East Godavari District Police

Call Directions Website Contact the organization

East Godavari District Police Safety, Security of the People and Social Justice are our concern.

స్థానిక సంస్థల ఎన్నికల భద్రతపై ఏలూరు రేంజ్ ఐజీ సమీక్ష – దేవరపల్లి పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీస్థానిక సంస్థల ఎన్నికల నేప...
13/11/2026

స్థానిక సంస్థల ఎన్నికల భద్రతపై ఏలూరు రేంజ్ ఐజీ సమీక్ష – దేవరపల్లి పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీ

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈరోజు ఏలూరు రేంజ్ ఐజీ శ్రీ జి.వి.జి. అశోక్ కుమార్, ఐపీఎస్ గారు తూర్పుగోదావరి జిల్లా పోలీసు కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్, ఐపీఎస్ గారు మరియు ఇతర పోలీసు అధికారులు ఐజీ గారికి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం సాయుధ పోలీసు సిబ్బంది ఐజీ గారికి గౌరవ వందనం స్వీకరించారు.

స్థానిక సంస్థల ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై సమీక్ష:

జిల్లా పోలీసు కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్‌లో పోలీసు అధికారులతో ఐజీ గారు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ (MPTC), జడ్పీటీసీ (ZPTC) ఎన్నికలను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించినందుకు పోలీసు అధికారులు మరియు సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తితో రాబోయే పంచాయతీ మరియు రాజమహేంద్రవరం మున్సిపల్ ఎన్నికలను కూడా సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన భద్రతా ఏర్పాట్లు, శాంతిభద్రతల పరిరక్షణ మరియు ఎన్నికల విధుల నిర్వహణ తీరును ఐజీ గారు నిశితంగా పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సమస్యాత్మక గ్రామాలను ముందుగానే గుర్తించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, అవసరమైన ప్రాంతాల్లో డ్రోన్ నిఘా చేపట్టాలని సూచించారు. రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులపై ముందస్తు బైండోవర్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

గ్రామస్థాయి ఇంటెలిజెన్స్ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, కుల, మత, రాజకీయ, ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టే సామాజిక మాధ్యమ పోస్టులపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు.

2. దేవరపల్లి పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీ:

అనంతరం జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్ గారితో కలిసి ఐజీ గారు దేవరపల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసి రికార్డులు, కేసు డైరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు దిశానిర్దేశాలు చేశారు:

• తీవ్ర నేరాలు & పోక్సో (POCSO) కేసులు: మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలు, ముఖ్యంగా పోక్సో (POCSO) మరియు ఇతర తీవ్ర నేరాల (Grave Cases) దర్యాప్తులో అత్యంత నాణ్యత పాటించాలి. పకడ్బందీ సాక్ష్యాధారాలు సేకరించి, 'గుడ్ ట్రయల్ మానిటరింగ్' ద్వారా నేరస్థులకు న్యాయస్థానాల్లో కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలి.

• లైవ్ ఇష్యూస్ (Live Issues) పరిష్కారం: గ్రామస్థాయిలో తలెత్తే వివాదాలు (Live Issues) ఎందుకు ఉత్పన్నమవుతున్నాయో మూలాలను విశ్లేషించి, అవి పెద్దవి కాకముందే శాంతియుతంగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలి.

• సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ: నేరాల నియంత్రణలో భాగంగా గ్రామాలు, కూడళ్లలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల నియంత్రణ మరియు పర్యవేక్షణ నేరుగా పోలీస్ స్టేషన్ నుండి జరిగేలా చూడాలి.

• ప్రజలతో సత్సంబంధాలు: స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి, వారి సమస్యలకు సత్వర న్యాయం అందించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) శ్రీ పాటిల్ దేవరాజ్ మనీష్ ఐపీఎస్ గారు , సెంట్రల్ జోన్ ఏఎస్పీ శ్రీ తరుణ్ పహ్వా ఐపీఎస్ గారు , ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీ ఎల్. చెంచి రెడ్డి గారు , స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీ బి. రామకృష్ణ గారు , జోనల్ డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

11/11/2026
పుష్కరాలు–2027 ఏర్పాట్లపై వివిధ శాఖలతో జిల్లా ఎస్పీ సమీక్ష  శాఖలవారీగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలి – జిల్లా...
11/11/2026

పుష్కరాలు–2027 ఏర్పాట్లపై వివిధ శాఖలతో జిల్లా ఎస్పీ సమీక్ష

శాఖలవారీగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలి – జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్, ఐపీఎస్.

రానున్న గోదావరి పుష్కరాలు–2027ను దృష్టిలో ఉంచుకుని భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యాలు, పటిష్టమైన భద్రత, సమర్థవంతమైన ట్రాఫిక్ నిర్వహణ కల్పించేందుకు అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్, ఐపీఎస్., గారు సూచించారు.

ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ గారి అధ్యక్షతన రైల్వే, ఆర్టీసీ, జాతీయ రహదారుల సంస్థ, రవాణా, రెవెన్యూ, పర్యాటక, మున్సిపల్ తదితర శాఖల అధికారులతో పాటు చెన్నై యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (CUMTA), ఎర్నెస్ట్ అండ్ యంగ్ (EY) బృందాల ప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో పుష్కరాల సమయంలో భక్తుల రాకపోకలు, రవాణా సౌకర్యాలు, రైల్వే స్టేషన్లలో రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్, నిత్యావసర వస్తువుల సరఫరా తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు శాఖలవారీగా పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

శాఖలవారీగా జిల్లా ఎస్పీ గారి ముఖ్య సూచనలు

1. రైల్వే శాఖ

1. రాజమహేంద్రవరం ఈస్ట్, వెస్ట్ రైల్వే స్టేషన్లలో రెండు వైపులా ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు (Entry & Exit) ఏర్పాటు చేయాలా? లేదా ఒక వైపు ప్రవేశానికి (Entry), మరో వైపు నిష్క్రమణకు (Exit) మాత్రమే కేటాయించాలా? అనే అంశంపై క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించి స్పష్టమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలి.
2. పుష్కరాల ప్రత్యేక రైళ్లను రాజమహేంద్రవరం, కొవ్వూరు, భీమవరం తదితర ప్రాంతాలను అనుసంధానించే సర్క్యూట్ విధానంలో నడిపే అవకాశాలను పరిశీలించాలి.
3. రైలులో వచ్చి బస్సుల ద్వారా తిరుగు ప్రయాణం చేసే భక్తులకు అనువైన రవాణా సదుపాయాలు కల్పించేలా ప్రణాళిక రూపొందించాలి.
4. గోదావరి రైల్వే స్టేషన్‌తో పాటు ఇతర ప్రధాన స్టేషన్లలో భక్తుల రద్దీ నియంత్రణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి.

2. ఆర్టీసీ శాఖ

1. శబరిమల, కుంభమేళా వంటి భారీ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అనుసరించిన ఉత్తమ రవాణా విధానాలను అధ్యయనం చేయాలి.
2. పుష్కర్ నగర్లకు బస్సుల రూట్లు, షటిల్ బస్సుల మార్గాలు, వాటి సంఖ్య, రాకపోకల సమయాలు, ప్రతి మార్గంలో బస్సుల విరామ వ్యవధిపై సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలి.
3. రైళ్ల రాకపోకల షెడ్యూల్‌కు అనుగుణంగా బస్సుల సమయాలను నిర్ణయించి, నగరంలో ఒకేసారి వాహనాల రద్దీ పెరగకుండా చర్యలు తీసుకోవాలి.

3. జాతీయ రహదారుల సంస్థ (NHAI)*

1. అన్ని టోల్ గేట్ల వద్ద సీసీ కెమెరాల ద్వారా వాహనాల రాకపోకలను పర్యవేక్షించి, వాహనాల సంఖ్య, రద్దీ వివరాలను కమాండ్ కంట్రోల్ రూమ్‌కు లైవ్ ఫీడ్ ద్వారా అందించాలి.
2. రహదారి కటింగ్‌లు, డైవర్షన్ల వద్ద సైన్ బోర్డులు ఏర్పాటు చేసి, వాహనదారులకు ముందస్తు సమాచారం అందించే అనౌన్స్‌మెంట్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
3. పుష్కర్ నగర్లకు సమీపంలోని రహదారుల వద్ద తగిన లైటింగ్, రోడ్డు విస్తరణ, క్రేన్లు, టోయింగ్ వాహనాలు, వాహనాలు నిలిచిపోయిన సందర్భాల్లో అవసరమైన అత్యవసర లాజిస్టిక్స్ ఏర్పాట్లపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలి.

4. రవాణా శాఖ

1. రాజమహేంద్రవరం నగరంలో నమోదైన ద్విచక్ర, త్రిచక్ర, నాలుగు చక్రాల వాహనాల వివరాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన వాహనాల సమగ్ర డేటాను సిద్ధం చేయాలి.
2. పుష్కరాల సమయంలో నగరంలోని ఘాట్లు, పుష్కర్ నగర్లు, ప్రధాన రహదారుల్లో రద్దీ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు
3. పుష్కరాల సమయంలో నగరంలో ట్రాఫిక్ మరియు ఘాట్ల వద్ద రద్దీ వివరాలను స్థానిక, ఇతర ప్రాంతాల వాహనదారులందరికీ *ఎస్ఎంఎస్ (SMS) వ్యవస్థ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందించే ఏర్పాటు చేయాలని* రవాణా శాఖ అధికారులకు సూచించారు

5. రెవెన్యూ శాఖ

1. నాలుగు రోజుల్లోగా రెవెన్యూ, పోలీస్, దేవాదాయ, ఆర్ అండ్ బి, ఆర్టీసీ తదితర శాఖల ప్రతినిధులతో మైక్రో జాయింట్ టీమ్స్ ఏర్పాటు చేయాలి.
2. ఈ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి రహదారులు, పార్కింగ్ ప్రాంతాలు, లైటింగ్, రవాణా సౌకర్యాలు, ఇతర మౌలిక వసతులను పరిశీలించి నివేదికలు సమర్పించాలి.
3. నగరంలో ఇంధనం నింపుకునే వాహనాల రద్దీ పెరగకుండా నగర శివార్లలో ఫ్యూయల్ స్టేషన్ల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి.
4. నిత్యావసర వస్తువుల సరఫరా వాహనాలకు ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేసి, నగరంలోకి ప్రవేశించే సమయాలను నిర్ణయించాలి.

6. పర్యాటక శాఖ, ట్రాఫిక్ పోలీస్, మున్సిపల్ శాఖలు

1. పుష్కర్ నగర్లలో అంతర్గత ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్, వాహనాల రాకపోకలపై సమగ్ర ప్రణాళిక రూపొందించి CUMTA, EY బృందాలకు అందించాలి.
2. ఆటోలు, ఇతర స్థానిక రవాణా వాహనాలు ఏయే మార్గాల్లో, ఎంత సంఖ్యలో తిరగాలి అనే అంశాలపై సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలి.
3. ఆటోలకు, డ్రైవర్లకు ప్రత్యేక గుర్తింపు పత్రాలు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలి.

CUMTA, EY బృందాలకు ప్రతిపాదనలు సమర్పించాలి

ప్రతి శాఖ తమ పరిధిలో చేపట్టాల్సిన ఏర్పాట్లు, అవసరమైన వనరులు, రవాణా నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేసి CUMTA, EY బృందాలకు అందించాలని జిల్లా ఎస్పీ గారు సూచించారు. ఆయా బృందాలు ఈ ప్రతిపాదనలను పరిశీలించి సాంకేతిక సూచనలు, సలహాలు అందించడం ద్వారా పుష్కరాల నిర్వహణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నాయి.

సమావేశంలో పాల్గొన్న అధికారులు

ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) శ్రీ పాటిల్ దేవరాజ్ మనీష్, ఐపీఎస్., ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ శ్రీ మనోజ్ రెడ్డి, రైల్వే ఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ శ్రీ బి. రాజు, ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీ కె. మాధవ్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ బి. కృష్ణమూర్తి, సిటీ ప్లానర్ శ్రీ జీవీఎస్ఎన్ మూర్తి, CUMTA సభ్యుడు శ్రీ రవిశంకర్, ఎర్నెస్ట్ అండ్ యంగ్ (EY) బృంద సభ్యులు శ్రీ సిద్ధార్థ్, శ్రీ రోహిత్, ఇతర పోలీసు అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

11/11/2026

*గంజాయి కేసులో ముగ్గురు నేరస్తులకు 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, జరిమానా*

* *కేసు వివరాలు:* ఉండ్రాజవరం పోలీస్ స్టేషన్, Cr.No. 260/2022, U/S 8(c) r/w 20(b)(ii)(B) of NDPS Act (SC No. 10/2023).
* *శిక్ష పడిన ముద్దాయిలు:* 1. ఎం.డి. షఫీ (MD Shafi), 2. కోసూరి విజయ్ (Kosuri Vijay), 3. బలిబోయిన వెంకటేష్ (Baliboni Venkatesh) - రాజమహేంద్రవరం.

*కేసు నేపథ్యం & తీర్పు వివరాలు:*
ది 23-12-2022 తేదీన ఉండ్రాజవరం మండలం, చివటం గ్రామ రైల్వే గేటు సమీపంలో ముగ్గురు వ్యక్తులు అక్రమంగా గంజాయి కలిగి ఉన్నారనే సమాచారంతో, అప్పటి ఉండ్రాజవరం ఎస్ఐ *శ్రీ కె. రామారావు* గారు సిబ్బందితో దాడి చేసి ముద్దాయిలను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

అనంతరం కేసు దర్యాప్తు అధికారి, అప్పటి నిడదవోలు సీఐ *శ్రీ కె. వెంకటేశ్వరరావు* గారు ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించడంతో పాటు, పక్కా ఆధారాలతో ఏలూరులోని గౌరవ మొదటి అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి కమ్ NDPS కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.

ప్రస్తుత విచారణ సమయంలో కొవ్వూరు డీఎస్పీ *శ్రీ జి. దేవకుమార్* గారి పర్యవేక్షణలో, నిడదవోలు సీఐ *శ్రీ పి.వి.జి. తిలక్* గారు మరియు ఉండ్రాజవరం ఎస్ఐ *శ్రీ డి. రవికుమార్* గారు సాక్షులను సకాలంలో కోర్టులో హాజరుపరిచి ప్రాసిక్యూషన్‌ను బలోపేతం చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ (PP) *శ్రీమతి సంధ్య* గారు కోర్టులో బలమైన వాదనలు వినిపించారు.

విచారణ పూర్తయిన అనంతరం నేరం రుజువు కావడంతో, గౌరవ న్యాయస్థానం ఈరోజు (11-11-2026) U/S 235(2) CrPC ప్రకారం ముగ్గురు ముద్దాయిలలో *ఒక్కొక్కరికి 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు రూ. 20,000/- జరిమానా* విధిస్తూ తీర్పు వెలువరించింది.

*జిల్లా ఎస్పీ గారి అభినందనలు:*
ఈ కేసులో నేరస్తులకు కఠిన శిక్ష పడేలా సమర్థవంతంగా వాదనలు వినిపించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ *శ్రీమతి సంధ్య* గారిని, అలాగే కేసు దర్యాప్తు మరియు ట్రయల్ పర్యవేక్షణలో కీలక పాత్ర పోషించిన పోలీసు అధికారులు, సిబ్బందిని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ *శ్రీ డి. నరసింహ కిషోర్, ఐపీఎస్* గారు ప్రత్యేకంగా అభినందించారు.

*భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారికి ఘన నివాళులు*భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న శ్రీ మౌలా...
11/11/2026

*భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారికి ఘన నివాళులు*

భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న శ్రీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి (జాతీయ విద్యా దినోత్సవం) సందర్భంగా, ఈరోజు తూర్పుగోదావరి జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ *శ్రీ డి. నరసింహ కిషోర్, ఐపీఎస్* గారు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జీవిత విశేషాలను మరియు దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు:

* *స్వాతంత్ర్య పోరాట యోధుడు:* 1888 నవంబర్ 11న జన్మించిన ఆజాద్ గారు గొప్ప పండితుడు, కవి, పాత్రికేయుడు మరియు భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకుడు. 'అల్-హిలాల్' వంటి పత్రికల ద్వారా ప్రజల్లో స్వాతంత్ర్య కాంక్షను రగిలించారు.
* *విద్యా వ్యవస్థ రూపశిల్పి:* స్వతంత్ర భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా (1947-1958) దేశంలో ఆధునిక విద్యా వ్యవస్థకు బలమైన పునాదులు వేశారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IITs), మరియు సాహిత్య అకాడమీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల స్థాపనలో ఆయన పాత్ర మరువలేనిది.
* *జాతీయ విద్యా దినోత్సవం:* విద్యా రంగానికి ఆయన చేసిన అపారమైన సేవలకు గుర్తింపుగా, ఆయన జన్మదినమైన నవంబర్ 11వ తేదీని ప్రతి ఏటా "జాతీయ విద్యా దినోత్సవం"గా జరుపుకుంటున్నాము. 1992లో భారత ప్రభుత్వం ఆయనకు దేశ అత్యున్నత పురస్కారమైన "భారతరత్న"తో సత్కరించింది.

నేటి యువత, విద్యార్థులు ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని విద్య ద్వారా దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎస్పీ గారు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) *శ్రీ పాటిల్ దేవరాజ్ మనీష్, ఐపీఎస్* గారు, ఇతర పోలీసు అధికారులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొని నివాళులర్పించారు.

జిల్లా ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్, ఐ.పి.ఎస్. గారుచెడుపై మంచి, చీకటిపై ...
07/11/2026

జిల్లా ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్, ఐ.పి.ఎస్. గారు

చెడుపై మంచి, చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే పవిత్ర దీపాల పండుగ ‘దీపావళి’ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ప్రజలందరికీ జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్, ఐ.పి.ఎస్. గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

"దీపావళి అంటే కేవలం టపాసులు కాల్చడం మాత్రమే కాదు; సమాజంలో అజ్ఞానం, అసూయ, ద్వేషం వంటి చీకట్లను పారద్రోలి జ్ఞానం, ఆనందం, సౌభ్రాతృత్వం అనే వెలుగులను నింపడం. ఈ పండుగ ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాన్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను" అని పేర్కొన్నారు.

అలాగే, పండుగను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అత్యంత అప్రమత్తతతో జరుపుకోవాలని ప్రజలకు పలు భద్రతా సూచనలు జారీ చేశారు:

* *పర్యావరణహిత దీపావళి:* వాయు, శబ్ద కాలుష్యాలను దృష్టిలో ఉంచుకుని పర్యావరణానికి హాని కలిగించని గ్రీన్ క్రాకర్స్ (Green Crackers) మాత్రమే వినియోగించాలి.
* *చిన్నారులపై పర్యవేక్షణ:* పిల్లలు టపాసులు కాల్చే సమయంలో పెద్దలు తప్పనిసరిగా వారి వద్దే ఉండి పర్యవేక్షించాలి. వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించడం ఉత్తమం.
* *అగ్ని ప్రమాదాల నివారణ:* టపాసులు కాల్చే ప్రదేశంలో ముందుజాగ్రత్తగా నీరు మరియు ఇసుక బకెట్లను సిద్ధంగా ఉంచుకోవాలి. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, గుడిసెలు మరియు వాహనాల దగ్గర క్రాకర్స్ కాల్చకూడదు.
* *శబ్ద కాలుష్యం నియంత్రణ:* వయోవృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారు, పసిపిల్లలు ఉన్న ప్రాంతాలు మరియు ఆసుపత్రుల పరిసరాల్లో అధిక శబ్దం వచ్చే బాంబులను కాల్చకుండా చూడాలి. మూగజీవాలను భయభ్రాంతులకు గురిచేయకూడదు.
* *అత్యవసర సహాయం:* ఏవైనా అత్యవసర పరిస్థితులు లేదా ప్రమాదాలు సంభవించినప్పుడు వెంటనే పోలీసు అత్యవసర విభాగం *‘డయల్ 112 /9154880083* లేదా అగ్నిమాపక శాఖ *‘101’* కు సమాచారం అందించాలి.

జిల్లా వ్యాప్తంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు మరియు గస్తీ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ గారు తెలిపారు. చట్టాన్ని గౌరవిస్తూ, బాధ్యతాయుతంగా పండుగను జరుపుకొని పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా ప్రజలను కోరారు.

06/11/2026

MPTC/ ZPTC ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పటిష్ట పోలీసు భద్రతా ఏర్పాట్లు

రాజానగరం, కోవ్వూరు, నిడదవోలు కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు – ట్రాఫిక్ మళ్లింపులు, ప్రత్యేక నిఘా – BNSS సెక్షన్ 163 నిషేధాజ్ఞలు అమలు – కౌంటింగ్ అనంతరం విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి లేదు: జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్, ఐ.పి.ఎస్.

తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం, కోవ్వూరు, నిడదవోలు MPTC/ ZPTC లలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రజలకు, రాజకీయ నాయకులకు, వివిధ పార్టీల అభ్యర్థులకు జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్, ఐ.పి.ఎస్. గారు ధన్యవాదాలు తెలియజేశారు.

కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత:

కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు, ఫ్రిస్కింగ్, గుర్తింపు కార్డుల తనిఖీలు, నిరంతర నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల అధికారులు అనుమతించిన వ్యక్తులను మాత్రమే లోపలికి అనుమతిస్తారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించని వస్తువులు, మొబైల్ ఫోన్లు తీసుకెళ్లరాదు. కౌంటింగ్ ఏజెంట్లు నియామక పత్రాలు, గుర్తింపు కార్డులు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి.

నిషేధాజ్ఞలు – శాంతిభద్రతలు:

BNSS సెక్షన్ 163 ఉత్తర్వుల ప్రకారం ఐదుగురికి మించి ఒకచోట గుమిగూడరాదు. అనుమతి లేకుండా సమావేశాలు, ఊరేగింపులు, విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదు. ఘర్షణలకు దారితీసే చర్యలు, రెచ్చగొట్టే నినాదాలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటారు.

ట్రాఫిక్ మళ్లింపులు:

- రాజానగరం : ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపులు లేవు. కౌంటింగ్ కేంద్రం పరిసరాల్లో పోలీసుల సూచనలు పాటించాలి.

- కోవ్వూరు: వేములూరు గ్రామంలోని దీప్తి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కౌంటింగ్ కేంద్రం వద్ద నవంబర్ 7వ తేదీ ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. కోవ్వూరు నుంచి పసివేదల, వేములూరు, తొగుమ్మి వెళ్లే వాహనాలు ఔరంగాబాద్ మీదుగా వెళ్లాలి.

- నిడదవోలు: నవంబర్ 7వ తేదీ ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎస్.వి.డి. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో, కౌంటింగ్ కేంద్రానికి వెళ్లే అన్ని మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. కళాశాలకు వెళ్లే రహదారుల్లో సాధారణ ప్రజలకు, వాహనాలకు అనుమతి ఉండదు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది, పోటీ చేసిన అభ్యర్థులు, వారి కౌంటింగ్ ఏజెంట్లకు మాత్రమే నిబంధనల ప్రకారం అనుమతి ఉంటుంది. నిడదవోలు పట్టణ, పరిసర గ్రామాల ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకుని పోలీసులకు సహకరించాలి.

పార్కింగ్‌పై సూచనలు:

రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్లు, మీడియా ప్రతినిధులు తమ వాహనాలను పోలీసు శాఖ కేటాయించిన పార్కింగ్ ప్రదేశాల్లో మాత్రమే నిలిపి, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసులకు సహకరించాలి.

మీడియా ప్రతినిధులకు సూచనలు:

కౌంటింగ్ కేంద్రంలోకి ప్రవేశించేందుకు సంబంధిత ఎన్నికల అధికారి జారీ చేసిన అధికారిక అనుమతి పత్రం తప్పనిసరి. అనుమతించిన ప్రాంతాల్లో మాత్రమే ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ చేయాలి.

సోషల్ మీడియాపై నిఘా:

ఎన్నికల ఫలితాలకు సంబంధించి అసత్య, రెచ్చగొట్టే, విద్వేషపూరిత పోస్టులు, వీడియోలు ప్రచారం చేయడం లేదా షేర్ చేయడం చేయరాదు. ఇటువంటి చర్యలకు పాల్పడే వ్యక్తులతో పాటు సంబంధిత బాధ్యత కలిగిన అడ్మిన్లపైనా చట్టప్రకారం చర్యలు తీసుకుంటారు.

కౌంటింగ్ అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు:

ఓట్ల లెక్కింపు అనంతరం ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, బహిరంగ వేడుకలకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ గారు స్పష్టం చేశారు. బాణసంచా కాల్చడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, ఘర్షణలకు పాల్పడటం వంటి చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.

ప్రజలకు విజ్ఞప్తి:

ZPTC/MPTC ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా, పారదర్శకంగా పూర్తయ్యేలా ప్రజలు, అభ్యర్థులు, రాజకీయ నాయకులు, కౌంటింగ్ ఏజెంట్లు, మీడియా ప్రతినిధులు పోలీసు శాఖకు పూర్తిస్థాయిలో సహకరించాలని జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ నిబంధనలు, పోలీసు సూచనలు పాటిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

తూర్పుగోదావరి జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు - క్షేత్రస్థాయిలో పర్యటించిన జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్ ఐపీ...
05/11/2026

తూర్పుగోదావరి జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు - క్షేత్రస్థాయిలో పర్యటించిన జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్ ఐపీఎస్

జిల్లా వ్యాప్తంగా 21 మండలాల్లో జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్ ఐపీఎస్ గారు ఈరోజు క్షేత్రస్థాయిలో స్వయంగా సందర్శించి పరిశీలించారు. ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా, అత్యంత ప్రశాంత వాతావరణంలో జరిగేలా పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికల బందోబస్తుపర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన TRACK (ట్రాక్) అప్లికేషన్ పనితీరును సమీక్షిస్తూ,విధుల్లో ఉన్న పోలీసు వాహనాల కదలికలు, వాటి లైవ్ లొకేషన్లు, కంట్రోల్ రూమ్ సమాచార వ్యవస్థ, అత్యవసర పరిస్థితుల్లో క్షేత్రస్థాయి బలగాల స్పందనను పర్యవేక్షించారు. సమస్యాత్మక ప్రాంతాల నుంచి అందే సమాచారాన్ని విశ్లేషిస్తూ, అవసరమైన చోట అదనపు బలగాలను తక్షణమే మోహరించేలా ఆదేశాలు జారీ చేశారు.

సమస్యాత్మక మరియు అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించిన ఎస్పీ గారు, ఆయా ప్రాంతాల్లో నిరంతరం డ్రోన్ల సాయంతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు వీలుగా ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించి, కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి లైవ్ ఫీడ్ ఆధారంగా పరిస్థితిని ఎస్పీ గారు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత పవిత్రమైనదని, ప్రజలందరూ ఎలాంటి భయందోళనలకు గురికాకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, ప్రశాంతంగా వినియోగించుకోవాలని ఎస్పీ గారు పిలుపునిచ్చారు.

ఎన్నికల నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్నా, లేదా అత్యవసర పరిస్థితులు తలెత్తినా ప్రజలు వెంటనే స్పందించి డయల్ 112 కు గానీ, పోలీసు కంట్రోల్ రూమ్‌ (9154880083) కు గానీ సమాచారం అందించాలని ఆయన
సూచించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని
హెచ్చరించారు.

Address

Police Quarters, Lalacheruvu
Rajamahendravaram
533106

Telephone

100

Alerts

Be the first to know and let us send you an email when East Godavari District Police posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to East Godavari District Police:

Shortcuts

Share

Nearby government services