మాఘ పురాణం 29
మాఘమాసమందు ఏకాదశీ మహాత్మ్యము – క్షీర సాగర మథనము.
మాఘమాసమునందు నదీస్నానము చేసి మాఘమాస వ్రతాన్ని ఆచరించిన వారికి అశ్వమేథ యాగము చేసిన ఫలము కలుగును. అట్లే ఈ మాఘమాస ఏకాదశీ వ్రతం చేసి ఉపాసం వున్న వారలు వైకుంఠప్రాప్తినొందగలరు.
మాఘమాసమందు ఏకాదశీ వ్రతమొనరించి సత్ఫలితము పొందిన దేవతలకథలు వినండి.
పూర్వకాలమందు దేవతలు, రాక్షసులు క్షీర సాగరమును మధించి అమృతమును గ్రోలవలెనని అభిప్రాయమునకు వచ్చిరి. మంధర పర్వతమును కవ్వముగాను, వాసుకి అను సర్పమును త్రాడుగాను, చేసుకొని క్షీరసాగరాన్ని మధించసాగారు. తలవైపు రాక్షసులు, తోక వైపు దేవతలు ఉండి మధించుచుండగా మొదట లక్ష్మీదేవి పుట్టినది. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని భార్యగా స్వీకరించాడు. పిమ్మట ఉచ్చైశ్రవము అనే గుఱ్ఱము, కామధేనువు, కల్పవృక్షము ఉద్భవించాయి. వాటిని విష్ణుమూర్తి ఆదేశంపై దేవేంద్రుడు భద్రపరిచాడు. మరల పాల సముద్రమును మధించగా లోకభీకరమైన ఘన తేజస్సుతో నొప్పారు అగ్ని తుల్యమైన హాలాహలము పుట్టినది. ఆ హాలాహల విష జ్వాలలకు సమస్త లోకములూ నాశనమవసాగాయి. దేవతలు, రాక్షసులు భయపడి పారిపోసాగారు. సర్వులూ సర్వేశ్వరుని శరణుజొచ్చారు. భోళాశంకరుడగు సాంబశివుడు వారిని కరుణించి వెంటనే ఆ కాలకూట విషాన్ని తన కంఠమునందు బంధించాడు. కాలకూట విషమును పానము చేసినందువల్లనే శివుని కంఠము నీలంగా మారింది.
అందుకే శివునికి నాటినుండి నీలకంఠుడు అని పేరు వచ్చినది. మరల దేవ దానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని మధించగా అమృతం పుట్టింది. ఆ అమృతం కొరకు వారిరువురు తగవులాడుకొన సాగిరి. అంతట శ్రీమహావిష్ణువు మాయామోహిని అవతారమునెత్తి వారి తగవును పరిష్కరింపదలచాడు.
మాయామోహిని అందచందాలలో మేటి. ఆమె అందమునకు సరితూగు స్త్రీలు ఎవరూ లేరు. జగన్మోహిని యైన ఆమె అతిలోక సౌందర్యవతి. తన మాయా మోహన రూపంతో అందరినీ ఆకర్షించగల అద్భుత సౌందర్యరాశి. ఆమె వారిరువురి మధ్యకూ వచ్చి అమృతాన్ని ఇరువురికీ సమానముగా పంచెదను. ఎందుకీ తెగని తగవులాట? మీరందరూ ఒక వరుస క్రమంలో నిలబడితే అందరికీ అమృతాన్ని పంచుతాను. మీకిష్టమేనా? అన్నది.
దేవదానవులు అంగీకరించారు. ఆమె అద్భుత సౌందర్యమునకు పరవశించి రాక్షసులు కూడా మారు మాట్లాడకుండా దేవతలందరూ ఒక వరుసలోనూ, రాక్షసులందరూ మరొక వరుసలోనూ నిలబడిరి. జగన్మోహిని రెండు భాండములను తీసుకొని ఒక భాండమునందు సురను, మరొక దానియందు అమృతమును నింపి నర్తిస్తూ మురిపిస్తూ మైమరపిస్తూ తన వయ్యారపు నడకలతో చిరునవ్వులు చిందిస్తూ రాక్షసులను ఊరిస్తూ వారికి తెలియకుండా సురను రాక్షసులకు, అమృతమును దేవతలకు పోయసాగింది. మంద భాగ్యులైన రాక్షసులు ఇదేమీ గమనించకుండా ఆమె అద్భుత సౌందర్యమునకు మురిసిపోతూ పరవశింప సాగారు. ఈవిధంగా రాక్షసులను తన వలపు వయ్యారాలతో ఊరిస్తూ సురను మాత్రమే పోస్తోంది. ఈ కనికట్టును గమనించిన రాహుకేతువులు మాయాదేవతగా మారి దేవతల పంక్తిలో కూర్చొని అమృతాన్ని పానం చేశారు. రాహుకేతువులు చేసిన ఆగడాన్ని కనిపెట్టిన జగన్మోహిని కోపించి తన చక్రాయుధంతో తలను నరికివేసింది. ఈమోసమునకు రాక్షసులు, దేవతలు గొడవపడ్డారు. శ్రీమహావిష్ణువు మిగిలిన అమృతాన్ని దేవేంద్రుడికి ఇచ్చాడు. త్రిమూర్తులు అదృశ్యమయ్యారు.
దేవేంద్రుడు అమృత భాండాన్ని భద్రపరచుచుండగా రెండు చుక్కలు విధివశాత్తూ నేలరాలాయి. అవి పడిన చోట రెండు దివ్యమైన మొక్కలు పెరిగాయి. అవే పారిజాత, తులసి మొక్కలు. సత్రాజిత్తు అనే మహారాజు వాటికి నీరుపోసి పెంచసాగాడు. కొంత కాలమునకు పారిజాత వృక్షము పుష్పించి అద్భుతమైన సువాసనలను వెదజల్లసాగింది. ఒకనాడు దేవేంద్రుడు అటువైపుగా వెళ్తూ పారిజాత పుష్ప వాసనకు పరవశించి ఒక పువ్వును కోసుకొని తన భార్యయైన శచీదేవికి ఇచ్చాడు. మిగిలిన వారు కోరగా మరల వచ్చి రహస్యంగా పువ్వులను కోయదలచి తోటలో ప్రవేశించాడు. అంతకు ముందే తన తోటలోని పువ్వులను ఎవరో అపహరిస్తున్నారని అనుమానం వచ్చిన సత్రాజిత్తు శ్రీ మహావిష్ణువుకు పూజ చేసి మంత్రించిన అక్షతలను పువ్వులపై, వనమంతా జల్లాడు. దేవేంద్రుడు పారజాత పువ్వును త్రెంచుచుండగా అక్షతల ప్రభావం వల్లనో, విష్ణు మహిమ వల్లనో మూర్ఛపోయాడు. ఈవార్త తెలిసిన దేవతలందరూ నారదుణ్ణి బ్రతిమలాడగా నారదుడు కృష్ణుని వద్దకు పోయి విషయాన్ని వివరించాడు. అంత కృష్ణుడు తన మామగారైన సత్రాజిత్తు వద్దకు బయలుదేరాడు. సత్రాజిత్తు మిక్కిలి భగవద్భక్తి పరాయణుడగుటచే అమోఘమైన శక్తిచే అలరార సాగాడు. భగవంతుడైన శ్రీకృష్ణుడు అతనికి శ్రీ మహావిష్ణువు రూపమున కనిపించి అతనికి వరప్రసాద మొనరించి అమృత తుల్యమగు పారిజాత వృక్షాన్ని దానికర్హుడగు దేవేంద్రునికి ఇప్పించెను. అట్లే తులసిని తన సన్నిధిలో ఉండమని చెప్పగా నాటినుండి తులసి శ్రీమహావిష్ణువు సాన్నిధ్యంలో ఆయనతో సమానంగా పూజలు అందుకొన సాగింది. అందుచే తులసిని పూజించినచో సకల సౌభాగ్యములు సిద్ధించును.
ఫలశ్రుతి:
సూతమహర్షి శౌనకాది మునులతో మహర్షులారా! వశిష్ఠుల వారు దిలీపునకు తెలియజేసిన మాఘమాస మహాత్మ్యమును, మాఘ స్నాన మహిమను మీకు వివరించితిని. మీరు తలపెట్టిన పుష్కర యజ్ఞం కూడా పూర్తి కావచ్చింది. కావున సర్వులూ మాఘమాస వ్రతమును, నదీ స్నానమును నియమ నిష్ఠలతో చేసి ఆ శ్రీహరి కృపకు పాత్రులు కండి. మాఘమాసంలో సూర్యుడు మకర రాశియందుండగా సూర్యోదయం అయిన తర్వాత నదిలో స్నానం చేయాలి. ఆదిత్యుని పూజించి విష్ణ్వాలయమును దర్శించి శ్రీమన్నారాయణునకు పూజలు చేయాలి. మాఘమాసం ముప్పది రోజులూ క్రమం తప్పక మిక్కిలి భక్తి శ్రద్ధలతోనూ, ఏకాగ్రతతోనూ, చిత్తశుద్ధితోనూ శ్రీమహావిష్ణువు ను మనసారా పూజించినచో సకలైశ్వర్య ప్రాప్తియూ, పుత్రపౌత్రాభివృద్ధియు, వైకుంఠప్రాప్తి నొందగలరు.
సర్వే జనాః సుఖినో భవన్తు!!
మాఘపురాణం సంపూర్ణం
#మాఘపురాణం #మాఘమాసం
Mogappair Telugu Cultural and Social Association - MTCSA
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Mogappair Telugu Cultural and Social Association - MTCSA, Social service, Mogappair, Chennai.
శివరాత్రి జాగారం
ఉపవాసం ఎందుకు చేస్తారో తెలుసా ?
శివరాత్రి పర్వదినాన ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ శివ నామ స్మరణతో మారుమోగిపోతాయి.
శివారాధనలో లింగరూపంలో పూజిస్తారు. ప్రతి లింగంలోనూ శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని నమ్మకం.
వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రధానమైనవి. మహాశివరాత్రి పర్వదినాన శివాలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తుంది. అభిషేకాలు , పూజలతో పరమశివుని ఆరాధిస్తారు. దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు.
రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు , భజనలతో శివనామం మారుమోగుతుంటుంది.
ఈ పర్వదినాన లింగాష్టకం , శివ పంచాక్షరి జపిస్తారు. దీపారాధన చేసి , భక్తి ప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివపార్వతుల కల్యాణం చేస్తారు. రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో , చింతనలో గడిపి , రాత్రి జాగారం చేస్తారు. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం, జాగారం ముఖ్యం.
*అసలు శివరాత్రి విశిష్టత ఏమిటి ? ఆ రోజు ఉపవాసం ఎందుకుంటారు ? జాగారం ఎందుకు చేస్తారు ? జాగారం ఎవరు , ఎప్పుడు ప్రారంభించారు ?*
*అంటే దానికి ఒక కథ ఉంది…. అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మథనం చేశారు. అప్పుడు అమృతం కంటే ముందు హాలాహలం పుట్టింది. హాలాహలాన్ని అలాగే విడిచిపెట్టేస్తే అది ముల్లోకాలనూ దహించేసే ప్రమాదం ఉండటంతో దేవదానవులందరూ భయాందోళన చెందారు. హాలాహలం బారి నుంచి లోకాలను రక్షించాలంటూ మహాదేవుడైన శంకరుడిని శరణు వేడారు. లోక రక్షణ కోసం ఆ గరళాన్ని తానే మింగి , గొంతులో బంధించి అలా గరళకంఠుడయ్యాడు. హాలాహల ప్రభావానికి శివుడి కంఠం కమిలి , నీలంగా మారడంతో నీలకంఠుడిగా పేరుపొందాడు. గరళాన్ని గొంతులో బంధించడం వల్ల అది శివునిలో విపరీతమైన తాపాన్ని పుట్టించసాగింది. ఆ తాపాన్ని తగ్గించుకోవడానికి క్షీరసాగర మథనంలో పుట్టిన చంద్రుడిని తలపై ఉంచుకున్నాడు. నిరంతర తాపోపశమనం కోసం గంగను కూడా నెత్తిన పెట్టుకున్నాడు.*
*అయినా, శివుడిని హాలాహల తాపం ఇబ్బంది పెడుతూనే ఉంటుందట. అందుకే భక్తులు నిత్యం శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు. హాలాహలం మింగినప్పుడు దాని ప్రభావానికి శివుడు మూర్ఛిల్లాడట. ఆందోళన చెందిన దేవతలు శివుడికి మెలకువ వచ్చేంత వరకు జాగారం చేశారట. అందుకే ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం చేసి, జాగారం ఉంటారు. జాగారం ఉన్న సమయంలో శివనామ సంకీర్తనతోనూ , జప ధ్యానాలతోనూ కాలక్షేపం చేస్తారు. ఇదంతా మహాశివరాత్రి పర్వదినానికి గల పౌరాణిక నేపథ్యం. నిజానికి శివారాధన పురాణాలకు ముందు నుంచే ఉనికిలో ఉంది.*
*క్రీస్తుపూర్వం 3వేల ఏళ్ల నాడే సింధులోయ నాగరికత విలసిల్లిన కాలంలో శివుడిని పశుపతిగా ఆరాధించేవారు.
* #శివుడి అభిషేకం యొక్క గొప్పతనం*
శివరాత్రి సందర్భంగా…
1) శివుని రుద్రాభిషేకం చాలా శక్తివంతమైనది
2) ఈ విశ్వంలో శివాభిషేకంతో సాధించలేనిది ఏదీ లేదు
3) దీనిని రుద్ర నమక చమకంతో చేస్తారు
4) జ్ఞానం, ఆరోగ్యం & సంపదకు మూలం శివుడే
5) మనిషి సమస్యలన్నీ కూడా శివాభిషేకం ద్వారా పరిష్కరించబడతాయి
6) మానవుల కోరికలు అన్నీ కూడా శివాభిషేకంతో సాధించబడతాయి
7) శివాభిషేకంతో మొత్తం ఈ విశ్వం చల్లబడుతుంది
8) అందుకే శివ లింగం ఎండిపోకుండా - ఎప్పుడూ చుక్క చుక్కగా నీళ్ళు పడేలా ఉంచుతారు
9) శివుడు తనంతట తానుగా కోపం తెచ్చుకోడు. ఆయన ఎప్పుడూ తనలో తాను రమిస్తూ ఉంటాడు
10) పార్వతీదేవి శివుడిని రుద్రునిగా మారుస్తుంది & రుద్రుడిని శివునిగా మారుస్తుంది
11) శివపార్వతులు ఈ విశ్వానికి తల్లిదండ్రులు అని భావిస్తాము.✍️
#
మాఘ పురాణం - 27 వ అధ్యాయము
సులక్షణ మహారాజు కథ
గృత్నృమదమహర్షి జహ్నుమునితో నిట్లనెను. జన్మ సంసారము అను సముద్రమును, దాటనక్కరలేని సాధనమే, మాఘమాసవ్రతము. దాని ప్రశస్తిని వెల్లడించు మరియొక కథను వినుము. పూర్వము ద్వాపరయుగమున అంగదేశమును పాలించుచు సులక్షణుడను రాజు కలడు. అతడు సూర్యవంశమున జన్మించినవాడు. బలపరాక్రమములు కలవాడు. ప్రజలను చక్కగా పరిపాలించువాడు. వానికి నూరుగురు భార్యలున్నను, సంతానము మాత్రము లేదు. రాజులందరును, వానికి సామంతములై, కప్పములు చెల్లించుచున్నను, సంతానము లేదను విచారము మాత్రము, రాజునకు తప్పలేదు.
నేనేమి చేసిన కులవర్ధనుడగు పుత్రుడు జన్మించును, పెద్దలు, పుత్రులు లేనివారికి, దరిద్రునికి, కృతఘ్నునకు, వేదహీనుడగు విప్రునకు, సద్గతి లేదనియందురు. పుత్రులు లేని నేను, మహర్షుల యాశ్రమమునకు పోయి, అచట పెద్దలను ప్రార్థించినచో, పుత్రులు కలుగుటకు, వారేమైన ఉపాయము చెప్పగలరేమో? ప్రయత్నించి చూచెదను, అని నిశ్చయించెను. అనేకమంది మహర్షులు కల నైమిశారణ్యమునకు పోవుటయే మంచిదని నైమిశారణ్యమునకు వెళ్లెను, అచట మునులకు నమస్కరించి, తన బాధను వారికి వివరించెను. అప్పుడు వారు కొంతసేపు ఆలోచించి, యిట్లనిరి. "రాజా! వినుము. నీవు పూర్వజన్మలో సౌరాష్ట్ర మహారాజువు, సర్వసంపన్నుడవైనను, మాఘమాసమున, రధసప్తమి నాడు, కూష్మాండ దానమును చేయలేదు. అందువలన నీకీ జన్మలో, సంతానము కలుగలేదు. ఇందువలననే, యింతమంది భార్యలున్నను, నీకు సంతానము కలుగలేదు" అని చెప్పిరి. అప్పుదు రాజు, "నాకు సంతానము కలుగునుపాయము" చెప్పుడని వారిని ప్రార్థించెను. అప్పుడా మునులొక ఫలమును మంత్రించి, రాజునకిచ్చిరి. దీనిని నీ భార్యలందరికిని పెట్టుము. ఇందువలన నీకు నూరుగురు పుత్రులు జన్మింతురని చెప్పిరి. సులక్షణ మహారాజు సంతోషముతో, మునులకు నమస్కరించి, కృతజ్ఞతను వెల్లడించి యింటికి వచ్చెను. రాణులు సంతోషముతో వానికెదురు వెళ్ళిరి. ప్రజలు సంతోషముతో, స్వాగతమును చెప్పిరి. అలసి ఇంటికి వచ్చిన రాజు, ఆ ఫలమును శయ్యా గృహమునుంచెను. స్నానము మున్నగునవి చేయవలెనని లోనికి వెళ్ళెను. ఆ రాజు చిన్న భార్య, ఆ ఫలము దొంగలించి, తానొక్కతియే ఆ ఫలమును తినెను. మహారాజు తిరిగి వచ్చి చూడగా, ఆ ఫలము లేదు. సేవకులను, రాణులను తర్కించి అడుగగా, వారు తమకు తెలియదనిరి, తుదకు చిన్న భార్య తాను చేసిన పనిని చెప్పెను. రాజు యేమియు చేయలేక ఊరకుండెను. కొన్నాళ్లకామె గర్భవతి అయ్యెను. మహారాజు మునుల మాట ఫలించినది కదా అని సంతుష్టుడయ్యెను. చిన్న భార్య యిట్లు గర్భవతి యగుట మిగిలిన భార్యలకిష్టము లేదు. ఆమె గర్భము పోవుటకై, వారెన్నియో ప్రయత్నములను చేసిరి. కాని దైవబలమున, అవి అన్నియు, వ్యర్థములయ్యెను. కాని వారు చేసిన ప్రయత్నము వలన, గర్బపాతమునకిచ్చిన మందుల వలన, చిన్న భార్య మతిచెడెను. ఎవరికి తెలియకుండ అడవిలోనికి పారిపోయెను. ప్రయాణపు బడలికకు, ఆమె అలసెను. ఒక పుత్రుని కని, యొడలు తెలియక పడియుండెను. గుహలోనున్న పులి, బాలింతను యీడ్చుకొని, పోయి, భక్షించెను.
అప్పుడే పుట్టిన బిడ్డ, రక్తపు ముద్దగా నుండి దుఃఖించుచుండగా, హంసల గుంపు వచ్చి, రెక్కలను చాపి, యెండ మున్నగువాని బాధ, ఆ శిశువునకు లేకుండ చేసినది. తేనె పండ్ల గుజ్జు మున్నగువానిని, బాలునకు పెట్టి, ఆ పక్షులు వానిని రక్షించినవి. బాలుడును, పక్షుల పెంపకమునకు అలవాటుపడి, అచటనే తిరుగుచుండెను. అచటి సరస్తీరమున అతడాడుకొనుచుండగా, హంసలు నదిలో విహరించెడివి. ఒకనాడు పవిత్రదినమగుటచే, సమీప గ్రామముల వారు, సకుటుంబముగా ఆ సరస్సునందు స్నానమాడవచ్చిరి, అట్లు వచ్చినవారిలో, ఇద్దరు భార్యలుండి, సంతానను లేని గృహస్థు ఒకడు, వారితో బాటు, స్నానమునకు వచ్చెను. అచట తిరగాడుచున్న బాలుని చూచి, ముచ్చటపడి, యింటికి గొనిపోవలెను అని తలచి, ఈ బాలుడెవరు? యెవరి సంతానము అడవిలో యేల విడువబడెను? అని యెంత ఆలోచించినను, వానికి సమాధానము దొరకలేదు, వనమున, జలమున, గర్భమున, నెచటనున్న వానినైనను రక్షించి, పాలించు వాడు శ్రీమన్నారాయణ మూర్తియే కదా! ఆయనయే, నాకీ బాలుని యిట్లు చూపినాడని తలచెను. బాలుని యింటికి గొనిపోయెను. సవతులైన వాని ఇద్దరు భార్యలు, ఎవరికి వారు, వారే ఆ బాలుని పెంచవలెను అని, పరస్పరము వివాద పడుచుండిరి. ఈ విధముగా రెండు సంవత్సరములు గడచెను. ఒకనాడు ఆ గృహస్థు ఇంట లేని సమయములో, పెద్ద భార్య, ఆ బాలుని అడవిలో విడచి వచ్చెను. ఇంటికి వచ్చిన గృహస్థు, బాలుని యెంత వెదకినను, కనిపించలేదుl.
అడవిలో విడువబడిన బాలుడేడ్చుచు, వింటివలెనున్న తులసి పొదవద్దకు వెళ్ళెను. అచటె పండుకొనెను. తులసీ స్పర్శవలన, బాలునకావనమున, యెట్తి ఆపదయు రాలేదు. శ్రీహరి అనుగ్రహమున, వానికి రాత్రి గడచినది. యెవరును లేని ఆ బాలుడు యేడ్చుట తప్ప, మరేమి చేయగలడు? వాని దైన్యము, నిస్సహాయత, ఆ అడవిలోనుండు పశుపక్ష్యాదులలోని జీవలక్షణమునకు విలువైనది.
అడవిలో గల ప్రాణులు, మృగములు, పక్షులు, అచటికి వచ్చినవి, బాలుని నిస్సహాయత, ధైర్యము, వానిలోని దివ్యలక్షణములను మేల్కొలిపి, వానిపై జాలిని కలిగించినవి. ఆ ప్రాణులును కన్నీరు కార్చినవి.
ఒకరి బాష మరొకరికి తెలియని రాజకుమారుడు, పశుపక్ష్యాదులు యిట్టి సహానుభూతి నందినప్పుడు, మరియొక మానవుడున్నచో వాడెంత దుఃఖించునో కదా! అట్లే బాలుడును, పక్షియోమృగమైనప్పుడు వాని దుఃఖము యెట్లుండునో కదా, బాలుడు పశుపక్ష్యాదులు , విభిన్నజాతులవారైనను, వారిలోని పరమేశ్వరుని అంశయగు జీవాత్మ మూలము. ఒక చోటనుండి వచ్చినదే. అదియే దివ్యత్వము, కాని విచిత్రమేమనగా, బాలునికి తనజాతిదే అయిన స్త్రీ వలన ఆపదవచ్చినది. ఆ విప్రుని మొదటి భార్య,ఆమెలోని దివ్యత్వము లోపించినది. సృష్టి విచిత్రమని యనుకొనుట తప్ప, మనకే సమాధానమును తోచదు. ఇదియే భగవంతుని లీల, అట్లు వచ్చిన పక్షులు, మృగములు బాలునిపై జాలిపడినవి. పక్షులు యెండ వానిపై బడకుండ, రెక్కలతో నీడను కల్పించినవి, తమ విచిత్ర రూపములతో, వాని మనస్సును, శోకము నుండి మరల్చినవి. మృగములును. తేనె, ముగ్గినపండ్లు వంటి ఆహారములను, వానికి తెచ్చి యిచ్చినవి. ఈ విధముగా, మృగములు, పక్షులు, వానికి తెచ్చి యిచ్చినవి. ఈ విధముగా మృగములు, పక్షులు, వానికి తాము చేయగలిగిన యుపచారములను చేసి, వాని దుఃఖములను మాన్పించి, తమ యుపచారములచే, వాని ఆకలిని తీర్చినవి. బాలుడు, తులసి పొదలో నుండుట, తులసిని జూచుట, తాకుట, మున్నగు పనులను, ఆతర్కితముగ చేయుటచే, పవిత్ర తులసీ దర్శన స్పర్శనాదుల వలన, దైవానుగ్రహము నాతడు పొందగలిగెను. తన జాతికి చెందని పశుపక్ష్యాదుల సానుభూతిని, యుపచారములను పొందెను. ఆ బాలుని పునర్జన్మ సంస్కారము వలన, యిట్టి సానుభూతిని, యితరుల నుండి పొందగల్గెను. అప్రయత్నముగ వాని నోటి నుండి, కృష్ణ, గోవింద, అచ్యుత మున్నగు భగవన్నామముల యుచ్ఛారణ శక్తి కలిగినది. అతడా మాటలనే పలుకుచు, తులసి పాదులో నివసించుచు, ఆడుకొనుచు, కాలమును గడుపసాగెను. అడవిలోనున్న తులసియే, దీనుడైన యొక బాలునకట్టి దయను, పశుపక్ష్యాదుల ద్వారా చూపినది. అట్టి తులసి, మన యిండ్లలోనుండి, మనచే పూజింపబడిన, మనపై యెట్టి అనుగ్రహమును చూపునో విచారింపుడు. తులసి మన యింట నుండుట వలన, మనము తులసిని పూజించుట వలన, మనకు దైవానుగ్రహము కలిగి, మరెన్నియో యిహపరలోక సుఖములనంద వచ్చును. పాపములను పోగొట్టుకొనవచ్చును. భగవదనుగ్రహమును మరింత పొందవచ్చును.
_*రాజకుమారుని పూజ - శ్రీహరి యనుగ్రహము*_
సులక్షణ మహారాజు గర్భవతియగు తన భార్యయేమైనదో తెలిసుకొనవలెనని, సేవకులను పంపి, వెదకించెను. కాని ఆమె జాడ తెలియలేదు. నిరాశపడి యూరకుండెను. అడవిలోనున్న రాజకుమారుడు, పూర్వమునందువలెనే, శ్రీహరినామస్మరణ చేయుచు, పశుపక్ష్యాదులతో, మైత్రి చేయుచుండెను. తల్లి, తండ్రి, తాత, సోదరుడు, యిట్టి బంధువుల నెరుగడు. కేవలము, శ్రీహరి నామోచ్ఛారణము, శ్రీహరి పూజ, వానికి నిత్యకృత్యములయ్యెను. శ్రీహరి దర్శనము కలుగలేదు అని విచారము వానికి కల్గెను. అయినను శ్రీమన్నారాయణ స్మరణ మానలేరు. ఒకనాడు, ఆకాశవాణి, మాఘస్నాన వ్రతము నాచరింపుమని, వానికి చెప్పెను. రాజకుమారుడును, ఆకాశవాణి చెప్పిన మాటల ననుసరించి, మాఘస్నానము, పూజ, మున్నగు వానిని, ప్రారంభించెను.
మాఘశుక్ల చతుర్దశినాడు, రాజకుమారుని పూజాంతమున, శ్రీహరి వానికి దివ్యదర్శనమునిచ్చెను. శుభమును కలిగించు బాహువులలో, బాలుని కౌగిలించుకొనెను. ఓ బాలకా! "నాభక్తుడవైన నీకు వరమునిత్తును కోరుకొమ్మని పలికెను. బాలుడును నాకు నీపాద సాన్నిధ్యమును, చిరకాలమను గ్రహింపుమని కోరెను. శ్రీహరి "బాలకా! నీవు రాజువై, యీ భూమిని చిరకాలము పాలింపుము. మాఘమాస వ్రతమును మానకుము, పుత్రపౌత్ర సమృద్ధిని, సంపదలను, భోగభాగ్యములను పొందుము. నీవిప్పుడు నీ తండ్రి వద్దకుపొమ్ము. రాజువై చిరకాలము కీర్తిని, సర్వసంపదలను, సర్వసమృద్దులను, సర్వసుఖములను, అనుభవింపుము. మాఘమాస వ్రతమును మాత్రము విడువక, చేయుము. ఆ తరువాత, నా సన్నిధిని చేరుమని పలికెను. అచటనున్న, సునందుడను, వానిని పిలిచి, రాజకుమారుని, వాని తండ్రి వద్దకు చేర్చుమని, చెప్పెను. సపరివారముగ, అంతర్దానమందెను. సునందుడును, రాజకుమారుని దీసుకొని, సులక్షణ మహారాజు వద్దకు, వెళ్ళెను. రాజకుమారుని పూర్వ వృత్తాంతమును, శ్రీహరి అనుగ్రహమును, వానికి వివరించెను. పుత్రుని, వానికి అప్పగించెను. తన స్థానమునకు, తాను పోయెను.
సులక్షణ మహారాజు ఆశ్చర్యమును, ఆనందమును పొందెను. కుమారునకు, సుధర్ముడని, పేరిడెను. బాలుడు, విద్యాబుద్ధులను పొంది, పెద్దవాడైన తరువాత, వానిని, తన విశాల సామ్రాజ్యమునకు ప్రభువును చేసెను. వృద్ధుడైన సులక్షణుడు, భార్యలతో వనమునకేగెను. వానప్రస్థమును స్వీకరించి, కొంతకాలమునకు మరణించెను. వాని భార్యలును, సమాగమనము చేసి, పరలోకమునకు, భర్తననుసరించి తరలిరి. సుధర్ముడు, భక్తితో, తండ్రికి, తల్లులకు, శ్రద్ధతో, శ్రార్ధకర్మల నాచరించెను. సుధర్ముడును, తగిన రాజకన్యను వివాహమాడెను. ధర్మయుక్తముగ, ప్రజారంజకముగ, చిరకాలము, రాజ్యమును పాలించెను. పుత్రులను, పౌత్రులను, పెక్కు మందిని పొందెను.
అతడెప్పుడును, మాఘమాస వ్రతమును మానలేదు. పుత్రులతోను, మనుమలతోను, భార్యలతోను కలసి, జీవించియున్నంతవరకు, మాఘమాస వ్రతము నాచరించెను. తుదకు కుమారులకు రాజ్యమునిచ్చి, శ్రీహరి సాన్నిధ్యమును చేరెను.
జహ్నుమునీ! ప్రతి జీవియు తప్పక మాఘమాస వ్రతమును విడువక ఆచరింపవలయును. అట్లు చేసిన, శ్రీహరి భక్తులకు, యెట్టి భయమునుండదు. ఈ వృత్తాంతమును వినినవాడును, విష్ణుభక్తుడై మాఘమాసవ్రతము నాచరించి, విష్ణుప్రియుడై, యిహపరలోక సుఖములనంది, శ్రీహరి సాన్నిధ్యమునందును. సందేహము లేదు. అని, జహ్నుమునికి గృత్నృమదమహర్షి చెప్పెను.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
#మాఘమాసం #మాఘపురాణం #తెలుగు
మాఘ పురాణం - 26 వ అధ్యాయము
పుణ్యక్షేత్రములలో నదీస్నానము
ఈ విధముగా అనేక పుణ్యపురుషుల వృత్తాంతములను మాఘమాస స్నాన మహిమను దిలీప మహారాజునకు వశిష్టులవారు వివరించగా, ఆ రాజు "మహర్షి! మీ కృపవలన అనేక వృత్తాంతములను తెలుసుకొని కృతార్థుడనైతిని. కాని మరొక సంశయము నాకు గలదు, అది ఏమనగా, మాఘమాసమందు యే యే తీర్థములు దర్శింపవలెనో సెలవిం" డని వినమ్రుడై కోరగా వశిష్టులవారు మరల యిట్లనిరి.
దిలీప మహారాజా! మాఘస్నానములు చేయుట యందు ఆసక్తి గలవారలకు ముఖ్యమగు తీర్థమహిమలను గురించి వివరించెదను. శ్రద్దగా ఆలకింపుము. మాఘమాసములలో నదీ స్నానము ముఖ్యమైనది. మాఘస్నానములు చేయలేక, తీర్థములు సేవించిన చాలునని అనుకొనుట అవివేకము. ఏలననగా మాఘమాసములో యే నదిలోని నీరైనను గంగ నీటితో సమానము. అందుచేత మాఘమాసములో నదీస్నానము సర్వపాపహరమైనది. ఆవశ్యమైనది కూడా, అటులనే ప్రయాగ అతిముఖ్యమైన క్షేత్రం. ఈ భరత ఖండములలో అతి ప్రధానమైన గంగానది సముద్రములో కలియుచోట మాఘస్నాన మాచరించిన యేడు జన్మలలోని పాపములన్నియు సహితము హరించును. మాఘమాసములో నదీస్నానముతో బాటు విష్ణు దేవాలయములు, మహేశ్వరాలయములు మొదలగు మూడువందల అరవై పుణ్యక్షేత్రములు దర్శించిన యెడల గొప్ప ఫలము కల్గుటయేగాక మరల జన్మలనేవి కలుగదు.
ఇక త్రయంబకమను ముఖ్యమైన క్షేత్రం కలదు, ఇది పడమటి కనుమల దగ్గర ఉన్నది. అచటనే పవిత్ర గోదావరి నది జనించినది. గౌతముడు తన గోహత్యా దోషమును పొగొట్టుకొనుట కిచ్చటనే ఈశ్వరుని గురించి ఘోరతపస్సు చేసి గోహత్య జరిగిన ప్రాంతము మీదుగా గోదావరిని ప్రవహింప జేసినాడు. కావున మాఘమాసములో గోదావరియందు స్నానము చేసిన యెడల తక్షణమే సకల పాపములూ హరించి పోవుటయే గాక, ఇహమందు, పరమందు కూడా సుఖపడుదురు, మన దేశములో యెన్నో నదులున్నవి, ప్రతి నదీతీరమున యెన్నో క్షేత్రములున్నవి, ఆ నదులలో మహానదులు, పుణ్యనదులు ముఖ్యములు అవి వందకు పైగావున్నవి. అటువంటి కొన్నిపేరు స్మరించినచో ఆ నదీ తీరాలలో నున్న క్షేత్రదేవతలను కూడ స్మరించినట్లే అగును. అందుకని కొన్ని ప్రధానమైన నదుల పేర్లను గుర్తుచేసుకొందాము. నందిని, మందాకిని, నళిని, తామ్రవర్ణి, భీమరధి, గంగా, యమున, నేత్రావతి, పంపానది, కృష్ణవేణీ, మహేద్రతనయ, గోదావరి, నర్మదా మొదలైనవి మహానదులు. భగీరధి, గంగ, నర్మద, యమున, సరస్వతి, కృష్ణవేణీ, బాహుద, భీమరధి, తుంగభద్ర, రేణుక, మలావహరి, కావేరి, క్పతమాల, తామ్రపర్ణి, విశోక, కేశికి, గండకి, విచిత్రక, వశిష్ఠప్రవర, కాశ్యపి, సరయు, సర్వపాపహరి, కుశాపతి, పల్గుని కరతోయ, పుణ్యద, ప్రణిత మొదలైనవి పుణ్యనదులు. మహానదులు చిరకాలము నుండి ప్రవహించుచున్నవి. పుణ్యనదులు మహాత్ముల ప్రయత్నమువలన వారి పుణ్యము కొలది ప్రవహించి వారి పుణ్యమునందించునని, మహానదులు, పుణ్యనదులు రెండు విశిష్ట లక్షణములు కలిగిన గంగ, యమున మొదలైన నదులు, మహానదులుగానూ పుణ్యనదులుగాను అయివుండవచ్చును. ఈ నదులలో చేసిన స్నానం విశేషఫలప్రదం, మనము ఆ నదులలో స్నానము చేయలేకపోయినను, పవిత్ర మాఘమాసమున ఆ పేర్లను తలుచుకొన్నను పుణ్యమే కదా. ఈ స్మరణ వలన ఆ నదులను, ఆ నదీతీరములయందున్న పవిత్ర దైవములను కూడా స్మరించినట్లే అగును కదా. గౌతమీనదిలో మరికొన్ని ప్రసిద్దములగు ఉపనదులు కూడా కలసి తమతమ స్నేహ సౌభ్రాతృత్వములను చాటుచున్నవి. అటులనే "వరం తప" అని ఉపనది ప్రవహించేచోట కూడా శివుడు లింగాకారముతో వెలసి ఉన్నాడు. దానికి ఆవలగా ప్రభావము అను క్షేత్రము కలదు. ఆ క్షేత్రము బ్రహ్మ హత్యా మహాపాపములను సహితము పోగొట్టగలదు. ఇందుకొక ఇతి వృత్తము గలదు. సావధానుడవై ఆలకింపుము.
విష్ణుమూర్తి నాభికమలమున పుట్టిన బ్రహ్మకును, యీశ్వరునకు అయిదేసి తలలు వుండెడివి. ఈశ్వరునికి పంచరుద్రుదు, త్రినేత్రుడు అనే పేర్లు కూడా కలవు! బ్రహ్మ దేవుడు నాకును ఐదు తలలున్నవి; నేనే గొప్పవాడనని శివునితో వాదించెను. ఇద్దరూ గర్వముతో వ్యవహరించినందున, చిలికి చిలికి వారిద్దరి మధ్య కలహము పెద్దదయ్యెను. కడకు యిద్దరూ యుద్ధము చేయగా, శివుడు బ్రహ్మ యొక్క ఐదవతలను నరికి వేసెను. వెంటనే శివునకు బ్రహ్మహత్యాపాతకము చుట్టుకొన్నది. శివుడు భయపడి, తాను నరికిన బ్రహ్మ తలను చేతపట్టుకొని ముల్లోకాలు తిరుగుచుండగా క్రమముగా చేతిలోవున్న బ్రహ్మతల యెండిపోయి, పుర్రెగా అయినది. ఈశ్వరుడు సహజముగా అందమైనవాడు. అతడు భిక్షాటనకు వచ్చి "భిక్షాందేహీ" యనగా గృహిణులు భిక్షపట్టుకొని గుమ్మము కడకురాగా శివుని జగన్మోహనాకారమును చూచి మోహితులై భిక్ష వేసి శివుని వెంట పోవుచుండిరి. ఈ విచిత్రమును మునీశ్వరులు చూచి, కోపం కలవారై తమ భార్యలు శివుని వెంటపోవుట సహించలేక, అతనికి "పురుషత్వము నశించునుగాక" అని శపించిరి. ఈశ్వరుడును చేయునదిలేక క్రింద పడిపోయిన ఆ లింగమునందే, ఐక్యమయి పోయినాడు, అట్లు శివుడు లింగాకారముగా మారినందువలన, ఆ లింగమమితమైన తేజస్సుతో ప్రకాశించుచుండెనుl. కోటిసూర్యుల తేజస్సు కలిగి, ప్రళయము సంభవించునా అన్నట్లు భయంకరముగా నుండెను.
అప్పుడు బ్రహ్మ, విష్ణువులు, శివుని వద్దకు వచ్చి, వాని నోదార్చి ప్రయాగ క్షేత్రమునకు తీసుకువెళ్ళి అచట శివునికున్న బ్రహ్మహత్యాది పాపములు పోగొట్టిరి.
ఆ విధముగా భూలోకమునకు వచ్చి, శివుడు, అప్పటినుండి లింగాకారముగా మారినందున, భక్తులు ఆ లింగాకారమునే పూజించుచు, శివ సాన్నిధ్యమును పొందగలుగుచున్నారు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
#మాఘమాసం #తెలుగు #మాఘపురాణం
మాఘ పురాణం - 24వ అధ్యాయము
శ్రీమన్నారాయణుని యనుగ్రహము - తులసీ మహాత్త్యము
గృత్నృమదమహాముని జహ్ను మునితో నిట్లనెను. సత్యజిత్తు యేకాదశియందు భార్యతో బాటు ఉపవాసముండెను. కేశవుని గంధపుష్పాదులతో నర్చించెను. దేవతల హితమును కోరి శ్రీమన్నారాయణుని నిరంతరముగ జపించుచు జాగరణ చేసెను. ఏకాదశినాటి రాత్రి, మొదటి జామునందే, శ్రీహరి సత్యజిత్తునకు ప్రత్యక్షమయ్యెను.
నీలమేఘమువలె నల్లనిచాయతో, నల్లని ముంగురులతో పద్మనేత్రములతో ప్రకాశించు తిలకముతో, విచిత్రకుండలములతో, చెక్కిళ్లు ప్రకాశించుతుండగా, సూర్యకాంతినిమించు కిరీటముతో, హారకేయూరాది విభూషణములతో, పచ్చని పట్టు బట్టను కట్టి, మనోహరమైన రూపముతో, గరుత్మంతునిపైనెక్కివచ్చెను. మునిగణములు, శ్రీమన్నారాయణుని స్తుతించి, భార్యతోబాటు, శ్రీమన్నరాయణుని పాదములపైబడి నమస్కరించెను. శ్రీమన్నారాయణమూర్తి ''నాయనా! కోరిన వరము నిచ్చెదను అడుగు అనెనుl".
అప్పుడు సత్యజిత్తు 'స్వామి! యింద్రాదులకు పూర్వమువలెనే సంచరించు శక్తి నిమ్ము. వారిపై దయనుంచుము. తరువాత నాకును, నాభార్యకును నీ సాన్నిద్యము ననుగ్రహింపుము" అని కోరెను. శ్రీహరి దయతో వాని కోరిక నంగీకరించెను ఇట్లనెను. "ఓయీ! యీ ఏకాదశితిథి, సమస్త పుణ్యముల నిచ్చును. నేనీ తిథియందే, నీకు ప్రసన్నుడనైతిని, కావున యీ తిథి, నాకు సంతోషమును కలిగించు తిథి. నీవు నీ భార్య, యీ పారిజాత వృక్షమును పెకిలించి, యింద్రునకిండు, పవిత్రము, వనవాసి. నాకిష్టము అయిన యీ తులసిని, నాకిమ్ము, నీకు శుభము కలుగును, మరియొక ఆలోచన వలదు" అని పలికెను. సత్యజిత్తును అట్లేయని అంగీకరించెను. మరునాటి ఉదయమున భార్యతో కలిసి, పారిజాత వృక్షమును పెకిలించి, యింద్రాదుల కిచ్చెను. తులసిని, లక్ష్మీపతియగు శ్రీహరికిచ్చెను. శ్రీహరియనుగ్రహము వలన, ఇంద్రాదులందరును, శక్తిమంతులై శ్రీమన్నారాయణునకు నమస్కరించి నిలిచిరి.
శ్రీహరి, యింద్రాదులు వినుచుండగా, సత్యజిత్తును, వాని భార్యను జూచి, యిట్లనెను. ఈ యేకాదశితిథి నాడు, నీవు భక్తితో, ఈ విధముగ నన్ను పూజించి, నా అనుగ్రహము నుండుట వలన, మిక్కిలి ఉత్తమమైనది. నాకు మిక్కిలి ఇష్టమైనది. ఈ యేకాదశీ తిథి, సర్వజీవుల పాపములన్నిటిని పోగొట్టి, అనంత పుణ్యమునిచ్చును. మందమతులైన మానవులీవిషయమును గమనింపలేరు. పాడ్యమి నుండి పది దినములును యధా ప్రకారము భుజించి, యేకాదశి నాడు ఉపవాసమును, జాగరణము చేసి, నన్ను స్మరించు వారు, నా సాన్నిద్యమును చేరుదురు. ఇహలోకమున, సర్వసుఖములను, సర్వశుభములను, పొందుదురు. నాకు సంతోషము నిచ్చిన, యీ తిథి, ఉత్తమ సంభావన నిచ్చి, వేలకొలది అశ్వమేధములు చేసినవచ్చు, పుణ్యము నిచ్చును. ధర్మవేత్తలగు మునులును, యీ తిథి, మిక్కిలి పుణ్యప్రదమని యందురు. పన్నెండవ రోజున, దేవతలకు, మరల శక్తి, పుష్టికలుగుటచే, ద్వాదశి తిథిని, ప్రాణదాయిని, విష్ణుప్రియయని, అందురు. అజ్ఞానముచే, ఏకాదశి రోజు భుజించువారు, మహాపాపముల నందుదురు. దశమినాటి రాత్రి, భోజనమును మాని, ఏకాదశినాడు, రెండు పూటల, భోజనమును మాని, ద్వాదశి నాటి మధ్యాహ్నమున, నొకమారు భుజించి, నాటి రాత్రి భుజింపకయుండిన, చాతుర్భుక్తావర్జితమైన ఏకాదశి ఉపవాసమని యందురు. ఈ ప్రకారము చేసిన ఉపవాసము, సంపూర్ణ పుణ్యఫలమునిచ్చును. పుణ్యప్రదమగు హరివాసరమున, ఉపవాసము, జాగరణము చేసి, నన్ను యధాశక్తి పూజించినవాడు నాకిష్టుడు. నా లోకమును చేరును. ఇట్టి యేకాదసి ఉపవాసము చేసినవానినే గాక, వాని కులము వారినందరిని రక్షించి, అనేక యజ్ఞములు చేసిన వచ్చు పుణ్యము నిచ్చును. నాలుగు వర్ణములవారు, సన్యాసి, వానప్రస్తుడు, స్త్రీబాలవృద్ధులు, అందరును, ఏకాదశినాడు భుజింపరాదు, ఏకాదశినాడు, స్త్రీ సుఖము, నిద్ర, అన్నము, వీనిని విడిచి, నన్ను పూజించవలెను. నా పాదోదకమును, సేవింపవలెను. అన్ని మాసములయందును, శుక్లకృష్ణపక్షములు, రెండిటను వచ్చు యేకాదశులన్నియు, నిట్లే ఉపవాసముండవలెను. చాంద్రాయణాది వ్రతముల నాచరించుట వలన వచ్చెడి పుణ్యము, యేకాదశీ ఉపవాస వ్రతము వలన వచ్చును. కావున మానవులారా! మునులారా! నా భక్తులారా! ఎవ్వరును యీ యేకాదశినాడు అన్ని మాసములయందును. రెండు పక్షములయందును, తినరాదు. ఇది సత్యము ఇట్లు ఉపవాసము చేసినవాడు, నా లోకమును చేరి, నన్ను పొందును. ' ఇది తధ్యము' అని, బిగ్గరగా పలికెను. అని గృత్నృమహాముని, జహ్నుమునికి వివరించెను.
గృత్నృమహాముని జహ్నుమునితో నిట్లనెను. శ్రీమన్నారాయణుడు యేకాదశి వ్రతవిధానమును మహత్త్యమును వివరించి, యింద్రాదులతో నిట్లనెను. మీరీ పారిజాత దివ్యవృక్షమును తీసికొని, మీ నివాసమైన స్వర్గమునకు వెళ్ళుడని చెప్పెను. ఇంద్రాదులు, శ్రీహరి చెప్పినట్లు, పారిజాతవృక్షమును తీసికొని, స్వర్గమునకు పోయిరి. వారందరును వెళ్లిన తరువాత, తులసి, శ్రీమన్నారాయణునితో నిట్లనెను. "స్వామీ! నీ పాపపద్మముల యందాసక్తి గల నన్ను, దయ చూడుము. నాకు నీవు తప్ప మరియొక్క గతిలేదు.
నేను నీ పాద సాన్నిధ్యమునే కోరుకొందును" అని పలికిన తులసి మాటలను విని, శ్రీహరి," భూమియందు అమృతము వలన పుట్టిన తులసి! నీవు నాకిష్టురాలవు. నా వద్దకు రమ్ము. నిన్ను నేను హృదయమున ధరింతును.
సందేహము వలదు. నీవు పవిత్రురాలవు. పవిత్రతను కలిగించుదానవు. పాపనాశినివి. తులసి దళములతో కలిగి యున్న నిన్ను చూచినవారు, గంగా స్నానము చేసిన వారువలె, పవిత్రులగుదురు. నీ దళములతో నన్ను పూజించినవారికి, పునర్జన్మ నుండదు. అమృతము నుండి పుట్టిన తులసి దళములను మాలగా చేసి, నా కంఠమున సమర్పించినవారు, అంతులేనంత, అనంతకాలము, నా లోకమున నుండి, నాలోనైక్యమగుదురు. నిన్ను తమ యిండ్లయందు గాని, తోటలయందు గాని, పెంచువారికి, యే పాపములును అంటవు.ప్రాతఃకాలమున నిద్రలేవగనే నిన్ను చూచి నమస్కరించినవాడు, ఆ దినమున, సర్వ సుఖముల నందును.
*యన్మూలే సర్వతీర్థాని యన్మభ్యే సర్వదేవతాః*
*యదగ్రే సర్వవేదాశ్చ తులసి త్వాం నమామ్యహం ||*
అను శ్లోకమును చదివి, నీకు నమస్కరింపవలెను. తులసి! నీ దళములతో నీటిని, తన శరీరముపై జల్లుకొనువాడు, అపవిత్రుడైనను, పవిత్రుడగును. నీ కుదురు మొదలులోనున్న మట్టిని, తిలకముగ, నుదుటిపై ధరించినవాడు, సర్వసుఖములను పొందును. యక్షరాక్షస పిశాచాదుల వలన, వానికి యే బాధయు నుండదు. అమృత సంభవా తులసీ! త్రైలోక్యపావనీ! నేను నిన్ను, లక్ష్మీదేవిని, సమానముగా భావింతును" అని శ్రీహరి తులసికి వరములిచ్చెను. తులసి దళములను, కాండములను, శాఖలను, అన్నిటిని, శుభప్రదములైన మృదువైన తన చేతులతో తాకెను. చక్రధారి స్పర్శవలన, తులసి మరింత కాంతిని, పవిత్రతనుపొందెను. అప్పుడా తులసి, మనోహరమైన పవిత్రమైన, స్త్రీరూపమునంది, శ్రీహరి అంశను పొందెను. మాయావి, జగదీశ్వరుడు అయిన శ్రీహరి, లోకరక్షణార్థమై తులసిని నియమించెను. శ్రీహరి యెడమ చేతితో తాకబడిన భాగము, కృష్ణవర్ణమై, కృష్ణతులసి యను పేరు పొందెను. ఆ వైపున ఉన్న ఇతర వృక్షములును, తులసీ సాన్నిధ్యముచే పవిత్రములయ్యెను. తులసి యున్న ప్రదేశము పాపములను పోగొట్టును.
అప్పుడు శ్రీహరి, సత్యజిత్తును చూచి 'నీవు నాకు పూజను చేసి బ్రాహ్మణ సమారాధనము చేసి నీవు నీ భార్యయు భుజింపుడు ' అని పలికెను. సత్యజిత్తు కూడ శ్రీహరిని పూజించి, బ్రాహ్మణులకు భోజనమును పెట్టి, తన భార్యతో కలసి భుజించెనుl. ఇట్లు ఆ వ్రతము పూర్తి అయిన తరువాత, శ్రీహరి, అందరును చూచుచుండ, సత్యజిత్తు దంపతులతోను, తులసితోను కలసి, గరుత్మంతుని పైనెక్కి, తనలోకమునకు పోయెను. నాయనా జహ్నుముని! యిది యేకాదశీ వృత్తాంతము. ఏకాదశి తిథి, అశ్వమేధ సహస్ర ఫలము నిచ్చునని, స్పష్టమైనది కదా. అన్నియేకాదశులలోను, మాఘమాసమునందలి యేకాదశి, మరింత శుభప్రదము. ఆనాడు, ఉపవాసముండి, శ్రీహరిని పూజించి, జాగరణ, మంత్రానుష్ఠానము, స్మరణము, చేసినవారు, శ్రీహరికి ప్రీతిపాత్రులై, సాలోక్యమును, సాయుజ్యమును, పొందుదురు. ఏకాదశినాడు, ఉపవాసము, ద్వాదశినాడు పారణ ముఖ్యము. ఆనాడు బ్రాహ్మణులకు భోజనము పెట్టి, యధాశక్తిగ గోదానము, భూదానము, వస్త్రదానము, సువర్ణదానము, సాలగ్రామ శిలాదానము మున్నగువానిని ఉత్తముడైన బ్రాహ్మణునకు/బ్రాహ్మణులకు యీయవలెను. అట్టివారు యిహలోకమున చక్రవర్తియై, తుదకు శ్రీహరి సాయుజ్యమునందును. ఇట్టి పవిత్రమైన కథను వినువాడును, శ్రీహరి కరుణా కటాక్షమునంది, విష్ణువును చేరుదురు, అని నిస్సందేహముగా చెప్పుచున్నాను" అని గృత్నృమదమహర్షి జహ్నుమునికి వివరించెను.
🙏🙏🙏
#మాఘమాసం #మాఘపురాణం #తెలుగు
మాఘ పురాణం - 23 వ అధ్యాయము
నారదుని దౌత్యము - దేవతల దైన్యము
గృత్నృమదమహర్షి జహ్నువుతో నిట్లనెను. పారిజాత పుష్పములకై వెళ్లిన యక్షుడింకను రాకపోవుటకు కారణమేమని యింద్రుడుని విచారించెను. పారిజాత పుష్పముపై నున్న యిష్టము అధికమగుటచే, తాను భూలోకమునకు పోదలచెను. ఇంద్రుడు పారిజాత పుష్పములకై వచ్చుచు, దేవతలను గూడ, తనతో తీసికొనివచ్చెను. సువాసనలను విరజిమ్ముచున్న పారిజాత పుష్పములను చూచి, యింద్రుడు, దేవతలు మహోత్సాహముతో, పారిజాత పుష్పములను కోసిరి. పారిజాత వృక్షమునే, స్వర్గమునకు దీసికొని పోదలచిరి. ఆ మహోత్సాహములో, శ్రీహరి, పూజా నిర్మాల్యమును, పాదములతో, త్రొక్కిదాటిరి. ఫలితముగా, దివ్యశక్తులను గోల్పోయిరి. శక్తివిహీనులైరి, ఇంద్రాదులింకను రాలేదని, మరికొందరు దేవతలు వచ్చిరి. పారిజాతవృక్షమును పెకలింపదలచి యత్నించిరి. శ్రీహరి నిర్మాల్యమును దాటుటచే, వారును, శక్తి హీనులై పడియుండిరి.
మరునాటి ఉదాట్యమున, సత్యజిత్తు, తన తోటను చూడవచ్చెను. అచట నిస్తేజులై నిలిచిన యింద్రాదులను జూచెను. వారి పరిస్థితికి ఆశ్చర్యమును, విచారమును, చెందెను. వారికి నమస్కరించెను. "ఇంద్రాది దేవతలారా! మీరు మానవులమైన మాకంటె గొప్పవారు. ఇంతటి మీరు, స్వల్ప ప్రయోజనమునకై, యిట్టి అకార్యమునేల చేసితిరి. మీరు నాకు తెలియకుండ, పుష్పములను దొంగతనముగా తీసికొని పోదలచుట దోషము కాదా?" అని ప్రశ్నించెను. ఇంద్రాదులు సమాధానము చెప్పలేక, తలలు వంచుకొనిరి. గరుత్మంతుడు మొదలైన ఉత్తమ పక్షులు, నేలపైనున్న మాంసమునకాశపడి, భూమిపై వానియవమానము నందినట్లు, మేమును, పారిజాత పుష్పముల కాశపడి, ధర్మమును తప్పి, దొంగలించి, యిట్టి స్థితిని పొందితిమి. ఇకపై మా పరిస్థితియేమిటో, యెట్టిదో, చెప్పుమని, యడిగిరి. సత్యజిత్తు వారికేమియు సమాధానమును చెప్పక, తన యాశ్రమమునకు పోయెను.
ఇంద్రుడు మొదలగువారు, ఆహారము లేక, దుఃఖపడుచు నచట పదునొకండు దినములుండిరి. వారికి ఆ కాలమున, అమృతాహారము లేదు. కామధేనువు యిచ్చు మధురక్షీరమును లేదు. కల్పవృక్షము, చింతామణి యిచ్చునట్టి, పుష్టికరములైన భక్ష్యభోజ్యములును లేవు. మిక్కిలి దీనులై యుండిరి. సత్యజిత్తును, దేవతల దురవస్థకు, విచారించెను. తాను జల్లిన శ్రీహరి నిర్మాల్యమును, తొలగించెను. తానేమి చేయవలెనో, దేవతల దుస్థితి తన వలన యేర్పడినది యెట్లు తొలగునో తెలియక, దీనులైయున్న దేవతలపై జాలిపడెను. అశరణ శరణ్యుడైన శ్రీహరిని, యధాపూర్వకముగ పూజించుచు, తానును, భార్యయు, నిరాహారులై యుండిరి. ఈ విధముగా, సత్యజిత్తు కూడ, పదనొకండు దినములు, నిరాహారుడై, శ్రీహరి పూజను మానక, శ్రీమన్నారాయణుని తలచుచుండెను. త్రిలోక సంచారియగు నారదుడాకాశమున దిరుగుచు, దేవతల దురవస్థను, గమనించెను. వారికెట్టి సహాయము చేసిన వారి దురవస్థపోవునో, అతనికి తెలియలేదు. తిన్నగా శ్రీహరిని చేరబోయెను. నారదుడును శ్రీహరికి నమస్కరించి, యిట్లు స్తుతించెను.
*నారదకృత విష్ణుస్తుతి*
ఆర్తత్రాణపరాయణాయభవతే నారాయణాయాత్మనే
గోవిందాయ సురేశ్వరాయ హరయే శ్రీశాయ చేశాయచ ||
మిత్రానేక హిమాంశుపావక మహాభాసాయ సాజ్యప్రదే
శ్రీమత్పంకజపత్ర మేత్ర నిలసత్ కృష్ణాయ తుభ్యం నమః ||
అచ్యుతాయాదిదేవాయ పురాణ పురుషాయచ
సర్వలోక నిధానాయ నమస్తే గరుడ ధ్వజ ||
నమో అనంతాయ హరయ క్షీరసాగరవాసినే
భోగీంద్ర తల్పశయన లక్ష్మ్యాలింగిత విగ్రహ ||
నమస్తే సర్వలోకేశ నమస్తే విశ్వసాధన
సర్వేశ సర్వగస్త్యంహి సర్వాధారస్సురేశ్వర ||
సర్వంత్వమేవ వృజసి నత్త్వ రూపస్త్యమవహి
పురుషాపి గుణాధ్యక్ష గుణాతీత స్స్నాతనః ||
పరబ్రహ్మసి విష్ణుస్త్యం బ్రహ్మసి భగవాన్ భవః
సృష్తిస్థితిలయాదీనాం కర్తాత్వం పురుషోత్తమ ||
త్రిగుణోసిగుణాధార స్త్రిమూర్తిస్త్యం త్రయీరమః
ఆ సీత్త్యన్మాయయా సర్వం జగత్ స్థావర జంగమం ||
త్వమేనైకార్ణవేజాతే జగత్యస్మిన్ జగత్పతే
జగత్ సహృత్యసకలం ప్రిత్వా భాబేహనే తు భాసకః ||
త్వమేవ సర్వలోకానాం మాతాత్వం నా పితా విభో
గురుస్త్యం సర్వభూతానాం శిక్షకస్పుదాయకః ||
ప్రతిష్ఠితమిదం సర్వం పూర్ణం స్థావర జంగమం
ప్రసీదపాలయవిభో నమస్తే సురవల్లభ ||
నారదుని స్తుతిని విని, సర్వజ్ఞుడగు శ్రీహరి,యేమియు నెరుగనివానివలె, ''నారదా! స్వాగతము ఇప్పుడెందులకీస్తుతి? నీకేమి కావలయునో చెప్పుము. ఏమి చేసిన నీకు సుఖము అగునో, అది యెట్టిదైనను, దేవాదులు సాధింపజాలనిదైనను, నీకు సమకూర్చెదను" చెప్పుమని యడిగెను. నారదుడును, తలవంచి," ఇంద్రాదులు చెడుపనిని చేసి, ఆపదపాలైరి. భూమియందు పారిజాతమును వృక్షమొకటి కలదు. దాని పుష్పముల సౌందర్య సువాసనలకు విస్మితులై వాని యందిష్టపడిరి. ఆ పుష్పములను ప్రతి దినము దొంగలించుచుండిరి. ఆ పుష్పములకై మిక్కిలి యిష్టపడిన రంభ మొదలగు అప్సర స్త్రీల కోరికను తీర్చుటకై, యింద్రుడు, దేవతలతో బాటు వెళ్లి, ఆ పారిజాత వృక్షము వద్ద, అగ్ని సమీపమున, రెక్కలు కాలిపడిన మిడుతవలె, దేవతా గుణముతో పడియున్నాడు. అమృతాహారులైన యింద్రాది దేవతలు, పదునొకండు దినముల నుండి, నిరాహారులై, దీనులై పడియున్నారు.
భగవాన్ శ్రీమన్నారాయణ మూర్తీ! నీవిప్పుడు, వారిని దయయుంచి రక్షింపవలయునని," నారదుడు కోరెనుl.
నారదుని మాటలను విని శ్రీహరి, 'నారదా! అమృతకలశము నుండి తొణికి పడిన రెండు బిందువుల అమృతమే, పారిజాత వృక్షముగను, తులసిగను అయినది. అనగా ఆ రెండును, అమృతము నుండి పుట్టినవి. రెండు మిక్కిలి పవిత్రములు, సత్యజిత్తనువాడు, ఆ మొక్కలను సంరక్షించెను. తుదకు అదియొక మనోహరమైన పుష్పవాటిక అయ్యెను. సత్యజిత్తు ఆ పుష్పములను, తులసి దళములను అమ్మి, ఆ ధనముతో, దరిద్రులను ఆర్తులను పోషించి, తరువాత కుటుంబమును పోషించుకొనుచుండెను. నన్ను పూజించుచుండెను, ఇట్టి యుత్తమునికి, దీనులకును, జీవనాధారమగు పుష్పసంపదను, త్రిలోకాధిపతియగు నింద్రుడు, నిత్యము తన సుఖమునకై అపహరించెను. చివరకాదీనుడగు సత్యజిత్తు, నన్నర్చించిన నిర్మాల్యమును, పుష్పవాటికలో జల్లగా, భోగలాలనుడగు నింద్రుడు, నా నిర్మాల్యమును గూడ దాటెను. త్రొక్కెను. ఇన్ని దోషములచే, త్రిలోకాధిపతియగు నింద్రుడు, వాని యనుచరులు, శక్తిహీనులై, తోటలో పడి యున్నారు. నన్ను పూజించిన నిర్మాల్యమును, తెలిసికాని, తెలియకకాని, దాటిన, తొక్కిన, యెంతటి వాడైనను, శక్తిని కోల్పోయి, దీనుడు కాక తప్పదు. ఉత్తముడైన ఆ సత్యజిత్తు, యింద్రాదుల దైన్యమునకు బాధపడుచు, నేమి చేయవలెనో తెలియక, తానును, భార్యతో బాటు, నిరాహారుడై, నన్నర్చించుచు, నన్ను స్మరించుచున్నాడు. ఆషాఢ శుక్ల పాడ్యమి మొదలు, నేటి వరకు, పదనొకండు దినములు, దేవతలు అమృతపానము లేక, నిరాహారులైరి. సత్యజిత్తును, వారిని జూచి, భార్యతోబాటు, నిరాహారుడై యుండెను. దేవతల విముక్తికై, నన్ను ప్రతిదినము, నర్చించునే యున్నాడు. నేడు పదకొండవ దినము. అనగా ఏకాదశి తిథి. సత్యజిత్తు, నేడు కూడ, ఉపవాసముండి, నా అష్టాక్షరీ మంత్రమును జపించుచు, జాగరణమొనర్చినచో, నేను ప్రసన్నుడై, అతడేది కోరినను వెంటనే యిచ్చెదను. అతడే కాదు. యెవరైనను, యేకాడశి నాడు, ఉపవాసముండి, జాగరణ చేసి, నా మంత్రమును జపించినచో, వారికిని, కోరిన దానినిచ్చెదను" అని, విష్ణువు సమాధానము ' నిచ్చెను. నారదుడును యేమియును మాటలాడలేక, తన దారిన బోయెను, అని గృత్నృమదమహాముని, జహ్నువునకు చెప్పెను.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
#మాఘమాసం #మాఘపురాణం #తెలుగు
Click here to claim your Sponsored Listing.
Location
Category
Culinary Team
Attire
Contact the business
Website
Address
Mogappair
Chennai
600037
