12/06/2026
ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం
• అధికార గర్వానికి ప్రజలు నేర్పిన గుణపాఠమే 2024 తీర్పు
• ప్రజలు మనకు ఇచ్చింది అధికారం కాదు.. రాష్ట్రాన్ని కాపాడే గొప్ప బాధ్యత
• మహాత్మా గాంధీ, అంబేద్కర్, దీనదయాళ్ ఉపాధ్యాయ ఆశయాల సమాహారమే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ పాలన
• నవ భారత నిర్మాణంలో పంచాయతీల పాత్రే కీలకం
• స్థానిక సంస్థలను బలహీనపరిచి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయలేం
• కుల, ప్రాంతీయ పరిమితులు దాటి భారతీయత వైపు అడుగులు వేద్దాం
• వ్యవస్థలపై నమ్మకం తగ్గితే సమాజం ముక్కలవుతుంది
• రెండేళ్లలో మేము నిర్మించింది రోడ్లు, భవనాలు కాదు.. వ్యవస్థలపై ప్రజల్లో నమ్మకం
• అథారిటీ, రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ విడిపోతే వ్యవస్థలు కుప్పకూలతాయి
• సమస్య నిధుల కొరత మాత్రమే కాదు.. బాధ్యతలపై స్పష్టత లేకపోవడమే
• గ్రామసభ బలపడితేనే పంచాయతీ బలం.. పంచాయతీ బలపడితేనే ప్రజాస్వామ్యం పదిలం
• ఆఫీసుల్లో కాదు, ప్రజల సమక్షంలోనే నిర్ణయాలు జరగాలి
• పంచాయతీరాజ్ వ్యవస్థ నాయకులను తయారు చేసే ప్రజాస్వామ్య పాఠశాల
• డిజిటలైజేషన్‌తో పల్లెల ముఖచిత్రాలు మారుతున్నాయి
• వచ్చే ఎన్నికల కోసం కాదు.. వచ్చే తరాల కోసం నిర్ణయాలు తీసుకుందాం
• రాబోయే తరాలు గర్వించే సమాజాన్ని నిర్మించడమే కూటమి ప్రభుత్వ సమష్టి బాధ్యత
• తిరుపతి బహిరంగ సభలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
‘సరిగ్గా రెండేళ్ల క్రితం 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక చారిత్రక తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు కేవలం ఒక గెలుపు కాదు... అహంకారంపై సామాన్యుడు సంధించిన ఒక బలమైన సందేశం. ఒక తిరుగులేని హెచ్చరిక. భయాన్ని, అహంకారాన్ని, అధికారమే అంతా అనే అనాగరిక రాజకీయ సంస్కృతిని ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల కంటే ఎవరూ ఎక్కువ కాదని నిరూపించారు. ఆ నాడు ఓటర్లు ఇచ్చిన తీర్పు ఆంధ్రప్రదేశ్ సమాజానికి కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వడమే కాకుండా, రాబోయే తరాల భవిష్యత్తుకు గట్టి నమ్మకాన్ని కల్పించింది. ప్రజలు మనకిచ్చింది కేవలం అధికారం కాదు, రాష్ట్రాన్ని కాపాడి ప్రగతిపథంలో నడిపించే ఒక గొప్ప బాధ్యత’ అని జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. ఈ చారిత్రక విజయానికి కారణమైన ప్రతి ఓటరుకీ, రైతుకు, నాయకుడికి, కార్యకర్తకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం కూటమిలోని ఏ ఒక్క పార్టీదో కాదు, ఇది ప్రజా విజయమని అన్నారు. రెండేళ్ల క్రితం ప్రజలు ఇచ్చింది అధికారం కాదు బాధ్యత అని తెలిపారు. దేశానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి దూరదృష్టి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి అనుభవం.. ప్రజల ఆకాంక్షలను ప్రతిబించించే జనసేన పార్టీ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి బలమైన పునాది పడినట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం 21 సీట్లకు పరిమితమై జనసేన చేసిన త్యాగానికి ప్రజలు 100 శాతం స్ట్రయిక్ రేట్ తో సమాధానమిచ్చారని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతి వేదికగా ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరిట నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో కలసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సభను ఉద్దేశించి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తూ “ప్రధాన మంత్రిగా సుదీర్ఘకాలం బాధ్యతలు నిర్వర్తించి శ్రీ నెహ్రూ గారి రికార్డును అధిగమించిన గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి కూటమి ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. రెండేళ్ల క్రితం జనసేన 21 సీట్లకు సరిపెట్టుకున్న సందర్భంలో చాలా మంది విమర్శలు చేశారు. మేము రాజీపడలేదు.. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం 21 సీట్లకు పరిమితమయ్యాం. ఆ త్యాగం ఫలితంగా ఈ రోజన రెండేళ్ల క్రితం మేమిచ్చిన హామీలు ఒక్కొక్కటిగా ఆచరణలో కనబడుతున్నాయి. పెరిగిన వృద్ధాప్య పింఛన్లు, మహిళలకి ఆర్థిక భరోసా, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకి అండగా అన్నదాత సుఖీభవ, అన్నా క్యాంటీన్లు, విద్యకి ఇస్తున్న ప్రాధాన్యత, యువతకి ఉపాధి అవకాశాలు ఇలా ప్రతి అంశంలో మేము ఇచ్చిన మాట తూచా తప్పకుండా ఆచరణలోపెడుతున్నాం.
• ప్రజల జీవితాలకు దగ్గరగా ఉండేది గ్రామ పరిపాలనా వ్యవస్థే
మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం, పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన అంత్యోదయ సిద్ధాంతం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా స్థానిక స్వపరిపాలనకు వేసిన బలమైన ప్రజాస్వామ్య పునాదుల తాలూకు ఆలోచనల సమాహారమే నేటి ప్రధాని శ్రీ మోదీ గారి పాలనా తత్వం. “సబ్ కా సాత్.. సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్”. గ్రామాన్ని భారత దేశానికి కేంద్ర బిందువుగా చూడాలన్న ఆకాంక్షతో, అత్యంత నిబద్దతతో కృషి చేస్తున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మాట్లాడుతున్నా. పిల్లవాడి భవిష్యత్తు పాఠశాలలో నిర్ణయించబడినట్టే.. దేశ భవిష్యత్తు గ్రామాల్లో నిర్ణయించబడుతుంది. ఒక రైతు ఆశ, ఒక మహిళ ఆత్మవిశ్వాసం, ఒక యువకుడి ఉపాధి, కుటుంబం ఆరోగ్యం ఇవన్నీ గ్రామ పంచాయతీల ద్వారానే ప్రభావితం అవుతాయి. ప్రజల జీవితాలకు దగ్గరగా ఉండేది గ్రామ పరిపాలనా వ్యవస్థే.. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిపాలనలో సబ్సిడారిటీ అనేది ఒక వ్యవస్థాపక సిద్ధాంతం. ఏ పనిని ప్రజలకు దగ్గరగా, సమర్థంగా చేయగలమో ఆ పనిని అక్కడే చేయాలి. గ్రామ స్థాయిలో అవ్వాల్సిన పని మండల స్థాయికి వెళ్లకూడదు. మన దగ్గర ప్రతి పని ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లాల్సి వస్తుంది.
• అధికారాన్ని కేంద్రీకరించడం ప్రజాస్వామ్యం కాదు
అధికారాన్ని కేంద్రీకరించడం ప్రజాస్వామ్యం కాదు. అధికారాన్ని ప్రజల దగ్గరకు తీసుకువెళ్లడమే నిజమైన ప్రజాస్వామ్యం. ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో 600 మంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఉంటారు. ప్రజాస్వామ్యానికి వారే వేళ్లు. ఆ రూట్స్ ని బలహీనపరిస్తే చెట్టుని బలపర్చలేం. స్థానిక సంస్థల్ని బలహీనపర్చి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయలేం. ఇది ప్రజాస్వామ్య సూత్రం. నాయకత్వం గ్రామ స్థాయి నుంచి రావాలి. రెండేళ్లలో మేము గ్రామాల్లో నిర్మించడానికి ప్రయత్నించింది కేవలం కేవలం రోడ్లు, కాలువలు, భవనాలు కాదు. వ్యవస్థల మీద నమ్మకం. ఒక వ్యవస్థ బలహీన పడినప్పుడు మొదట కోల్పోయేది డబ్బు కాదు. నమ్మకం. వ్యవస్థ న్యాయం చేయకపోతే కులం ముందుకు వస్తుంది. వ్యవస్థ బలహీన పడితే ప్రాంతీయత ముందుకు వస్తుంది. వ్యవస్థపై విశ్వాసం తగ్గితే సమాజం చిన్న చిన్న గుంపులుగా విడిపోతుంది.
• మనమంతా భారతీయత వైపు అడుగులు వేయాలి
తెలుగు రాష్ట్రాలు మరింత బలపడాలంటే ఒక రాష్ట్రం కులాల పరిమితుల్ని దాటాలి. ఇంకో రాష్ట్రం ప్రాంతీయతను దాటాలి. మనమంతా భారతీయత వైపు అడుగులు వేయాలి. అందుకే పంచాయతీరాజ్ శాఖ గురించి మాట్లాడేప్పుడు పథకాలు, చేసే పనులను చెప్పేందుకు మాత్రమే పరిమితం కావడం లేదు. ప్రజాస్వామ్యం రాజ్యాంగం, సామాజిక నియంత్రణ, సామాజిక సమతుల్యత, జాతీయ సమైక్యత, భారతీయత, సామాజిక పరస్పర విశ్వాసం తదితర అంశాలపై మాట్లాడుతాను. సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తాను. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ పెదపెంకి గ్రామంలో ఫైలేరియా సమస్య పరిష్కారం.
• బ్లీచింగ్ కి డబ్బుల్లేవు అన్నారు
గతంలో పంచాయతీరాజ్ వ్యవస్థలో సంస్కరణల కోసం ఎన్నో కమిటీలు వచ్చాయి. శ్రీ బల్వంత్ మెహతీ, శ్రీ ఆశోక్ మెహతా, శ్రీ జీవీకే రావు, శ్రీ ఎల్.ఎన్.సింగ్ తదితరులు ఎన్నో సూచనలు చేశారు. ఇవన్నీ 1972వ 73వ రాజ్యాంగ సవరణగా రూపుదిద్దుకుంది. 1993 నుంచి పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ హోదా లభించింది. ఆర్టికల్ 243 నుంచి 243(ఓ) వరకు పంచాయతీరాజ్ శాఖకు రక్షణ కల్పించింది. 11 షెడ్యూల్ ద్వారా ఇందుకు సంబంధించి 22 అంశాలు రాజ్యాంగంలో చేర్చబడ్డాయి. ఇది ప్రపంచంలో అతిపెద్ద వికేంద్రీకరణ ప్రయోగం. దేశ వ్యాప్తంగా ఉన్న 2.6 లక్షల గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థలకు ఎన్నికైన 30 లక్షల మంది స్థానిక ప్రజా ప్రతినిధులు, 14 లక్షల పైగా మహిళా ప్రజా ప్రతినిధులతో ప్రపంచంలోనే ఇది అతిపెద్ద గ్రాస్ రూట్ ప్రయోగం. అన్ని వ్యయప్రయాసలకోర్చి చట్టాలు చేస్తే ఆ వ్యవస్థ నిజంగా గ్రామానికి అధికారాన్ని ఇచ్చిందా? రాజ్యంగం ఇచ్చిన అధికారం సంపూర్ణంగా అమలయ్యిందా? నిధులు, నిర్ణయాధికారం, బాధ్యత గ్రామానికి చేరాయా? అంటే.. పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు స్వీకరించిన తర్వాత చేసిన రివ్యూల్లో అధికారులు తేల్చింది ఒకటే. గత ప్రభుత్వ నిర్వాకం కారణంగా పంచాయతీల్లో కనీసం బ్లీచింగ్ కి డబ్బులు లేవు. జెండా పండుగ చేయడానికి డబ్బులు లేవు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోయాయి. అనేక పంచాయతీలు అప్పుల బారినపడ్డాయి. పంచాయతీల్లో వేల కోట్ల విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి. గ్రామ స్థాయి పాలన బలహీన పడింది. సర్పంచుల గౌరవo గురించి చెప్పాల్సిన పని లేదు.
• గ్రామ సమస్యలకు గ్రామాల్లోనే పరిష్కారం వెతకాలి
రాజ్యాంగం పంచాయతీలకు హోదా ఇచ్చినా, దానికి జీవం పోయాల్సింది మనమే. పంచాయతీల్లో పాలన అవసరాలకు సరిపడినంత ఉండటం లేదు. ప్రతి చిన్న పనికి పంచాయతీలు ఎదురు చూడాలి. ప్రతి సమస్య ఎమ్మెల్యే దగ్గరకే వెళ్లాలి. సర్పంచ్ గా ఎన్నికైనా అధికారాలు వేరే చోట ఉంటాయి. ఇవన్నీ ఆలోచిస్తే సమస్య కేవలం నిధుల కొరత మాత్రమే కాదని అర్థం అయ్యింది. బాధ్యతలపై స్పష్టత లేకపోవడమే అందుకు కారణం. అథారిటీ ఒకచోట, బాధ్యత ఇంకోచోట, అకౌంటబులిటీ మరోచోట. ఈ మూడు విడిపోతే వ్యవస్థ బలహీనపడుతుంది. దీన్నే బ్రోకెన్ గవర్నెన్నస్ చైన్ అంటారు. గ్రామ సమస్యలకు పరిష్కారం గ్రామాల్లోనే వెతకాలి. ప్రజల జీవితాలు ప్రభావితం చేసే నిర్ణయాలు ప్రజల సమక్షంలోనే జరగాలి. అందు కోసమే గ్రామ సభలను అధికారిక సమావేశంగా కాకుండా గ్రామ ప్రజాస్వామ్యానికి కేంద్ర బిందువుగా మార్చాం. గ్రామానికి ఏమి కావాలి? ఎక్కడ రోడ్లు వేయాలి? ఎక్కడ నీరు అవసరం? ఎవరికి ఇల్లు అవసరం? ఎక్కడ పారిశుధ్య సమస్య ఉంది? ఈ నిర్ణయాలు కార్యాలయాల్లో కాదు గ్రామ సభలో తీసుకోవాలి. ప్రభుత్వానికి కనిపించని సమస్య ప్రజలకు కనిపిస్తుంది. అధికారికి తెలియని అవసరం గ్రామస్తులకు తెలుస్తుంది. గ్రామసభ బలపడితే సర్పంచ్ బలపడతాడు. సర్పంచ్ బలపడితే పంచాయతీ బలపడుతుంది. పంచాయతీ బలపడితే ప్రజస్వామ్యం బలపడుతుంది. అప్పుడే ప్రతి చిన్నసమస్య స్థానిక ఎమ్మెల్యే గారి టేబుల్ మీదకి రావాల్సిన అవసరం ఉండదు. అప్పుడు ఎమ్మెల్యేలు తమకి నిర్దేశించబడిన అసలు బాధ్యతలపై దృష్టి పెడతారు. ఎమ్మెల్యేలు ఉపాధి విధానాలపై, పరిశ్రమల రాకపై, యువత భవిష్యత్తుపై దృష్టి పెడతారు. రాష్ట్ర భవిష్యత్తుని నిర్మిస్తారు.
• పంచాయతీల నుంచే బలమైన నాయకత్వం పుడుతుంది
రాష్ట్ర భవిష్యత్తుని నిర్మించే ప్రక్రియకి ఒక బలమైన నాయకత్వం అవసరం. ప్రజాస్వామ్యంలో నాయకత్వం ఒక రోజులో పుట్టదు. అది గ్రామ సభల్లో, పంచాయతీల్లోనే రూపుదిద్దుకుంటుంది. పంచాయతీ రాజ్ వ్యవస్థ కేవలం ఒక స్థానిక పరిపాలనా వ్యవస్థ కాదు. అది నాయకత్వాన్ని తయారు చేసే ప్రజాస్వామ్య పాఠశాల. గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు తన ప్రయాణాన్ని స్థానిక సంస్థల నుంచే ఒక మున్సిపల్ కౌన్సిలర్ గా మొదలుపెట్టారు. లీడర్ షిప్ అంటే కేవలం రాజకీయ నాయకత్వం కాదు. డాక్టర ఏపీజే అబ్దుల్ కలాం గారు నాయకుడు, మనమంతా గౌరవించే శ్రీ ఎస్.ఆర్. శంకరన్ గారు పాలనాపరంగా గొప్ప నాయకుడు. గొప్ప ఉపాధ్యాయుడు, నిజాయితీగల అధికారి కూడా నాయకులే. పంచాయతీని బలోపేతం చేసే సర్పంచ్ అందరికంటే బలమైన నాయకుడు. భారత దేశంలో మహిళా రాజకీయ నాయకత్వానికి అతిపెద్ద విశ్వ విద్యాలయం పంచాయతీరాజ్ వ్యవస్థ. 50 శాతం మహిళా రిజర్వేషన్ ద్వారా వేలాది మంది మహిళా నాయకులు స్థానిక సంస్థల ద్వారా ముందుకు వస్తున్నారు. స్వయం సహాయక బృందాల ద్వారా మహిళలు సామాజిక, ఆర్ధిక నాయకత్వాన్ని చేపడుతున్నారు. వెనుకబడిన తరగతులు, యువత నుంచి నాయకత్వం వస్తుంది. యువత మొదటి అడుగు గ్రామ స్థాయిలోనే వేయాలి.
• గ్రామ సభతో ప్రతి గడపకు ప్రజాస్వామ్యం
అభివృద్ధికి మొదటి అర్హత స్థిరత్వం. రాష్ట్రంలో గత రెండేళ్లుగా ఏర్పడిన రాజకీయ స్థిరత్వం గ్రామాభివృద్ధికి బలమైన పునాది వేసింది. ఎన్డీఏ నిర్ణయాలతో స్పష్టత వచ్చింది. కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం బలపడింది. ఆ స్థిరత్వం ఆధారంగా గ్రామాన్ని పరిపాలనా కేంద్రంగా నిలబెట్టే ప్రయత్నం ప్రారంభించాం. అందులో భాగంగా 13,326 పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించాం. ప్రజాస్వామ్యాన్ని ప్రతి గడపకు తీసుకువెళ్లాం. ప్రతి పంచాయతీకి ఒక కార్యదర్శిని నియమించాం. స్థానిక అవసరాలకు తగిన విధంగా విధి విధానాలకు రూపకల్పన చేశాం. గ్రామ పంచాయతీల పరిపాలనా సామర్థ్యాన్ని బలోపేతం చేశాం. పల్లెపండుగను ప్రజా ఉద్యమంగా మార్చాం. రాజకీయాలకు అతీతంగా స్థానిక నాయకత్వానికి పోయిన గౌరవాన్ని తిరిగి నిలబెట్టాం.
స్వర్ణ పంచాయతీ దిశగా ప్రయాణం ప్రారంభించాం. ప్రతి ఆలోచనా సిద్ధాంతంగా మిగిలిపోకూడదు, ఫలితంగా కనబడాలన్నదే స్వర్ణ పంచాయతీ. ఇందుకు ఒక ఉదాహరణ. తిరుపతి జిల్లా పరిధిలోని శ్రీనివాసపురం పంచాయతీలో స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా ఆస్తుల వివరాలు శాస్త్రీయంగా నమోదు చేశాం. ఇప్పటి వరకు పంచాయతీ రికార్డులలో కనిపించని ఆస్తులు మొదటిసారి వ్యవస్థల్లో కనిపించాయి. ఆస్తుల సంఖ్య 1,291 నుంచి 1,356కి పెరిగింది. ఫలితంగా పంచాయతీ ఆధాయ సామర్థ్యం రూ. 75 లక్షల నుంచి రూ. 1.66 కోట్లకు పెరిగింది. ఒక్క రూపాయి పన్ను పెంచలేదు. కేవలం స్వర్ణ పంచాయతీ పోర్టల్ లో ఆస్తుల వివరాలు మాత్రమే అప్డేట్ చేశాం. వ్యవస్థలు సరిగా పని చేస్తే గ్రామాలు ఎంతటి సామర్థ్యాన్ని సృష్టించగలవో చెప్పే ఉదాహరణ ఇది. భారత దేశపు అభివృద్ధి ప్రయాణంలో తదుపరి అడుగు ఇక్కడే ఉంది. 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణం పార్లమెంటు భవనం నుంచి కాదు. 2.6 లక్షల గ్రామ పంచాయతీల నుంచి ప్రారంభం అవుతుంది. భారత దేశ భవిష్యత్తు పార్లమెంటులో మాత్రమే కాదు. గ్రామ పంచాయతీల్లో కూడా రాయబడుతుంది. ఒక చిన్న వాగు మొదట తన పరిసరాల్లోని భూములకు నీరందించి తదుపరి నదుల్లో కలుస్తుంది. అలాగే ప్రతి పంచాయతీ ముందుగా తన పరిధిలోని గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అప్పుడే మండలం, జిల్లా, రాష్ట్రం, తద్వారా దేశం బలపడుతుంది.
రెండేళ్ల క్రితం ప్రజలు మాకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చారు. అది కేవలం అధికార బదిలీ కాదు. నమ్మకం బదిలీ. నమ్మకాన్ని నిలుపుకోవడం మన బాధ్యత ఈ దిశగా పని చేస్తన్నాం. నిధుల కోసం, విధానాల కోసం నేను పోరాడగలను. అధికారాల కోసం పోరాడగలను. అయితే ప్రజల భాగస్వామ్యం లేకుండా అభివృద్ధి సాధ్యపడదు. ప్రజలు పార్టీని కాకుండా వ్యవస్థల్ని నమ్మాలి. పార్టీలు వ్యవస్థల్ని బలోపేతం చేయడానికి ఉండాలి. నాయకులను కాకుండా సంస్థలను, వ్యక్తులను కాకుండా విలువలను నమ్మాలి. అప్పుడే ప్రజాస్వామ్యం శాశ్వతం అవుతుంది. ఏ పార్టీ నాయకులు అయినా వ్యవస్థల్ని బలోపేతం చేసే దిశగా, విలువల్ని కాపాడే దిశగా, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తే కూటమికి తిరుగుండదు. అప్పుడు మాత్రమే గ్రామస్వరాజ్యం సాధ్యం అవుతుంది. సామాజిక విశ్వాసం పునరుద్ధరణ జరుగుతుంది. అప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుంది. గ్రామం బలపడితేనే ప్రజాస్వామ్యం బలపడుతుంది. ప్రజాస్వామ్యం బలపడితే దేశం బలపడుతుంది. అందుకే మా ప్రయాణం కేవలం ఒక ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం కాదు. దేశాన్ని నిర్మించడం కోసం. మనం తీసుకునే నిర్ణయాలు వచ్చే ఎన్నికల గురించి కాకుండా భవిష్యత్ తరాల కోసం ఉండాలి. అదే ప్రజాస్వామ్యం, అదే సుస్థిర అభివృద్ధి, వికసిత్ భారత్ కు మార్గం. రాబోయే తరాలు గర్వించే సమాజాన్ని నిర్మించడం కూటమి బాధ్యత. ఆ బాధ్యతను నిర్వర్తించే సంకల్పంలో గ్రామం నుంచి దేశం వరకు బాధ్యతతో కూడిన అభివృద్ధి యాత్రను ముందుకు తీసుకువెళ్తామని తెలియజేసుకుంటున్నాను” అన్నారు.
ఈ చంద్రగిరి శాసనసభ్యులు శ్రీ పులివర్తి వెంకట మణిప్రసాద్ గారి అధ్యక్షతన జరిగిన ఈ సభలో కేంద్ర మంత్రులు శ్రీ రామ్మోహన్ నాయుడు గారు, శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి.వి.ఎన్.మాధవ్ గారు, రాష్ట్ర విద్య, ఐటి, కమ్యునికేషన్, మానవ వనరుల శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు, పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు, రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.