06/10/2026
మహిళా సాధికారతే లక్ష్యం – మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ధ్యేయం
అమరావతి: సెర్ప్, మెప్మా కార్యక్రమాలపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. డ్వాక్రా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తూ, వారిని విజయవంతమైన మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
మహిళలు తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకునేలా అవసరమైన మార్గదర్శకత్వం, శిక్షణ, మార్కెటింగ్ మరియు ఇతర సహాయాన్ని అందించాలని సూచించారు. అలాగే సంఘాల కార్పస్ నిధులను సమర్థవంతంగా పెట్టుబడులుగా మలిచి, నిరంతర ఆదాయ వనరులుగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. మహిళా వ్యాపారవేత్తల అభివృద్ధికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
‘స్వయం AP’ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేసి, స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ అవకాశాలు కల్పించాలని సీఎం సూచించారు. ఈ నెల 15వ తేదీ నుంచి 31వ తేదీ వరకు విజయవాడలో నిర్వహించనున్న నేషనల్ సరస్ మేళాను మహిళా సాధికారతను చాటేలా ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. దేశవ్యాప్తంగా మహిళా పారిశ్రామికవేత్తలు, మహిళా ఎంపీలను సరస్ మేళాకు ఆహ్వానించి, మహిళల ప్రతిభ, ఉత్పత్తులు మరియు వ్యాపార సామర్థ్యాన్ని జాతీయ స్థాయిలో ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సమీక్షా సమావేశంలో మెప్మా మిషన్ డైరెక్టర్ మరియు సెర్ప్ CEO శ్రీమతి వాకాటి కరుణ, IAS, మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్, అదనపు మిషన్ డైరెక్టర్ (AMD) శ్రీ కె.ఎన్. వెంకటేశ్వరరావు, స్టేట్ మిషన్ మేనేజర్ (SMM) శ్రీ ఎన్.ఎన్.ఆర్. శ్రీనివాస్ తో పాటు సెర్ప్ అధికారులు పాల్గొన్నారు.
మహిళల ఆర్థిక స్వావలంబన – కుటుంబాల అభివృద్ధి – రాష్ట్ర ప్రగతి!
మహిళా పారిశ్రామికవేత్తలే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతికి బలమైన పునాది.
# ap