07/10/2026
జిల్లా పోలీసు కార్యాలయం
సంగారెడ్డి జిల్లా.
పత్రిక ప్రకటన, తేదీ: 07-10-2026
*• సైబర్ జాగృకత దివస్ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.*
*• డిజిటల్ చెల్లింపులు, ఆన్‌లైన్ షాపింగ్, డిజిటల్ అరెస్ట్, పెట్టుబడి మోసాలపై అవగాహన తప్పనిసరి.*
*• యం.ఎన్.ఆర్. యూనివర్సిటీ విద్యార్థులకు సైబర్ మోసాలపై అవగాహన కల్పించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్.*
*సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి:* అక్టోబర్ నెల మొదటి బుధవారం సైబర్ జాగృకత దివస్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని డిజిటల్ చెల్లింపులు, ఆన్‌లైన్ షాపింగ్, డిజిటల్ అరెస్ట్, పెట్టుబడి మోసాలపై యం.ఎన్.ఆర్. యూనివర్సిటీ–సంగారెడ్డి విద్యార్థులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సైబర్ నేరాలను అరికట్టేందుకు తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సి.వి. ఆనంద్, ఐపీఎస్, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) డైరెక్టర్ శిఖా గోయల్, ఐపీఎస్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సైబర్ జాగృకత దివస్ కార్యక్రమం ద్వారా సైబర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. ఆన్‌లైన్ మోసాలకు ఎవరూ అతీతులు కారని, ప్రజల అవసరాలు, అత్యాశ, భయాన్ని ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు వివిధ రకాల మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా డిజిటల్ చెల్లింపులు, ఆన్‌లైన్ షాపింగ్, డిజిటల్ అరెస్ట్, పెట్టుబడి మోసాలు, పార్ట్‌టైమ్ జాబ్ మోసాలు, లోన్ యాప్ మోసాలు, ఇంపర్సనేషన్ మోసాలు తదితర సైబర్ నేరాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.
*డిజిటల్ చెల్లింపుల్లో జాగ్రత్త:*
తెలియని వ్యక్తులు పంపే లింకులను క్లిక్ చేయవద్దని, OTP, PIN, CVV, పాస్‌వర్డ్‌లు, UPI PIN వంటి రహస్య సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని ఎస్పీ సూచించారు. బ్యాంకు అధికారులు, పోలీసుల పేరుతో ఫోన్ చేసే వ్యక్తులను నమ్మి వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ వివరాలను వెల్లడించవద్దని తెలిపారు. డిజిటల్ చెల్లింపులు చేసే సమయంలో నగదు సరైన వ్యక్తి లేదా ఖాతాకే వెళ్తుందో నిర్ధారించుకున్న తర్వాతే చెల్లింపు చేయాలని సూచించారు.
*ఆన్‌లైన్ షాపింగ్‌లో అప్రమత్తత* : ఆన్‌లైన్‌లో భారీ డిస్కౌంట్లు, ఆకర్షణీయమైన ఆఫర్ల పేరుతో నకిలీ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ఖాతాల ద్వారా మోసాలకు పాల్పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. గుర్తుతెలియని వెబ్‌సైట్లు లేదా వ్యక్తులకు ముందస్తుగా నగదు చెల్లించకుండా, విశ్వసనీయమైన ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లను మాత్రమే ఉపయోగించాలని తెలిపారు.
*పెట్టుబడి మోసాలపై అప్రమత్తంగా ఉండాలి:* తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయని చెప్పే ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్, ట్రేడింగ్, క్రిప్టో కరెన్సీ, షేర్ మార్కెట్ పేరుతో వచ్చే అనుమానాస్పద ఆఫర్లను నమ్మవద్దని సూచించారు. తొందరపెట్టి డబ్బులు పెట్టుబడి పెట్టించే వ్యక్తులు లేదా సంస్థల వివరాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని తెలిపారు.
డిజిటల్ అరెస్ట్ మోసాలపై జాగ్రత్త: పోలీసులు, సీబీఐ, కస్టమ్స్, ఇతర ప్రభుత్వ అధికారుల పేరుతో ఫోన్ చేసి కేసులు, అరెస్టు లేదా చట్టపరమైన చర్యల పేరుతో భయపెట్టి డబ్బులు డిమాండ్ చేస్తే నమ్మవద్దని ఎస్పీ సూచించారు. ప్రభుత్వ సంస్థలు ఫోన్ లేదా వీడియో కాల్ ద్వారా విచారణ పేరుతో డబ్బులు డిమాండ్ చేయవని తెలిపారు.
సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండటంతో పాటు, కుటుంబ సభ్యులు, విద్యార్థులు, స్నేహితులకు కూడా సైబర్ భద్రతపై అవగాహన కల్పించాలని ఎస్పీ సూచించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని, అలాగే www.cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు చేయడం ద్వారా మోసపోయిన నగదును నిలిపివేసే అవకాశం ఉంటుందని తెలిపారు.
PAUSE • THINK • VERIFY సైబర్ నేర రహిత తెలంగాణ వైపు అడుగులు.
ఈ అవగాహన కార్యక్రమంలో సైబర్ సెల్ డిఎస్పీ వేణుగోపాల్ రెడ్డి, కృష్ణ చలం – వైస్ ఛాన్సలర్, ఎం.ఎన్.ఆర్. యూనివర్సిటీ, రాజేశ్వరన్ – రిజిస్ట్రార్, ఎం.ఎన్.ఆర్. యూనివర్సిటీ, గిరి ప్రసాద్ – డిప్యూటీ డైరెక్టర్, ఎన్.ఆర్. క్యాంపస్ తదితరులు ఉన్నారు.