M. Venkaiah Naidu

M. Venkaiah Naidu

Share

Former Vice President of India

Photos from M. Venkaiah Naidu's post 28/05/2026

తెలుగు జాతి వైతాళికుడు, జనచైతన్య దీపం శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారి 130వ జయంతి సందర్భంగా గురువారం హైదరాబాదులోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని వారి స్మృతికి నివాళులు అర్పించాను. సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్ట్ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం మంచి విషయం. ఈ సందర్భంగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత , ప్రముఖ సాహితీవేత్త, శ్రీ నందిని సిధారెడ్డి గారికి సురవరం ప్రతాపరెడ్డి పురస్కారాన్ని అందజేయడం సంతోషంగా ఉంది. శ్రీ నందిని సిధారెడ్డిగారికి నా అభినందనలు.

ఆంధ్ర మహాసభ స్థాపనలో కీలక పాత్ర పోషించి మొదటి ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించిన శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారు తెలుగు ప్రజలలో చైతన్యం తీసుకురావడమే కాకుండా ఆ రోజుల్లో తెలుగు భాష వికాసానికి విశేష కృషి చేశారు. తెలుగు భాషా సాహిత్యానికి కృషి చేస్తున్న ఎందరో కవులు,రచయితలకు గొప్ప ఆలంబనగా నిలిచారు.

తెలంగాణలో కవులున్నారా అన్న ప్రశ్నకు 'గోల్కొండ కవుల సంచిక' ద్వారా చేతలతో సమాధానమిచ్చిన పరిశోధక చైతన్య శీలి సురవరంగారు.
ఇప్పటిలాగా సమాచారం కోసం ఇంటర్నెట్, గూగుల్ సెర్చ్ లేదా డిజిటల్ లైబ్రరీలు లేని ఆ రోజుల్లోనే... ఊరూరా తిరిగి, ప్రతి ఒక్కరిని కలిసి 354 మంది కవుల జీవితాలను ఆవిష్కరించడం సామాన్యమైన విషయం కాదు. పరిశోధనా రంగానికి ఆయన చేసిన ఈ కృషి నేటికీ, ఏనాటికీ ఒక గీటురాయి లాంటిది.

నాటి నిజాం నిరంకుశత్వానికి ఎదురొడ్డి 'గోలకొండ పత్రిక' ద్వారా విలువలతో కూడిన జర్నలిజానికి సురవరం ప్రతాప రెడ్డి గారు గారు శ్రీకారం చుట్టారు.
కేవలం పత్రికకే పరిమితం కాకుండా, ఆయన కలం నుండి జాలువారిన 'ఆంధ్రుల సాంఘిక చరిత్ర', 'హిందువుల పండుగలు', 'హైందవ ధర్మ వీరులు' వంటి అద్భుత గ్రంథాలు... ప్రతి తెలుగువాడూ చదివి, తన ఇంట్లో దాచుకోదగిన అమూల్యమైన సాహిత్య నిధులు.
తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి, గ్రంథాలయోద్యమానికి ఎనలేని సేవలు అందించిన సురవరం గారు... బహుముఖ ప్రజ్ఞాశాలిగా, ఉత్తమ పరిశోధకుడిగా ఎంత ఎదిగినా, జీవితాంతం నిరాడంబరునిగా, నిరంతర అధ్యయన శీలిగానే జీవించారు.

సమాచారాన్ని ఎంత వేగంగా ఇచ్చామనే దానికంటే, ఎంత సమగ్రంగా, వాస్తవంగా ఇచ్చామనేదే పత్రికలకు ముఖ్యం. విలువలే మూలాలుగా పత్రికారంగం ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా నిలబడాలన్నదే నేటి తరానికి ఆయన ఇచ్చే స్ఫూర్తి!

28/05/2026

నటుడిగా తెలుగు తెర మీద, నాయకుడిగా తెలుగు ప్రజ మీద తనదైన ముద్రవేసిన మహోన్నత మనీషి శ్రీ నందమూరి తారకరామారావు గారి జయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. ఎన్టీఆర్ అంటే సినిమాలకు, రాజకీయాలకు అతీతమైన విలక్షణమైన వ్యక్తిత్వం. దేశభక్తితో పాటు తెలుగు భాష పట్ల అవ్యాజమైన ప్రేమ కలిగిన వ్యక్తి. తెలుగు వాడినంటూ గర్వంగా చెప్పుకున్న తెలుగు రేడు ఆయన. ఎన్టీఆర్ వ్యక్తిత్వం చిరస్మరణీయమైనది, భవిష్యత్ తరాలకు ఆదర్శనీయమైనది.

దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మలుపు తిప్పి, విలువలతో కూడిన రాజకీయాలకు నిజమైన నిర్వచనాన్ని చెప్పి, ప్రత్యామ్నాయ రాజకీయాల మార్గదర్శకుడిగా, ప్రజాభ్యుదయమార్గ నవ్య పథగామిగా ఎన్టీఆర్ తనదైన ముద్ర వేశారు. ప్రత్యేకించి నీతివంతమైన పాలనతో, అవినీతిపరుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించిన ప్రజానాయకుడు. వారి పాలనా కాలంలో మునుపెన్నడూ లేనివిధంగా చేపట్టిన అనేక సంస్కరణలు నేటికీ దేశంలోని అనేక రాజకీయ పార్టీలు ఆదర్శాలుగా ఆచరిస్తున్నాయి. వారి మేనిఫెస్టోలో చేర్చి, విజయాలను సాధించాయి. సాధిస్తున్నాయి కూడా. ఈ స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలని ఆకాంక్షిస్తున్నాను.

28/05/2026

I bow my head in reverence to one of the greatest patriots, nationalists, and freedom fighters & an iconic son of Bharat Mata, Shri Veer Savarkar Ji on his Jayanti today. Shri Vinayak Damodar Savarkar, fondly known as Veer Savarkar, stands tall as a towering beacon of fierce nationalism & resilient patriotism in standing up to the ruthless colonial rulers in India's struggle for independence.

An insightful visionary, Shri Veer Savarkar Ji kindled a powerful revolutionary spark with his uncompromising defense of the cultural & political sovereignty of Bharat. His legendary endurance during grueling incarceration in the Cellular Jail bears testimony to an indomitable spirit & supreme sacrifice.

Shri Veer Savarkar Ji’s intellectual contribution for a strong, united nation continue to guide succeeding generations. His dedication to the motherland is truly worthy of emulation, inspiring a deep sense of pride, courage, & duty.

Photos from M. Venkaiah Naidu's post 23/05/2026

శనివారం హైదరాబాదులోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో నిర్వహించిన శ్రీ గోరా శాస్త్రి గారి స్మారక ఉత్తమ జర్నలిస్టు పురస్కార ప్రధానం కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఈ పురస్కారానికి ఎంపికైన ప్రముఖ జర్నలిస్ట్ శ్రీ జి వల్లీశ్వర్ గారికి హృదయపూర్వక అభినందనలు. ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేసిన నవ సాహితీ ఇంటర్నేషనల్ వారికి, కార్యక్రమాన్ని నిర్వహించిన వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా వారికి అభినందనలు.
శ్రీ గోరా శాస్త్రి గారు, తెలుగు పత్రికా రచనలో, సాహితీ రచనలో ఆజానుబాహుడు.నిజాన్ని నిర్భయంగా, నిష్కర్షగా, కుండబద్దలు కొట్టినట్టు చెప్పి… సునిశిత విమర్శతో హాస్యాన్నీ, వ్యంగాన్నీ, ధర్మాగ్రహాన్నీ, సాహితీ వైదుష్యాన్నీ సమపాళ్లలో మేళవించే గోరాశాస్త్రి సంపాదకీయాలంటే పాఠకులు చెవి కోసుకునేవారు. నేటితరం పాత్రికేయులు గోరా గారి రచనలను చదవాలి.

ఇటువంటి మహానుభావుల వారసత్వాన్ని నేటి జర్నలిస్టులు నిలబెట్టాలి. సంచలనాలకు దూరంగా, సత్యానికి దగ్గరగా మీడియా ఉండాలి.
నేడు ప్రపంచం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. యుద్ధాలు, ఘర్షణలు, వాటి వల్ల తలెత్తుతున్న ఎన్నోసమస్యలు ప్రజల జీవితాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. వీటిని ఎదర్కోవడానికి ప్రభుత్వాలు, మేధావులు ఎన్నో చర్యలు తీసుకుంటుంటారు. వీటిపై ప్రజలను చైతన్య పరిచి, వారిలో అవగాహన కల్పించి సమస్యల తీవ్రతను తగ్గించే గురుతర బాధ్యపోయకూడదుకు ఉంది.

20/05/2026

Shri Shivraj Singh Chauhan Ji, Union Minister for Agriculture & Farmers’ Welfare called on me at my residence in Hyderabad today. During this interaction, we discussed issues related to agriculture & the critical role played by farmers in strengthening our economy.

Photos from M. Venkaiah Naidu's post 20/05/2026

ఆంధ్రకేసరి, ధీశాలి, స్వాతంత్ర్య సమరయోధులు శ్రీ టంగటూరి ప్రకాశం పంతులు గారి 69వ వర్ధంతి సందర్భంగా బుధవారం హైదరాబాద్ లోని అసెంబ్లీ ఎదురుగా ఉన్న ఆయన కాంస్య విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించాను. అకుటుంఠిత దేశభక్తి అసమాన ధైర్య సాహసాలు కలిగిన ప్రకాశం పంతులు గారి జీవితం నేటి యువతకు ప్రేరణాదాయకం కావాలి. స్వాంతంత్ర్య ఉద్యమంలో ముందుండి నాయకత్వం వహించడమే కాకుండా సైమన్ కమిషన్ను వ్యతిరేకించిన సందర్భంగా తుపాకులు పేలుస్తామని బ్రిటిష్ పోలీసులు హెచ్చరిస్తే ముందు నన్ను కాల్చండని గుండె చూపించినటువంటి ధీశాలి ప్రకాశం పంతులు గారు. గాంధీజీ సూచనలను, ఆయన బోధనలను స్ఫూర్తిగా స్వీకరించి ఖాదీకి ప్రోత్సాహం ఇవ్వడం, ధరించడమే కాకుండా, న్యాయవాద వృత్తిలో పేదల పక్షాన నిలబడి వాదించిన మహనీయుడు ఆయన. ఒకప్పుడు పెద్ద ధనవంతుడని పేరుగాంచిన ప్రకాశం పంతులు గారు తన సంపాదనంతా సామాన్య జనం కోసం ఖర్చు పెట్టి, ఆఖరికి సామాన్యుడిగా మిగిలిపోయారు. ఆయన త్యాగం స్ఫూర్తిదాయకం. వారు తెలుగువారి పౌరుషానికి మారుపేరు, దేశభక్తికి చిరునామా.

రెండు తెలుగు ప్రభుత్వాలు ఆయన జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాల్సిన అవసరం ఉంది. పాశ్చాత్యీకరణ ప్రభావంలో తప్పుదోవ పడుతున్న యువతకు శ్రీ టంగటూరి ప్రకాశం పంతులు గారి లాంటి మహనీయుల జీవితాలను తెలియపరచి వారిని సరైన దారిలోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేయాలి. ఆయన జీవిత చరిత్రను నేటి తరం ప్రతి ఒక్కరూ చదవాలి, ప్రేరణ పొందాలి. రెండు రాష్ట్రాల్లో అన్ని ప్రముఖమైన ప్రదేశాల్లో ఆయన స్మారక చిహ్నాలు ఏర్పాటు చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆ మహనీయుడి పేరిట స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలి. హైదరాబాద్ లో అసెంబ్లీ ఎదురుగా ఉన్న విగ్రహం వద్ద ట్రాఫిక్ పోస్టు, ఎలక్ట్రికల్ బోర్డుల కారణంగా విగ్రహం సరిగా కనిపించడం లేదు. వీటిని ఇక్కడి నుంచి తరలించి విగ్రహం చక్కగా కనిపించేలా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా నివాళి అర్పించే కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ శాసనసభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ గారికి సూచించాను. దేశం కోసం త్యాగం చేసిన మహనీయులను నిరంతరం స్మరించుకోవాలి. టంగటూరి ప్రకాశం పంతులుగారి 69 వ వర్ధంతి సందర్భంగా టంగటూరి శ్రీరామ్ తదితరులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనడం సంతోషదాయకం.

Photos from M. Venkaiah Naidu's post 16/05/2026

ఆత్మీయులు శ్రీ వరప్రసాద్ రెడ్డి గారి ధర్మపత్ని శ్రీమతి వంసతమ్మ గారి పంచసప్తతి మహోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం ఆనందదాయకం. ఈ సందర్భంగా ఆ దంపతులకు, వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్రీ వరప్రసాద్ రెడ్డి గారి కుటుంబంతో, మా కుటుంబానికి దశాబ్ధాల స్నేహం ఉంది. శ్రీ వరప్రసాద్ రెడ్డి గారి ప్రతి విజయం వెనుక వెన్నంటి నిలిచిన వారి మాతృమూర్తి శ్రీమతి శాంతమ్మ, ధర్మపత్ని శ్రీమతి వసంతమ్మల పాత్ర మహోన్నతమైనది.

తమ శ్రీమతికి పంచసప్తతి నిర్వహిస్తూ... శ్రీరాంభట్ల నృసింహ శర్మ గారిచే "ధర్మపత్ని సమేతస్య", శ్రీ ఆకెళ్ళ రాఘవేంద్ర గారిచే "వసంత రాగం" పేరిట చక్కని పుస్తకాన్ని ఆవిష్కరింప చేయడం ఆనందదాయకం. ఇది వారి అభిరుచికి నిదర్శనం. నా స్వహస్తాలతో ఇంత చక్కని పుస్తకాన్ని ఆవిష్కరించి, తొలి ప్రతిని ప్రముఖ నటులు శ్రీ చిరంజీవి గారికి అందజేయడం ముదావహం.

తల్లి, భార్య పేరిట ట్రస్ట్ ను నిర్వహించడం శ్రీ వరప్రసాద్ రెడ్డి గారి మంచి మనసుకు నిదర్శనమే కాదు... అంతగా ఆయన్ను వీరిద్దరూ ఎలా ప్రభావితం చేశారో కూడా మనం గమనించవచ్చు. ఆ దంపతులిరువురూ భవిష్యత్ జీవితాన్ని అర్థవంతంగా, ఆరోగ్యవంతంగా, ఆదర్శవంతంగా ముందుకు సాగించాలని ఆకాంక్షిస్తూ, శ్రీమతి వసంతమ్మ గారికి మరోసారి పంచసప్తతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

14/05/2026

విద్యకు పేదరికం అడ్డు రాకూడదన్న సత్సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ శ్రీ అబ్దుల్ అజీజ్ గారు ముస్లిం యువతకు ప్రత్యేక ప్రతిభా పరీక్షలను నిర్వహించి, ఉత్తమ ప్రతిభను కనబరిచిన 250 మందికి పైచదువులకు సహకారం అందించాలని నిర్ణయించడం అభినందనీయం. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకొని యువతరానికి ప్రేరణ అందించాలని, పేదరికం రూపంలో విద్యకు ఉండే అడ్డంకులు తొలగించేందుకు కృషి చేయాలని పిలుపునిస్తున్నాను.

ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు – అధికారిక ప్రకటన

వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించనున్న తాలీం – ఏ – హునర్ టాలెంట్ టెస్ట్ గురించి గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వివిధ రకాల వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, అపోహలను నివారించేందుకు అధికారిక మరియు ధృవీకరించబడిన సమాచారాన్ని క్రింది విధంగా తెలియజేయడమైనది:

టాలెంట్ టెస్ట్ అధికారిక షెడ్యూల్:

అప్లికేషన్ ప్రారంభ తేది: 06-05-2026
అప్లికేషన్ చివరి తేది: 12-05-2026
పరీక్ష తేదీ: 17-05-2026 (ఆదివారం)

పైన పేర్కొన్న షెడ్యూల్ ప్రకారమే టాలెంట్ టెస్ట్ నిర్వహించబడుతుంది. ఇతరత్రా ప్రచారంలో ఉన్న సమాచారం, తేదీలు వాస్తవానికి విరుద్ధమైనవి మరియు అవి పరిగణనలోకి తీసుకోబడవు.⁠

- వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి కార్యాలయం.

07/05/2026

మనోగతం —- కాలాతీత కవి - శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్
- ముప్పవరపు వెంకయ్యనాయుడు
--------------------------
ఈరోజు విశ్వకవి రవీంద్రుని జయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. ఆయన కాలంతో పాటే ప్రయాణించారు. అయితే వారి సాహిత్యం మాత్రం కాలప్రవాహంలో కొట్టుకుపోలేదు. సామాజిక సంస్కరణలు, ప్రకృతి ప్రేమ, మానవీయ విలువలు, ఆధ్యాత్మికతను ప్రతిబింబిస్తూ, అనేక ప్రశ్నలకు సమాధానాన్ని అందిస్తూ... యువతరానికి స్ఫూర్తి పంచుతూనే ఉంది. అందుకే ఆయన కాలాతీత కవి, వారి కవిత్వం కాలాన్ని దాటి ప్రయాణిస్తూ... కాలం విసిరే ప్రశ్నలకు సమాధానాలు అందిస్తూనే ఉంది.

ఎక్కడ గట్టి నేలలను రైతులు దున్నుతున్నారో...
ఎక్కడ బాటల కోసం కూలీలు రాళ్లు కొడుతున్నారో...
అక్కడ ఈశ్వరుడు ఎండలో, వానలో...
దుమ్ముకొట్టిన బట్టలతో వారి మధ్యన తిరుగుతున్నాడు.

భగవంతుడు ఎక్కడ అని ఎవ్వరు వెతికినా... విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ఈ పంక్తులు చదివితే చాలు. కచ్చితమైన సమాధానం దొరుకుతుంది. దాదాపు 50 ఏళ్ళుగా నాకు ఎలాంటి సందేహం ఎదురైనా, అనేక సందర్భాల్లో నాకు సమాధానం తెలియజేసిన పుస్తకాల్లో భగవద్గీత మొదటిది అయితే, రవీంద్రుని గీతాంజలి రెండవ పుస్తకం. ఈ కవితలన్నీ రవీంద్రుడు తీరిగ్గా కూర్చుని ఆలోచించినవి కావు. సమాజంలో నెలకొన్న వివిధ సానుకూల, ప్రతికూల పరిస్థితుల మధ్య ఓ కవి మనసు పడిన సంఘర్షణ నుంచి గంగా ప్రవాహంలా పుట్టుకొచ్చినవి. అందుకే ఆ జీవధార ఎంతో మంది జ్ఞాన తృష్ణను తీర్చగలిగింది. మరెంతో మంది కవులు దిశానిర్దేశం చేయగలిగింది. ఎన్ని భాషల్లో, ఎన్ని అనువాదాలు వచ్చినా నిత్యనూతనమై అలరారుతోంది. అందుకే రవీంద్రుని సాహిత్యానికి కాలదోషం పట్టదు. ఆయన కాలాతీతమైన కవి. ప్రకృతితో పాటే ఆయన కవిత్వం కూడా భవిష్యత్ తరాల కోసం తలుపులు తెరిచి ఆహ్వానిస్తూ ఉంటుంది.

1913లో భారతదేశ సాహిత్యానికి నోబెల్ పురస్కారాన్ని తీసుకొచ్చిన రవీంద్రనాథ్ ఠాగూర్ జీవితం ఎంతో ప్రత్యేకమైనది. చిన్నతనంలో తల్లిని కోల్పోయిన ఆయన, 8 సంవత్సరాల వయసులోనే పద్యాలు రాయడం ప్రారంభించారు. ఆయన మొదటి పద్య సంపుటి భాను సింహను బెంగాలీ పండితులు ఆమోదించలేదు. ఈ సందర్భం నుంచి యువత నేర్చుకోవలసింది ఎంతో ఉంది. తొలి కవిత ఆమోదం పొందకపోయినా, నోబెల్ బహుమతి వరకూ రవీంద్రుని ప్రస్థానం సాగిందంటే... ఆయన ఎన్ని తిరస్కారాలను ఎదుర్కొని ఉంటారు. ప్రతి తిరస్కారం నుంచి ఎన్ని పాఠాలు నేర్చుకుని అంత ఎత్తుకు ఎదిగి ఉంటారో అవగతం చేసుకోవాలి. నాటి బ్రిటీష్ పాలనలో సమాజం ఎదుర్కొంటున్న బాధలను దగ్గర నుంచి చూసిన ఆయన విశ్వమానవతా వికాసాన్ని ఆకాంక్షించారు. మన పెద్దలు ఆచరణలో చూపించిన వసుధైవ కుటుంబక భావన గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం చేశారు.

చిన్నతనంలో ప్రకృతి పట్ల అవ్యాజమైన ప్రేమాభిమానాన్ని పెంచుకున్న శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్, ప్రకృతి ఒడిలోనే విద్యాభ్యాసన పూర్తి చేశారు. చిన్నతనం నుంచే సంగీతం, సాహిత్యం, కళలపై ఆసక్తిని పెంచుకున్నారు. అదే స్ఫూర్తితో, బాలల హృదయాలను వికసింపజేయాలన్న సంకల్పంతో ప్రాచీన ఋషుల గురుకులాల తరహాలోనే శాంతినికేతన్ గా ప్రసిద్ధి గాంచిన విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ఐదుగురు విద్యార్థులతో మొదలైన ఆ విద్యాసంస్థ క్రమంగా విస్తరించింది. విద్యార్థులు తమ పనులను తామే చేసుకోవడం మొదలుకుని, ఆసక్తులకు అనుగుణంగా విభిన్న కళలలో నైపుణ్యంతో వికాసాన్ని సాధించే విధంగా విద్యను అందించడం ప్రారంభించారు. వారి దృష్టిలో విద్య అంటే పాఠ్యపుస్తకాల్లో ఉన్న మాటలు మాత్రమే కాదు, సమస్త ప్రకృతిలో అంతర్లీనంగా ప్రవహిస్తున్న స్ఫూర్తి. శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన నాటకాలు సమాజాన్ని నేటికీ ఆలోచింపజేస్తాయి. ప్రకృతి ఔన్నత్యాన్ని తెలియజేస్తూ ఆయన రచించిన కవిత్వం, నాటకాలు దిశానిర్దేశం చేస్తాయి.

మహాత్మ గాంధీజీతో పరిచయం రవీంద్రుని జీవితాన్ని, ఆయన సాహిత్యాన్ని నూతన మార్గం వైపు నడిపించింది. ముఖ్యంగా కుల వివక్షను తొలగించడానికి ఆయన చేసిన కృషి మహోన్నతమైనది. అంటరానితనాన్ని నిర్మూలించేందుకు ఆయన అనేక ప్రయత్నాలు చేయడమే కాదు, భవిష్యత్ తరాలకు అనేక మార్గాలు సూచించారు కూడా. ముఖ్యంగా గ్రామీణ పునర్వీకాసాన్ని సాధించాలన్న సంకల్పంతో వారు స్థాపించిన శ్రీనికేతన్ సంక్షేమ సంస్థ స్ఫూర్తి, స్వాతంత్ర్య భారతంలో గ్రామీణ సాధికారతకు బాటలు వేసింది. వారి సాహిత్యం, ఆలోచనలు, చేపట్టిన కార్యక్రమాలు అన్నీ ఒకే మార్గంలో ముందుకు సాగాయి. వారు కలలుకన్న భవిష్యత్ భారతం వివక్షలకు అతీతమైనది. ప్రకృతి అందాలకు నెలవైనది. వికాసంలోని అసలైన అర్థాన్ని ఆవిష్కరించేది. అందుకే రవీంద్రుని ప్రతి మాటను నేటికీ భారతీయ సమాజం మంత్రంలా భావిస్తూ ఆయన చూపించిన మార్గంలో ముందుకు నడుస్తూనే ఉంది.

బహుముఖ ప్రజ్ఞాశాలి అనే మాట రవీంద్రునికి చాలా చిన్నది అవుతుందని నా అభిప్రాయం. జీవితాన్ని నేర్చుకోవడంలోనూ, నేర్చుకున్న దాన్ని భవిష్యత్ తరాలకు అందించడంలోనూ ఆయన ముందుకు సాగారు. 1913లో గీతాంజలి కవితా సంపుటికి నోబెల్ బహుమతిని అందుకున్నారు. ఆ సందర్భంలో బ్రిటన్ మహారాణి వారికి నైట్ బిరుదును ప్రదానం చేశారు. అయితే ఆ తర్వాత జలియన్ వాలాబాగ్ దుర్ఘటన సమయంలో నిరసనగా ఆ బిరుదును త్యజించిన వారి దేశభక్తి నిరుపమానమైనది. వారు రచించిన జనగణమన, భారతీయుల జాతీయ గీతం మాత్రమే కాదు, భారతజాతి సంఘటిత శక్తిని ఆవిష్కరించే గీతం కూడా. సరళమైన పదాల్లో, లోతైన భావాలను ఆవిష్కరించే వారి కవిత్వం ఓ విజ్ఞాన సర్వస్వం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి కవిత్వంలో నాకు నచ్చిన, స్ఫూర్తినిచ్చిన కవితను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను.

ఎక్కడ మనసు నిర్భయంగా వుంటుందో...
ఎక్కడ మనుషులు తలలెత్తి తిరుగుతారో...
ఎక్కడ జ్ఞానం విరివిగా వెల్లివిరుస్తుందో...
ఎక్కడ అలసటనెరగని శ్రమ తన బాహువుల్ని పరిపూర్ణత వైపు జాస్తుందో...
ఎక్కడ నిర్జీవమైన ఆచారపుటెడారిలో స్వచ్ఛమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోదో...
ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాలలోకి, పనులలోకి నడుస్తుందో...
ఆ స్వేచ్ఛా స్వర్గానికి...
తండ్రీ... నా దేశాన్ని మేల్కొలుపు

ఇందులోని ప్రతి మాట మన హృదయపు లోతుల్లోకి వెళ్ళాలి. ఇది ప్రార్థన మాత్రమే కాదు. మన సంకల్పం కూడా కావాలి. ప్రపంచ నిర్భయంగా ఉండడం, తలలెత్తుకు తిరగడం, విజ్ఞానం, పరిపూర్ణత... ఇలా ప్రతి ఒక్కటీ నిర్దేశించేది యువతరమే. అందుకే ఈతరం యువత రవీంద్రుని జీవితాన్ని అధ్యయనం చేయడం మాత్రమే కాకుండా... వారి సాహిత్యం నుంచి స్ఫూర్తిని పొందాలని ఆకాంక్షిస్తున్నాను.

04/05/2026

నిధి చాలా సుఖమా – రాముని సన్నిధి చాలా సుఖమా అంటూ భక్తిమార్గంలోని ప్రేరణను సంగీత, సాహిత్యాల రూపంలో గడపగడపకూ చేర్చి, నాదోపాసన ద్వారా జీవితాన్ని తరింపజేసుకున్న వాగ్గేయకారుడు శ్రీ త్యాగరాజస్వామి జయంతి సందర్భంగా వారి స్మృతికి ప్రణతులు అర్పిస్తున్నాను. ఆదర్శనీయమైన వారి జీవితాన్ని యువత అధ్యయనం చేసి, వారి స్ఫూర్తితో భవిష్యత్ భారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాను.

Want your business to be the top-listed Government Service in New Delhi?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Website

Address


No1 Thayaraja Marg
New Delhi
110001