05/10/2026
జగన్‌పై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
……..
గత కొంతకాలంగా రాజకీయ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ బిజేపికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్ల సాఫ్ట్ కార్నర్ ఉందనే ప్రచారం విపరీతంగా సాగుతోంది. అయితే, కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆంధ్రప్రదేశ్ పర్యటనతో ఆ ప్రచారానికి పూర్తిగా చెక్ పడినట్లయింది. జగన్ ఐదేళ్ల విధ్వంసకర పాలనపై, ఆయన అనుసరించిన ప్రజావ్యతిరేక విధానాలపై శివరాజ్ సింగ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
…….
కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రసంగిస్తూ.. గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల డ్రామా పేరుతో రాష్ట్రాన్ని దశాబ్దాల కాలం వెనక్కి నెట్టారని, అభివృద్ధిని పూర్తిగా నిర్వీర్యం చేసి ఏపీని సత్యానాశం చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు సొంతింటి కలను నెరవేర్చే పిఎంఏవై (PMAY) పథకాన్ని సైతం గత ప్రభుత్వం స్వార్థ రాజకీయాల కోసం నిర్లక్ష్యం చేసి, లక్షలాది మంది పేదల ఆశలపై నీళ్లు చల్లిందని మండిపడ్డారు.
………..
చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్రంలో మళ్లీ అభివృద్ధి పరుగులు పెడుతోందని శివరాజ్ సింగ్ ప్రశంసించారు. మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి, అమరావతి నిర్మాణానికి, పేదల సంక్షేమానికి పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని స్పష్టం చేశారు. గడిచిన ఐదేళ్లలో జగన్ చేసిన తప్పులను సరిదిద్దుతూ, రాష్ట్రాన్ని మళ్లీ ప్రగతి పథంలోకి తీసుకురావడానికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయని తెలిపారు.
………
విమర్శకులు బిజేపి - వైసిపి వెనుకుండి సహకరించుకుంటున్నాయని చేస్తున్న ఆరోపణలను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ వ్యాఖ్యలు పటాపంచలు చేశాయి. జగన్ వైఫల్యాలను ఎండగడుతూ ఆయన చేసిన విమర్శలు, బిజేపికి జగన్ పట్ల ఎలాంటి సాఫ్ట్ కార్నర్ లేదని, పైగా ఆయన చేసిన విధ్వంసాన్ని కేంద్రం ఎంత తీవ్రంగా పరిగణిస్తోందో స్పష్టం చేశాయి.
……..
మొత్తానికి, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏపీ పర్యటనతో రాజకీయంగా స్పష్టమైన సంకేతాలు వెళ్లాయి. జగన్ పాలన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఎండగడుతూనే, కూటమి ప్రభుత్వానికి కేంద్రం ఇచ్చే మద్దతును పునరుద్ఘాటించి, మైండ్ గేమ్‌లకు ఆయన తెరదించారు.