Ramagundam Police Commissionerate

Directions Website

Ramagundam Police Commissionerate To maintain public relation which in turn helping a lot in taking proper action against criminal activities in my region and also in taking up many cases.
(1)

బండరాయితో మహిళను హత్య చేసిన నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష మరియు రూ.1,000 జరిమానామంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో జర...
09/10/2026

బండరాయితో మహిళను హత్య చేసిన నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష మరియు రూ.1,000 జరిమానా
మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మహిళ హత్య కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడు మిట్టపల్లి వీరస్వామికి మంచిర్యాల గౌరవ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి శ్రీ ఏ.వీరయ్య యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.1,000/- జరిమానా విధించారు.
తేదీ 08-12-2024న సంపతి పద్మ,భర్త డేవిడ్, వయస్సు 44 సంవత్సరాలు, సంఘం బస్తీ, కాగజ్‌నగర్ నివాసి, మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.తన అక్క తీగల భాగ్యను నిందితుడు మిట్టపల్లి వీరస్వామి బండరాయితో తలపై కొట్టి హత్య చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.తీగల భాగ్యకు పిల్లలు లేకపోవడంతో కొంతకాలంగా మంచిర్యాలలోని ఎమ్మార్వో కార్యాలయం సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనంలో నివసిస్తూ, వీరస్వామితో కలిసి ప్లాస్టిక్ కవర్లు,ఇనుప సామగ్రి ఏరుకొని జీవనం సాగించేవారు. వీరస్వామి తరచూ మద్యం సేవించి భాగ్యతో గొడవపడుతూ, ఆమెను చంపుతానని బెదిరించేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
08-12-2024న మధ్యాహ్నం సుమారు ఒంటి గంట సమయంలో డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.ఈ క్రమంలో వీరస్వామి భాగ్యను హత్య చేయాలనే ఉద్దేశంతో పెద్ద బండరాయితో ఆమె తలపై కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. అక్కడ ఉన్నవారు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ,అదే బండరాయితో మరోసారి తలపై కొట్టడంతో తీవ్ర గాయాలై భాగ్య అక్కడికక్కడే మృతి చెందింది.
ఈ ఘటనపై మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అనంతరం, మంచిర్యాల ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్.ప్రమోద్ రావు దర్యాప్తు పూర్తి చేసి నిందితుడిపై కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు.కేసు విచారణ సందర్భంగా గౌరవ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి శ్రీ ఏ.వీరయ్య ఇరుపక్షాల వాదనలు విని,నిందితుడు మిట్టపల్లి వీరస్వామి నేరానికి పాల్పడినట్లు రుజువు కావడంతో యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.1,000/- జరిమానా విధించారు.
ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీమతి సత్య శ్రీలత సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టి, సమర్థవంతమైన వాదనలు వినిపించి నేరాన్ని రుజువు చేయడంలో కీలకపాత్ర పోషించారు.
మంచిర్యాల డీసీపీ శ్రీ ఏ.భాస్కర్,ఐపీఎస్, మంచిర్యాల ఏసీపీ శ్రీ ఆర్.ప్రకాష్ పర్యవేక్షణలో కేసు దర్యాప్తు,సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టడం తదితర ప్రక్రియల్లో సహకరించిన మంచిర్యాల ఇన్స్పెక్టర్ ఎస్. ప్రమోద్ రావు,కోర్టు హెడ్ కానిస్టేబుల్ ఎస్.రాజన్న (HC-2356), లైజన్ అధికారులు చి. వెంకటేశ్వర్లు (HC-2053), గోవిందరావు (HC-273)లను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా,ఐపీఎస్ (డీఐజీ), అభినందించారు.
కేసులో సమర్థవంతంగా విధులు నిర్వహించి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన సిబ్బందిని కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు.

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కార్యాలయాల్లో మహిళలకు సురక్షితమైన, గౌరవప్రదమైన పని వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యంగా...
08/10/2026

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కార్యాలయాల్లో మహిళలకు సురక్షితమైన, గౌరవప్రదమైన పని వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యంగా అంతర్గత ఫిర్యాదుల కమిటీ (Internal Complaints Committee–ICC) పనితీరు, విధులు, బాధ్యతలు, ఫిర్యాదుల పరిష్కార విధానాలపై గురువారం కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, కార్యాలయాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ, నిషేధం,ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించిన లైంగిక వేధింపుల నిరోధక చట్టం–2013 (POSH Act) నిబంధనలను రామగుండం కమిషనరేట్‌లో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. మహిళలు ఎలాంటి భయం,ఒత్తిడి లేకుండా తమ సమస్యలను కమిటీ దృష్టికి తీసుకువచ్చేలా విశ్వసనీయమైన వాతావరణాన్ని కల్పించాలని తెలిపారు.
అంతర్గత ఫిర్యాదుల కమిటీ అధ్యక్షురాలు, సభ్యులు తమ విధులు, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సీపీ సూచించారు. ఫిర్యాదులను స్వీకరించడం, నమోదు చేయడం, నిబంధనల ప్రకారం విచారణ నిర్వహించడం, నిర్ణీత గడువులో విచారణ నివేదికను సమర్పించడం వంటి అంశాల్లో నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.
ఫిర్యాదుదారు, ప్రతివాది,సాక్షుల వివరాల గోప్యతను తప్పనిసరిగా కాపాడాలని, విచారణ ప్రక్రియలో పారదర్శకతతో పాటు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. కమిటీకి సంబంధించిన రికార్డులు, పత్రాలను సక్రమంగా నిర్వహించాలని, కార్యాలయాల్లో కమిటీ వివరాలు మరియు ఫిర్యాదు చేసే విధానాన్ని నోటీసు బోర్డులపై స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించారు.
పోలీస్ సిబ్బంది, ఉద్యోగులకు POSH చట్టంపై నిరంతరం అవగాహన,చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మహిళల గౌరవం, భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, కార్యాలయాల్లో ఎలాంటి లైంగిక వేధింపులకు తావులేని వాతావరణాన్ని కల్పించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సీపీ పేర్కొన్నారు.

కమిటీ ప్రధానంగా పరిశీలించిన అంశాలు

- అధ్యక్షురాలు, కమిటీ సభ్యుల విధులు, బాధ్యతలు.
- ఫిర్యాదుల స్వీకరణ, నమోదు, విచారణ విధానం.
- నిర్ణీత గడువులో విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించడం.
- ఫిర్యాదుదారు, ప్రతివాది,సాక్షుల వివరాల గోప్యతను కాపాడటం.
- ఉద్యోగులకు POSH చట్టంపై అవగాహన, చైతన్య కార్యక్రమాల నిర్వహణ.
- ICC విచారణలకు సంబంధించిన రికార్డులు,పత్రాల నిర్వహణ.
- నోటీసు బోర్డులపై ICC వివరాలు, ఫిర్యాదు చేసే విధానం ప్రదర్శించడం.
- కమిషనరేట్‌లో POSH చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు తీసుకోవాల్సిన తదుపరి చర్యలు.
ఈ సమావేశంలో అదనపు డీసీపీ (అడ్మిన్) కె.శ్రీనివాస్,సీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్ అనిల్, సీహెచ్.సంధ్య,బి. సూపరింటెండెంట్, సీపీఓ రామగుండం, బి.సత్యనారాయణ, ఇన్‌స్పెక్టర్,మహిళా పోలీస్ స్టేషన్, శ్రీరాంపూర్,శ్రీమతి వి.హైమ,ఎస్‌ఐ,షీ టీమ్,మంచిర్యాల, శ్రీమతి ఎన్. ఒబులమ్మ,ఎస్‌ఐ, పీసీఆర్, రామగుండం,శ్రీమతి పి.సరిత,ఆర్‌ఎస్‌ఐ, సీఏఆర్, రామగుండం,శ్రీమతి కె.నవ్యకృష్ణ, న్యాయ సలహాదారు,భరోసా కేంద్రం,పెద్దపల్లి, శ్రీమతి ఎ.శ్రీలత, సెంటర్ అడ్మినిస్ట్రేటర్,సఖి కేంద్రం,మంచిర్యాల తదితరులు పాల్గొన్నారు.

మహిళలు,బాలికల భద్రతలో షీ టీమ్స్ కీలక పాత్ర పోషించాలి ,ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలి,12 నుంచి 18 ఏళ్ల బాలికలకు ప్రత్యే...
08/10/2026

మహిళలు,బాలికల భద్రతలో షీ టీమ్స్ కీలక పాత్ర పోషించాలి ,ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలి,12 నుంచి 18 ఏళ్ల బాలికలకు ప్రత్యేక అవగాహన కల్పించాలి.
రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా అధ్యక్షతన గురువారం కమిషనరేట్ కార్యాలయంలో షీ టీమ్స్, మహిళలు, పిల్లల రక్షణ,భరోసా కేంద్రాల సేవలపై సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, మహిళలు, బాలికలకు భద్రతపై భరోసా కల్పించడంతో పాటు పోలీసులపై నమ్మకాన్ని పెంపొందించడంలో షీ టీమ్స్ కీలక పాత్ర పోషించాలని సూచించారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉంటూ, మహిళలను వేధించే ఆకతాయిలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. అందిన ఫిర్యాదులపై ఆధారాలను సేకరించి, అవసరమైన కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
ముఖ్యంగా 12 నుంచి 18 ఏళ్ల బాలికలకు వేధింపులు,సైబర్ నేరాలు,సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, మంచి స్పర్శ–చెడు స్పర్శ వంటి అంశాలపై పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
బాధిత మహిళలు, చిన్నారులకు తక్షణ సహాయం అందించడంతో పాటు కౌన్సెలింగ్, వైద్య, న్యాయ, పునరావాస, సంక్షేమ సేవలు అందేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ సూచించారు. బాధితుల పట్ల సానుభూతి, మానవతా దృక్పథంతో వ్యవహరిస్తూ వారికి ధైర్యం,భరోసా కల్పించాలన్నారు.
బాధితుల ఫిర్యాదులపై కేసుల నమోదు విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదని, ఫిర్యాదులో నేరం ఉన్నట్లు తేలితే ముందుగా కేసు నమోదు చేసి అనంతరం దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. బాధితుల పట్ల అలసత్వం ప్రదర్శించే అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేసుల దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు, బాధితులకు నాణ్యమైన కౌన్సెలింగ్, రక్షణ, పునరావాస సేవలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
షీ టీమ్స్ సిబ్బంది నిజాయితీ, పారదర్శకత, నిష్పక్షపాతంగా వృత్తిపరమైన విధులు నిర్వహిస్తూ బాధితుల గోప్యతను కాపాడాలని కమిషనర్ సూచించారు. మహిళలు, బాలికలు ఎలాంటి వేధింపులకు గురైనా భయపడకుండా పోలీసులను ఆశ్రయించేలా అవగాహన కల్పించాలని, వారి భద్రతకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించాలని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో అదనపు డీసీపీ (అడ్మిన్) కె.శ్రీనివాస్, సీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్ అనిల్,మంచిర్యాల మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ,షీ టీమ్ ఎస్‌ఐలు హైమా,ఉషారాణి, లావణ్య,షీ టీమ్ సిబ్బంది,భరోసా కేంద్రం సభ్యులు పాల్గొన్నారు.

ఇంటి ఆవరణలో గంజాయి సాగు.. పోలీసుల దాడిలో మూడు మొక్కలు స్వాధీనం.. నిందితుడిపై కేసు నమోదురామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిష...
07/10/2026

ఇంటి ఆవరణలో గంజాయి సాగు.. పోలీసుల దాడిలో మూడు మొక్కలు స్వాధీనం.. నిందితుడిపై కేసు నమోదు
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్ ఆదేశాల మేరకు, టాస్క్‌ఫోర్స్/నార్కోటిక్స్ ఏసీపీ శ్రీనివాస్ రావు, చెన్నూర్ రూరల్ సీఐ కృష్ణ పర్యవేక్షణలో కోటపల్లి ఎస్‌ఐ శివనీతి రాజశేఖర్, టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ జె.లక్ష్మణరావు పోలీసు సిబ్బందితో కలిసి నమ్మదగిన సమాచారం మేరకు ఎదుళ్లబందం గ్రామానికి చెందిన దుర్గం మహేష్ (33), తండ్రి చంద్రయ్య ఇంటి ఆవరణలో తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలను సాగు చేస్తున్న మహేష్‌ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ సాగు చేస్తున్న మూడు గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న మొక్కలను వ్యవసాయ శాఖ ఏఈఓ పరిశీలించి అవి గంజాయి మొక్కలేనని నిర్ధారించారు. వీటిలో రెండు మొక్కలు 12 అంగుళాలు,మరో మొక్క 14 అంగుళాల ఎత్తు ఉన్నట్లు ఎస్‌ఐ తెలిపారు.స్వాధీనం చేసుకున్న మూడు మొక్కల విలువ సుమారు రూ.4,600 ఉంటుందని అంచనా వేశారు.
గంజాయి సాగు, విక్రయాలు,రవాణా, వినియోగానికి పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా అనుమానాస్పద కార్యకలాపాలపై ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్‌ఐ రాజశేఖర్ సూచించారు.

రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు మంచిర్యాల డీసీపీ కార్యాలయంలో డీసీపీ ఎ.భాస్కర్ ఆధ్వర్యంలో మంచిర్యాల,...
07/10/2026

రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు మంచిర్యాల డీసీపీ కార్యాలయంలో డీసీపీ ఎ.భాస్కర్ ఆధ్వర్యంలో మంచిర్యాల, శ్రీరాంపూర్ మున్సిపల్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణ,బ్లాక్ స్పాట్ల గుర్తింపు,ట్రాఫిక్ నిర్వహణకు సంబంధించి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా బ్లాక్ స్పాట్లు,ప్రమాదకర మలుపులు, కూడళ్లు,రద్దీ ప్రాంతాలు,తరచూ ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి, ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని డీసీపీ సూచించారు. ప్రమాదకర ప్రాంతాల్లో సంబంధిత శాఖల సమన్వయంతో రంబుల్ స్టిక్స్, హెచ్చరిక సైన్ బోర్డులు,ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు.
బై-లేన్ రోడ్లు ప్రధాన రహదారిలో కలిసే ప్రాంతాల్లో వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు అవసరమైన సైనేజీలు,స్పీడ్ కంట్రోల్ ఏర్పాట్లు, బారికేడ్లు తదితర భద్రతా చర్యలు చేపట్టాలని ఆర్‌అండ్‌బీ, మున్సిపల్,జాతీయ రహదారుల శాఖల అధికారులకు సూచించారు. ప్రమాదాలకు కారణమవుతున్న ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అవసరమైన మౌలిక సదుపాయాలు, హెచ్చరిక బోర్డులు, వేగ నియంత్రణ చర్యలు ఏర్పాటు చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
మంచిర్యాల పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు, వాహనాల రద్దీ, ట్రాఫిక్ నిబంధనల అమలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు.ట్రాఫిక్ నియంత్రణ కేవలం ట్రాఫిక్ పోలీసుల బాధ్యత మాత్రమే కాదని,లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో చురుకుగా భాగస్వాములు కావాలని డీసీపీ సూచించారు.
బ్లాక్ స్పాట్ల క్షేత్రస్థాయి పరిశీలన
సమావేశం అనంతరం అధికారులు మంచిర్యాల, శ్రీరాంపూర్ పరిధిలోని బ్లాక్ స్పాట్లను క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో ప్రమాదాలకు దారితీస్తున్న కారణాలను గుర్తించి,తక్షణం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.
ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా వివిధ శాఖల సమన్వయంతో రోడ్డు ప్రమాదాల నివారణకు మరింత సమర్థవంతమైన చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు.
ఈ సమావేశంలో మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాష్, శ్రీరాంపూర్ ఇన్‌స్పెక్టర్ అశోక్ కుమార్, మంచిర్యాల పట్టణ ఇన్‌స్పెక్టర్ ప్రమోదరావు, మంచిర్యాల రూరల్ సీఐ రవీందర్,ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ హన్నన్, ఆర్‌అండ్‌బీ శాఖ ఈఈ లక్ష్మీనారాయణ, డీఈ జగదీశ్, మంచిర్యాల మున్సిపాలిటీ డీఈ రాజేందర్,ఏఈ దుర్గం మధు, జాతీయ రహదారుల విభాగం సైట్ ఏఈ వినోద్ పాల్గొన్నారు.

సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా యువత సామాజిక మాధ్యమాలను జాగ్రత్తగా వినియోగించాలని రామగుండం ప...
07/10/2026

సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా యువత సామాజిక మాధ్యమాలను జాగ్రత్తగా వినియోగించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేయడం ద్వారా సైబర్ నేరగాళ్లు వాటిని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని హెచ్చరించారు.
భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 2026ను జాతీయ సైబర్ భద్రత అవగాహన మాసంగా నిర్వహిస్తున్న సందర్భంగా, తెలంగాణ సైబర్ భద్రతా విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సైబర్ భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. “PAUSE FOR SAFETY – Pause. Think. Verify.” అనే నినాదంతో ప్రజలకు సైబర్ భద్రతపై అవగాహన కల్పిస్తున్నారు.
ప్రతి నెల మొదటి బుధవారం నిర్వహించే సైబర్ జాగ్రూకత దివస్లో భాగంగా బుధవారం మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థినీ, విద్యార్థులకు సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, సామాజిక మాధ్యమాల వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్, మంచిర్యాల పట్టణ పోలీసులు, రామగుండం సైబర్ క్రైమ్ పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో యువత సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వినియోగిస్తున్నారని తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత సమాచారం, కుటుంబ వివరాలు, ఫొటోలు,ఆర్థిక వివరాలు వంటి సున్నితమైన సమాచారాన్ని బహిరంగంగా పంచుకోవద్దని సూచించారు.సైబర్ నేరగాళ్లు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వ్యక్తుల వివరాలను సేకరించి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు.
ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించడంతో పాటు, తల్లిదండ్రులకు కూడా సైబర్ భద్రతపై అవగాహన కల్పించాలని విద్యార్థులకు సూచించారు.రైతుల నమోదు, యూరియా యాప్ డౌన్‌లోడ్ తదితర పేర్లతో ఎవరైనా ఫోన్ చేసి ఒకసారి ఉపయోగించే సంకేత సంఖ్య (OTP), బ్యాంకు వివరాలు లేదా ఇతర వ్యక్తిగత సమాచారాన్ని అడిగితే అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.ఎట్టి పరిస్థితుల్లోనూ OTP, పిన్,పాస్‌వర్డ్, బ్యాంకు ఖాతా వివరాలను ఇతరులతో పంచుకోవద్దని సూచించారు.
అనుమానాస్పద ఫోన్ కాల్స్, సందేశాలు,లింకులు లేదా అనువర్తనాల విషయంలో తొందరపడి స్పందించకుండా “Pause. Think. Verify.” అనే విధానాన్ని పాటించాలని సూచించారు. తెలియని లింకులపై క్లిక్ చేయకుండా, అనుమానాస్పద అనువర్తనాలను డౌన్‌లోడ్ చేయకుండా జాగ్రత్త వహించాలన్నారు.
సైబర్ నేరగాళ్లు అమాయకులను లక్ష్యంగా చేసుకుని ఆర్థిక మోసాలకు పాల్పడటమే కాకుండా ఇతర విధాలుగా కూడా ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉందని తెలిపారు. సైబర్ మోసానికి గురైన వెంటనే లేదా అనుమానాస్పద లావాదేవీ జరిగినట్లు గుర్తించిన వెంటనే జాతీయ సైబర్ నేరాల సహాయవాణి 1930కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు.
సైబర్ నేరాలను అరికట్టడంలో పోలీసుల చర్యలతో పాటు ప్రజల అప్రమత్తత, సహకారం కూడా ఎంతో కీలకమని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. విద్యార్థులు తాము సైబర్ భద్రతా జాగ్రత్తలు పాటించడంతో పాటు,తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా సైబర్ భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు.
జాతీయ సైబర్ భద్రత అవగాహన మాసం కార్యక్రమాల్లో భాగంగా “PAUSE FOR SAFETY – Pause. Think. Verify.” అనే నినాదంతో రూపొందించిన సైబర్ భద్రత అవగాహన పోస్టర్‌ను పోలీసు అధికారులతో కలిసి పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాష్, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏసీపీ డి. వి రంగారెడ్డి, మంచిర్యాల పట్టణ ఇన్‌స్పెక్టర్ ప్రమోదరావు, రామగుండం సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్,సైబర్ క్రైమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్ ,బంగారు, వెండి ఆభరణాలు,నగదు స్వాధీనం,పలు దొంగతనం కేసుల్లో పురోగతి సాధించి...
06/10/2026

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్ ,బంగారు, వెండి ఆభరణాలు,నగదు స్వాధీనం,పలు దొంగతనం కేసుల్లో పురోగతి సాధించిన జైపూర్ పోలీసులు
ఇళ్లకు తాళాలు వేసి ఉన్న సమయంలో తాళాలు పగులగొట్టి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు జైపూర్ ఎస్‌ఐ భూమేష్ తెలిపారు.
నిందితుడి వివరాలు:
సబ్బాని లక్ష్మీనారాయణ @ చింటూ (27), కాంట్రాక్టర్ బస్తీ, బెల్లంపల్లి.
వివరాల్లోకి వెళితే..
నిందితుడు తన స్నేహితుడు మహ్మద్ మగ్దూంతో కలిసి సెప్టెంబర్ 28న ఇందారం గ్రామంలో రెండు ఇళ్ల తాళాలు పగులగొట్టి నగదు, బంగారు,వెండి ఆభరణాలను దొంగిలించినట్లు విచారణలో వెల్లడైంది. దొంగిలించిన నగదు, ఆభరణాలను ఇద్దరూ పంచుకున్నట్లు నిందితుడు తెలిపాడు.
అదేవిధంగా, బెల్లంపల్లి రైల్వే రాడగంబల బస్తీలో జనవరి 16న, గాంధీనగర్‌లో జూలై 9న,ఇందారం గ్రామంలో సెప్టెంబర్ 24న ఇళ్లకు తాళాలు పగులగొట్టి నగదు,వెండి వస్తువులు, ల్యాప్‌టాప్,సెల్‌ఫోన్ తదితర వస్తువులను దొంగిలించినట్లు విచారణలో వెల్లడించాడు.
నిందితుడి వద్ద నుంచి సుమారు 2 తులాల వెండి కాళ్ల పట్టీలు, రూ.3,000 నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులకు సంబంధించి నిందితుడి సహచరుడిని గతంలోనే పోలీసులు అరెస్ట్ చేసి,అతని వద్ద నుంచి దొంగిలించిన బంగారు,వెండి ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడిపై కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లే సమయంలో విలువైన వస్తువులు, నగదును ఇంట్లో ఉంచకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్‌ఐ సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు కనిపించినప్పుడు వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్‌ను నిర్మించుకోవాలి: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కళాశాలల్...
06/10/2026

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్‌ను నిర్మించుకోవాలి: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
కళాశాలల్లో ‘నషా ముక్త్ భారత్’ అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలి.
సింగరేణి ప్రాంతాల్లోనూ మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై విస్తృత అవగాహన కల్పించాలి.
డ్రగ్స్‌ ప్రభావానికి గురైన వారికి తక్షణమే డీ-అడిక్షన్ చికిత్స అందేలా చర్యలు.

యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్‌ను ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలకు యువత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆకర్షితులు కావొద్దని, మాదకద్రవ్యాల నిర్మూలనకు సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
మంగళవారం ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లి గ్రామంలోని మహేశ్వర ఫంక్షన్ హాల్‌లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మిషన్ పరివర్తన’ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాపై అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, డీసీపీ రామ్ రెడ్డితో కలిసి మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మాదకద్రవ్యాల నిర్మూలన కోసం పోలీస్ శాఖ చేపట్టిన ‘మిషన్ పరివర్తన’ కార్యక్రమాన్ని అభినందించారు. యువత భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై నిరంతరం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
కళాశాలల్లో ‘నషా ముక్త్ భారత్’ కార్యక్రమాలు
ఇంజినీరింగ్,డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించేలా ‘నషా ముక్త్ భారత్’ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. కేవలం సరదా లేదా థ్రిల్ కోసం కూడా మాదకద్రవ్యాలను ప్రయత్నించవద్దని యువతకు సూచించారు. డ్రగ్స్‌కు బానిసలైతే విద్య,కెరీర్‌తో పాటు భవిష్యత్ కూడా దెబ్బతింటుందని తెలిపారు.
సింగరేణి ప్రాంతాల్లోనూ మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీసులు,ప్రజలు సమష్టిగా కృషి చేస్తేనే మాదకద్రవ్యాల నిర్మూలన సాధ్యమవుతుందని అన్నారు.
డ్రగ్స్‌ ప్రభావితులకు తక్షణమే డీ-అడిక్షన్ చికిత్స
ఎవరైనా డ్రగ్స్ లేదా గంజాయి ప్రభావానికి గురైనట్లు గుర్తిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని మంత్రి కోరారు. సమాచారం అందిన వెంటనే అవసరమైన డీ-అడిక్షన్ చికిత్స అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.
మాదకద్రవ్యాల నిర్మూలనకు సమన్వయంతో చర్యలు

జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ‘మిషన్ పరివర్తన’ వంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించి యువతలో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు, యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండేలా నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
డీసీపీ రామ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మాదకద్రవ్యాల విక్రయాలు, గంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటోందన్నారు. యువత తమ విలువైన సమయాన్ని, భవిష్యత్‌ను డ్రగ్స్ కారణంగా నాశనం చేసుకోవద్దని సూచించారు. క్రీడలు,సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ తమ ప్రతిభను పెంపొందించుకోవాలని కోరారు.
డ్రగ్స్‌కు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల్లో యువత,ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని డీసీపీ పిలుపునిచ్చారు.
అనంతరం మంత్రి, జిల్లా కలెక్టర్,డీసీపీ, పోలీస్ అధికారులు, సిబ్బంది,యువత, ప్రజలు కలిసి మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు.డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని, ఇతరులను కూడా వాటికి దూరంగా ఉండేలా చైతన్యపరుస్తామని ప్రతిజ్ఞ చేశారు. మాదకద్రవ్యాల అక్రమ వినియోగం, విక్రయాలు, రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేస్తామని, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి రవీందర్,ఏసీపీ కృష్ణ,పోలీస్ అధికారులు, సిబ్బంది,యువత, మహిళా సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు సమగ్ర చర్యలు చేపట్టాలి, బ్లాక్ స్పాట్లు, ప్రమాదకర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలి: పెద్దపల...
05/10/2026

రోడ్డు ప్రమాదాల నివారణకు సమగ్ర చర్యలు చేపట్టాలి, బ్లాక్ స్పాట్లు, ప్రమాదకర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలి: పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు పెద్దపల్లి డీసీపీ బి.రామ్ రెడ్డి, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్ ఆధ్వర్యంలో గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్‌లో రోడ్డు ప్రమాదాల నివారణ,ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో రామగుండం సీఐ కృష్ణ కుమార్, గోదావరిఖని 1 టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి,గోదావరిఖని 2 టౌన్ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ రావు,రామగుండం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వర్ రావు,పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ గోదావరిఖని 1 టౌన్, గోదావరిఖని 2 టౌన్, రామగుండం సర్కిల్, పెద్దపల్లి పరిధిలోని బ్లాక్ స్పాట్లు, ప్రమాదకర మలుపులు, కూడళ్లు,రద్దీ ప్రాంతాలు, తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రమాదకర ప్రాంతాల్లో సంబంధిత శాఖల సమన్వయంతో రంబుల్ స్టిక్స్, హెచ్చరిక సైన్ బోర్డులు,ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రహదారులపై భారీ వాహనాల అక్రమ పార్కింగ్‌ను నియంత్రించాలని, రాంగ్‌సైడ్ డ్రైవింగ్‌పై నిఘా పెంచి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆటోలు,స్కూల్ వ్యాన్లు,బస్సుల్లో పరిమితికి మించి విద్యార్థులను తరలించకుండా ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని, మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, సిగ్నల్ జంపింగ్ తదితర ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలని, వాహనదారులకు ముందస్తు హెచ్చరికలు అందేలా తగిన సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ మరియు సంబంధిత శాఖలు సమన్వయంతో నిరంతరం చర్యలు చేపట్టి,ప్రజల ప్రాణాలను కాపాడటానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని డీసీపీ అధికారులను ఆదేశించారు.

పేకాటపై టాస్క్‌ఫోర్స్,నెన్నెల పోలీసుల దాడి.. ఏడుగురు అరెస్ట్ ,రూ.10,110 నగదు, 52 పేకముక్కలు,4 సెల్‌ఫోన్లు,3 ద్విచక్ర వాహ...
05/10/2026

పేకాటపై టాస్క్‌ఫోర్స్,నెన్నెల పోలీసుల దాడి.. ఏడుగురు అరెస్ట్ ,రూ.10,110 నగదు, 52 పేకముక్కలు,4 సెల్‌ఫోన్లు,3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
నిన్న అనగా 04-10-2026 రాత్రి, నెన్నెల మండలం అవడం గ్రామంలో డబ్బులు పందెంగా పెట్టి అక్రమంగా మూడు ముక్కలాట ఆడుతున్నట్లు నమ్మదగిన సమాచారం అందింది.
సమాచారం మేరకు నార్కోటిక్ టీమ్/టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్ నేతృత్వంలో ఎస్‌ఐ దీకొండ రమేష్, లచ్చన్న,సిబ్బంది, నెన్నెల పోలీసుల సహకారంతో అవడం గ్రామంలో దాడి నిర్వహించారు. ఈ దాడిలో డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుంచి 52 పేకముక్కలు, రూ.10,110 నగదు, 4 సెల్‌ఫోన్లు,3 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన ఏడుగురు వ్యక్తులతో పాటు స్వాధీనం చేసుకున్న నగదు, పేకముక్కలు, సెల్‌ఫోన్లు,ద్విచక్ర వాహనాలను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం నెన్నెల పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓకు అప్పగించారు.
అక్రమ పేకాట, జూదం వంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం ప్రజల దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు.

Address

RAMAGUNDAM
Ramagundam
505209

Alerts

Be the first to know and let us send you an email when Ramagundam Police Commissionerate posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share