్నారు. రూరల్ జెడ్పీటీసీ ఉప ఎన్నిక అనుభవాల దృష్ట్యా, ఇక్కడ వైసీపీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
అలాగే బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జమ్మలమడుగు, ఎర్రగుంట్ల ప్రాంతాల్లో పోరు తీవ్రస్థాయిలో ఉంది. జమ్మలమడుగులో వైసీపీ ఒక్క వార్డు గెలిచినా రాజకీయాల నుంచి నిష్క్రమిస్తానంటూ ఆదినారాయణ రెడ్డి విసిరిన సవాల్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అభ్యర్థుల ఎంపిక దగ్గరి నుంచి ప్రచారం వరకు ఇక్కడ అధికార కూటమిదే పైచేయిగా కనిపిస్తోంది.
మిగతా మున్సిపాలిటీలైన బద్వేల్, మైదుకూరు, రాజంపేట, రాయచోటి, కమలాపురంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రాయచోటిలో మంత్రి మండిపల్లి రాంప్రస్రాద్‌రెడ్డి పూర్తిస్థాయి పట్టు సాధించేందుకు ప్రణాళికలు రచిస్తుండగా, ఇతర చోట్లకూడా అధికార కూటమి నాయకులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. వైసీపీకి బలమైన కేడర్ ఉన్నప్పటికీ,గెలుపు అంతా ఈజీ కాదన్న మాట వినిపిస్తోంది.
మొత్తంగా చూస్తే, ఉమ్మడి కడప జిల్లాలో ప్రతి చోటా వైసీపీకి బలమైన కేడర్ ఉన్నప్పటికీ, మారిన రాజకీయ పరిస్థితులు, అధికార కూటమి దూకుడు, వ్యూహాత్మక అడుగుల కారణంగా ఆ పార్టీకి ఈ ఎన్నికలు మునుపెన్నడూ లేనివిధంగా పెద్ద సవాల్‌గా మారాయి.