03/06/2026
కిన్నెరసాని పుట్టుక మరియు దాని ప్రయాణం
చాలామందికి కిన్నెరసాని అనగానే పాల్వంచ దగ్గరి డ్యామ్, అక్కడి పచ్చని కొండలు మాత్రమే గుర్తొస్తాయి. కానీ, వికీపీడియా సమాచారానికి భిన్నంగా.. మన కిన్నెరసాని నది అసలు జన్మస్థానాన్ని శాటిలైట్ మ్యాప్స్ ద్వారా క్షుణ్ణంగా పరిశీలిస్తే ఒక అద్భుతమైన నిజం బయటపడింది.
మిగతా నదుల్లా ఇది కేవలం ఒక దగ్గర మాత్రమే పుట్టి ప్రవహించే నది కాదు. ప్రకృతి ఒడిలో పుట్టిన ఈ చిన్న నది.. కేవలం నీటి ప్రవాహం మాత్రమే కాదు, ఒక అడవి బిడ్డ. చుట్టూ ఎత్తైన కొండలు, శతాబ్దాల నాటి చెట్లు, పక్షుల కిలకిలరావాల మధ్య కిన్నెరసాని ప్రయాణం చాలా నిశ్శబ్దంగా మొదలవుతుంది. మన దట్టమైన తాడ్వాయి అడవులు కేవలం ప్రకృతి సంపదకే కాదు, ఎన్నో ఉపనదుల పుట్టినింటికి నిలయం. పసర గుండాల రహదారి లో చింతలకటపూర్ వద్ద జంపన్న వాగు పుట్టి మేడారం మీదుగా ప్రవహించి ఏటూరు నాగారం వద్ద గోదావరిలో కలుస్తుంటే, ఇంకో పక్క అల్లిగూడెం దగ్గర పుట్టిన ఒక వాగు తాడ్వాయి గుండాల రహదారి వెంట ప్రవహిస్తూ దామరతోగు, కరకగూడెం మీదుగా వెళ్ళి బయ్యారం వద్ద గోదావరి నదిలొఓ కలుస్తుంది. మన కిన్నెరసాని ఈ రెండింటి మధ్యలో వున్న లవ్వల్-చౌలేడ్ మధ్య అరణ్యం, మొట్లగూడెం అడవి ప్రాంతం, మరియు తిమ్మనతోగు కొండల నడుమ.. మూడు వేర్వేరు పాయలుగా ఈ నది పుడుతోంది. మారుమూల కొండల్లో సన్నని ఊటల్లా మొదలైన ఈ మూడు ప్రవాహాలు, అడవిని దాటుకుంటూ వచ్చి సరిగ్గా 'బొల్లేపల్లి' గ్రామ సమీపంలో ఒకే మహా ప్రవాహంగా ఏకమవుతున్నాయి! అలా మూడు వేర్వేరు ప్రాణాలు ఒక్కటైన అద్భుత సంగమమే.. మన కిన్నెరసాని!
ఇక్కడతోనే ఈ పరంపర ఆగలేదు., కొంత దక్షిణ దిశగా ప్రవహించి, వెంకటాపురం - చినవెంకటాపురం గ్రామాల మధ్య ఒక వాగును, చినవెంకటాపురం గ్రామానికి తూర్పున వున్న కొండల్లో పుట్టిన ఇంకొక వాగును సాయనపల్లి వద్ద కలుపుకొని, అడవి రామవరం వద్ద వున్న అడవుల్లో పుట్టిన ఇంకొక వాగును మామకన్ను, మైలారం గ్రామాల మధ్య కలుపుకొని, రేగల్ల, పెద్ద వెంకటాపురం మధ్య అదవుల్లో పుట్టిన ఇంకొక వాగును కూడా కలుపుకొని చివరకు బంగారుచెలక గ్రామం వద్ద రిజర్వాయర్ గా మారి సేద తీరుతూ KTPS అవసరాలు తీరుస్తూ, ఎన్నో గ్రామాల సేద్యాన్ని, తాగునీతి అవసరాలు తీరుస్తుంది.
విశ్వనాథ వారి అమర కావ్యం: విశ్వనాధ సత్యనారాయణ గారు తండ్రి శోభనాద్రిగారితో పాటు బొగ్గులకుంట దగ్గర తమ భూములు చూసుకోవడానికి ఒకసారి వెళ్ళారట. పోలవరంలో విశ్రాంతికై ఆగగా, అక్కడ జనుల మాటల్లో మొదటిసారి 'కిన్నెరసాని వాగు' అని విన్నారు. మర్నాడు ఆ వాగుని చూసారు. కిన్నెర అనే పేరు, సూర్యోదయ సమయం లోని ప్రశాంతమైన ప్రకృతి నిశ్శబ్ద వాతావరణంలో ఆ వాగు యొక్క లయబద్ధమైన మ్రోతలు ఆయన మనసులో ముద్రించుకుపోయాయి. అడవి బిడ్డలా పుట్టిన ఈ నది పరుగులను, అలల నడకలను చూసి మురిసిపోయిన కవిసామ్రాట్ సరస్వతీ పుత్రులు అపర శ్రీనాధులు ప్రాతహ్స్మరణీయులు కవిసామ్రాట్ శ్రీమాన్ విశ్వనాధ సత్యనారాయణ గారు 1920వ దశకంలో ‘కిన్నెరసాని పాటలు’ అనే అమర కావ్యాన్ని రాశారు. ఒక గిరిజన పడుచుపిల్ల కన్నీరే నదిగా మారిందనే జానపద గాథను ఆధారం చేసుకుని.. కిన్నెరసాని నడకలు కడలి రాజుకు నచ్చాయని ఆయన వర్ణించిన తీరు తెలుగు సాహిత్య చరిత్రలోనే నిలిచిపోయింది. తరువాతి కాలంలో ఎన్నో పాటలలో కిన్నెరసాని పేరు వినియొగించబడింది. "కిన్నెరసాని వచిందమ్మా వెన్నెల పైటేసి.." అనే పాట అందరికీ తెలిసిందే కదా.
ఇది కేవలం నది మరియు దాని ప్రవాహం మాత్రమే., రేపు ఈ ప్రాజెక్త్టు, అభయారణ్యం విషయాలు మాట్లాడుకుందాం.
(గమనిక: ఈ పోస్ట్‌తో పాటు జత చేసిన మ్యాప్ ఇమేజ్ లో కిన్నెరసాని నది పుట్టిన ఆ మూడు పాయల అసలైన జన్మస్థానాన్ని గూగుల్ మ్యాప్ లో కనపడిన మేర పరిశీలించి చిత్రించడం జరిగినది. ఇక్కడ ఇచ్చిన మ్యాప్ మరియు ఆ మార్కింగ్ లు కిన్నెరసాని నది మరియు ఈ గ్రామం పైన వున్న ప్రేమ కొద్దీ చేసినవి. ఇంకా ఏదైనా మార్పులు, గ్రామాల పేర్లు మారి వుండవొచ్చు. దయచేసి గమనించగలరు.)