31/08/2026
కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై బీఆర్‌ఎస్ పోరుబాట విజయవంతం చేయండి : మాజీ ఎంపీ నామ
కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్‌ఎస్ నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయండి : మాజీ ఎంపీ నామ
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 2వ తేదీ నాటికి వెయ్యి రోజులు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో, బీఆర్‌ఎస్ పార్టీ ప్రకటించిన కార్యాచరణలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల విఫల పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సెప్టెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న పోరుబాట నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని బీఆర్‌ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని నామ విమర్శించారు. రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, పంటలకు మద్దతు ధర, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, మహిళలు, పేదలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని అన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, యూరియా కొరత, పంటల కొనుగోళ్లలో ఇబ్బందులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన, మహిళలకు ఇచ్చిన హామీల అమలు వంటి అంశాలను నిరసన కార్యక్రమాల ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మందగించాయని నామ పేర్కొన్నారు. సెప్టెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు పార్టీ ప్రకటించిన కార్యాచరణ ప్రకారం వివిధ స్థాయిల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 2న తెలంగాణ భవన్‌లో కేటీఆర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై చార్జిషీట్ కార్యక్రమం, అలాగే నియోజకవర్గ కేంద్రాల్లో ఆరు గ్యారంటీలపై వైఫల్యాలను ఎండగట్టడం, 3న వ్యవసాయ విధ్వంసంపై నిరసన, 22A నిషేధిత భూముల కోసం అర్బన్ ఏరియాల్లో ధర్నాలు, 4న వృద్ధులు, వికలాంగులు, మహిళలతో సదస్సులు, మహిళలకు రూ.2,500, కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మి తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీలు ఇవ్వని ప్రభుత్వానికి నిరసనగా వంటావార్పు, 5న విద్యార్థులు, యువతకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ కోసం నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అలాగే సెప్టెంబర్ 6న పల్లెల విధ్వంసం, పడకేసిన పారిశుధ్యంపై నిరసనగా గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు, 7న ప్రజావాణిలో జిల్లా, మండల కేంద్రాల్లో 420 హామీల అమలుపై వినతిపత్రాలు ఇవ్వాలని, 8న జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు, ప్రెస్‌మీట్, అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రాలు తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నామ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేలా పార్టీ శ్రేణులు కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల స్థాయిలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని నామ కోరారు. ప్రజా సమస్యలపై బీఆర్‌ఎస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు తీసుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు.
Kalvakuntla Taraka Rama Rao - KTR
BRS Party
KCR