03/10/2026
కల్లూరు సమస్యలకు హ్యామ్ మహర్దశ
• పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, కమిషనర్ చల్లా ఓబులేసు
• 16 వార్డుల అభివృద్ధికి రూ.116 కోట్లు
కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని కల్లూరు అర్బన్ 16 వార్డుల్లో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న మౌలిక వసతుల సమస్యలకు హైబ్రిడ్ యాన్యూటీ మోడల్ (హ్యామ్) ద్వారా శాశ్వత పరిష్కారం లభించనుందని పాణ్యం శాసనసభ్యురాలు గౌరు చరితారెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. శనివారం స్థానిక ఎస్బీఐ ఎంప్లాయీస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో ఇంజనీరింగ్ అధికారులు, వార్డుల నాయకులతో ఎమ్మెల్యే, కమిషనర్ సమావేశం నిర్వహించి హ్యామ్ మోడల్‌లో చేపట్టాల్సిన పనుల ప్రాధాన్యతపై సమీక్షించారు.
హ్యామ్ మోడల్‌లో చేపట్టనున్న పనులను ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే ప్రారంభించి, నిర్దేశిత గడువులోపు నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. అదేవిధంగా వీధి దీపాల మరమ్మతులు, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా మెరుగుదలకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎమ్మెల్యే సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోని దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హ్యామ్ మోడల్ ద్వారా రూ.11,359 కోట్లతో పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి శ్రీకారం చుట్టారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 123 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో రూ. 11,359 కోట్లతో విలువైన పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో కల్లూరు అర్బన్ 16 వార్డులకు రూ.116 కోట్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. రూ.96.50 కోట్లతో 62.80 కిలోమీటర్ల మేర రహదారులు, రూ.13.70 కోట్లతో 14 పార్కులు, రూ.5.80 కోట్లతో 8.50 కిలోమీటర్ల మేర సెంట్రల్ మీడియన్ పనులు చేపట్టనున్నట్లు వివరించారు.
కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలో విస్తరిత ప్రాంతాల ప్రజలకు హ్యామ్ మోడల్ ఒక వరం లాంటిదని తెలిపారు. కర్నూలు నగరంలోని మూడు నియోజకవర్గాల పరిధిలో ఉన్న పాత 52 వార్డుల్లో మొత్తం రూ.150 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో రూ.115.80 కోట్లతో 76.99 కిలోమీటర్ల మేర రహదారులు, రూ.26.90 కోట్లతో 38 పార్కులు, రూ.7.30 కోట్లతో 9.75 కిలోమీటర్ల మేర సెంట్రల్ మీడియన్ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా హ్యామ్ మోడల్‌లో రహదారులు, పార్కులు, సెంట్రల్ మీడియన్లు, వీధి దీపాలు, డ్రైనేజీ తదితర పట్టణ మౌలిక వసతుల పనులు పెద్ద ఎత్తున చేపడుతున్నారని, ఈ పనుల ద్వారా పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి రానున్నాయని కమిషనర్ తెలిపారు.
కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కె.పార్వతమ్మ, డైరెక్టర్ కె.శ్రీనివాసరావు, ఎస్‌ఈ రమణమూర్తి, ఎంఈ మనోహర్‌రెడ్డి, డీఈఈలు పవన్‌కుమార్‌రెడ్డి, నరేష్, క్రిష్ణలత, హేమలత, శ్రీనివాసన్, ఏఈలు జనార్ధన్, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఖాసింవలి, షేక్షవలి, వరుణ్, విజయరాజు, తదితరులు పాల్గొన్నారు.