09/10/2026
గౌరవనీయులైన
శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారికి
ముఖ్యమంత్రి,
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్.
విషయం: బీసీ ఉద్యమ నేత శ్రీ గుజ్జ సత్యం (GUJJA SATHYANARAYANA) గారిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయడానికి సిఫారసు చేయాలని విజ్ఞప్తి.
గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి,
తెలంగాణలో బీసీల సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ హక్కుల సాధన కోసం సుదీర్ఘకాలంగా ఉద్యమిస్తున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు, బీసీ జేఏసీ రాష్ట్ర సమన్వయకర్త శ్రీ గుజ్జ సత్యం గారికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
బీసీ ఉద్యమ నేత ఆర్. కృష్ణయ్య గారి అడుగుజాడల్లో నడుస్తూ, బీసీలను సంఘటితం చేయడం, వారి హక్కులపై చైతన్యం కల్పించడం, రాజకీయ ప్రాతినిధ్యం, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, కులగణన, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు, బీసీ కార్పొరేషన్ల బలోపేతం వంటి అంశాలపై శ్రీ గుజ్జ సత్యం గారు నిరంతరం ఉద్యమిస్తున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించిన బీసీ ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొంటూ, వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయం కల్పించాలనే లక్ష్యంతో తనవంతు కృషి చేస్తున్నారు.
బీసీ ఉద్యమంతో పాటు గత 20 సంవత్సరాలుగా విద్యారంగంలో సేవలందిస్తూ వేలాది మంది విద్యార్థులకు విద్యను అందించేందుకు, ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. అలాగే, సత్యం హోమియోపతి ద్వారా సామాన్యులకు తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తూ సామాజిక సేవలోనూ తనదైన పాత్ర పోషిస్తున్నారు.
పద్మశాలి సమాజానికి చెందిన ముద్దుబిడ్డగా చేనేత కార్మికుల ఉపాధి, వృత్తి పరిరక్షణ, ఆర్థిక ఇబ్బందులు, మార్కెటింగ్ సమస్యలు, చేనేత రంగ అభివృద్ధి వంటి అంశాలపై కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.
బీసీ ఉద్యమంలో సుదీర్ఘ అనుభవం, విద్యా–వైద్య రంగాల్లో సేవలు, వెనుకబడిన వర్గాల సమస్యలపై అవగాహన కలిగిన శ్రీ గుజ్జ సత్యం గారికి శాసనమండలిలో అవకాశం లభిస్తే, బీసీలు, పేద విద్యార్థులు, చేనేత కార్మికులు, సామాన్య ప్రజల సమస్యలను చట్టసభలో మరింత బలంగా వినిపించేందుకు అవకాశం కలుగుతుంది.
కావున, శ్రీ గుజ్జ సత్యం గారి ప్రజా సేవా ప్రస్థానం, బీసీ హక్కుల కోసం చేసిన పోరాటం, విద్యా–వైద్య సేవలను పరిగణనలోకి తీసుకుని, తెలంగాణ శాసనమండలికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయడానికి ఆయన పేరును సిఫారసు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని వినమ్రంగా కోరుతున్నాము.
బీసీ హక్కులకు బలమైన గొంతుక – పేద విద్యార్థులకు విద్యా భరోసా – చేనేత కార్మికులకు అండ – సామాజిక న్యాయ సాధనకు నిరంతర పోరాటం.
ధన్యవాదాలతో,
భవదీయులు,
జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు
బీసీ జేఏసీ నాయకులు
బీసీ ఉద్యమ నాయకులు
పద్మశాలి, చేనేత సంఘాల ప్రతినిధులు
హైదరాబాద్, తెలంగాణ.