03/10/2026
అర్ధరాత్రి సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు
పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు – వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య
అర్ధరాత్రి సమయాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా బహిరంగ ప్రదేశాల్లో గొడవలు, హంగామా చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగించడంతో పాటు విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి ఆటంకం కలిగించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మహబూబ్‌నగర్ వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య ఒక ప్రకటనలో తెలిపారు.
02.03.2026 అర్ధరాత్రి 12 గంటల అనంతరం హబీబ్‌నగర్ ప్రాంతం నుంచి డయల్-112కు సమాచారం అందడంతో, వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బీట్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి బైక్‌పై చేరుకున్నారు. అక్కడ గొడవకు పాల్పడుతున్న వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
ఈ సమయంలో ఒక వ్యక్తి సైకిల్‌పై వేగంగా వెళ్తూ అదుపుతప్పి కిందపడటంతో తలకు గాయమైనట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. అనంతరం అతను సమీపంలోని ఒక ఇంట్లోకి వెళ్లగా, ఇంటి వారు అపరిచిత వ్యక్తిగా భావించి బయటకు పంపించినట్లు తెలిసింది.
అట్టి వ్యక్తి తనను విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది మద్యం సేవించి కొట్టినట్లు కొంతమంది హబీబ్ నగర్ స్థానికులకు చెప్పడంతో అట్టి వ్యక్తి మరియు తన సహచరులు పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయడానికి రావడం జరిగినది.
ఈ నేపథ్యంలో విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది మద్యం సేవించారా లేదా అనే అంశంపై అధికారులు వెంటనే పరీక్షలు నిర్వహించారు. జిల్లా నైట్ డ్యూటీ అధికారి భూత్పూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్రీత్ అనలైజర్ పరీక్షలో సిబ్బంది మద్యం సేవించినట్లు ఎలాంటి నిర్ధారణ కాలేదు. అదేవిధంగా వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ గారు కూడా సిబ్బంది ని ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం పంపడం జరిగినది.
పోలీసు సిబ్బంది అర్ధరాత్రి వేళ ప్రజల భద్రత కోసం విధులు నిర్వహిస్తూ, డయల్-112 ద్వారా అందే సమాచారంపై తక్షణమే స్పందిస్తున్నారని ఇన్స్పెక్టర్ అప్పయ్య తెలిపారు. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించడం ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు.
అర్ధరాత్రి అనంతరం బహిరంగ ప్రదేశాల్లో గొడవలు, హంగామా చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై, అలాగే విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి ఆటంకం కలిగించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య హెచ్చరించారు.
ప్రజలు పోలీసుల విధి నిర్వహణకు సహకరించాలని, అత్యవసర పరిస్థితుల్లో డయల్-112ను ఆశ్రయించాలని ఆయన సూచించారు.
ఇన్స్పెక్టర్
మహబూబ్ నగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్.