13/10/2026
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)ని రద్దు చేయండి!
భారత ఎన్నికల కమిషన్(ECI)ని పునర్ వ్యవస్థీకరించండి!
స్వతంత్ర భారతదేశంలో గాంధీ జయంతిని ప్రజలు నిరసన దినంగా ఇంత పెద్దఎత్తున జరుపుకోవడం ఇంతకుముందు ఎన్నడూ జరగలేదు. నిరాయుధులైన సామాన్య ప్రజల శాంతియుత సామూహిక నిరసనకు ఉన్న శక్తికి ప్రతీకగా నిలిచిన నాయకుడిగా గాంధీని ప్రపంచమంతా గుర్తిస్తుంది. గాంధీ 157వ జయంతి సందర్భంగా ఈ ఏడాది ఆ వారసత్వం దేశవ్యాప్తంగా నిజంగా ప్రాణం పోసుకుంది. ఢిల్లీలో జంతర్ మంతర్‌ను అబేద్యమైన కోటలా మార్చి, భారీగా భద్రతా బలగాలను మోహరించి భయపెట్టినా, వందలాది మంది విద్యార్థి కార్యకర్తలు, ఇతర పౌరులు వాటిని ధిక్కరించారు. పదే పదే క్రూరంగా అరెస్టయినా, పోలీసు బస్సుల నుంచి తప్పించుకుని మళ్లీ నిరసనల్లో చేరారు. ముంబైలో జనమంతా కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ దృశ్యాలు రాబోయే ఏళ్లపాటు మన జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి. ప్రజలు గాంధీ శాంతియుత పోరాట వారసత్వాన్ని ఎత్తిపట్టగా, ఈనాటి ప్రభుత్వం మాత్రం బలప్రయోగంతో పాలించే బ్రిటిష్ వలసపాలన పద్ధతిని మళ్లీ తెరపైకి తెచ్చింది.
జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని, SIR ని రద్దు చేయాలని, దుర్మార్గంగా తొలగించిన ప్రతి ఓటరు ఓటు హక్కును పునరుద్ధరించాలని కోరడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పౌరులందరికీ ఒక ఉమ్మడి నినాదంగా మారింది. అంతేకాదు, ప్రభుత్వానికి తనకు నచ్చిన ఎన్నికల సంఘాన్ని ఎంచుకునే స్వేచ్ఛనిచ్చి, ఎన్నికల కమిషనర్లకు జీవితకాల రక్షణ కల్పించి వారిని చట్టానికే అతీతులను చేసిన 2023 చట్టాన్ని కూడా రద్దు చేయాల్సిన అవసరం ఉంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించిన సంచలన పరిశోధనాత్మక కథనం, ఆ తర్వాత ఎన్నికల సంఘం చేపట్టిన 'నష్ట నివారణ' ప్రయత్నాలు ప్రజల్లో చాలాకాలంగా ఉన్న ఆగ్రహాన్ని మరింత బలపరిచాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, కేంద్ర ఎన్నికల కమిషన్ లోని ఇతర ఎన్నికల కమిషనర్లను పక్కన పెట్టేశారని, ఓటర్ల జాబితాను శుభ్రం చేస్తున్నామనే పేరుతో SIR ద్వారా అధికారాన్ని బాహాటంగా కేంద్రీకరించి, సాఫ్ట్‌వేర్ ద్వారా మార్పులు చేస్తున్నారని ఆ కథనం బయటపెట్టింది. ఇప్పుడు భారత ఎన్నికల కమిషన్ జారీ చేస్తున్న ప్రతి సర్క్యులర్ కూడ, రాజ్యాంగ విరుద్ధమైన SIR ప్రక్రియ ద్వారా భారత ఎన్నికల ప్రజాస్వామ్యం మీద, సార్వత్రిక వయోజన ఓటు హక్కు అనే మౌలిక సూత్రం మీద వ్యవస్థీకృతంగా భారీ మోసం జరిగిందనడానికి రుజువుగానే నిలుస్తోంది.
13 కోట్లకు పైగా ఓటర్లను ఓటు హక్కు నుంచి తొలగించారనే విషయం ఇప్పుడు దేశమంతా చర్చించుకుంటుండగా, 'మిగిలిపోయిన' ఓటర్లందరినీ నెల రోజుల్లో సంప్రదించాలని భారత ఎన్నికల కమిషన్ అన్ని రాష్ట్రాల CEO లను ఆదేశించింది! ఓటర్లు పెద్దఎత్తున తొలగిపోయిన వాస్తవం గురించి భారత ఎన్నికల కమిషన్ కు ఇప్పుడే ఎందుకు మెలకువ వచ్చింది? ECI ఆదేశాల్లోని 'మిగిలిపోయిన' (left-out) అనే మాట నిజానికి ఇష్టానుసారంగా, ఒక దుర్మార్గమైన లక్ష్యం పెట్టుకుని చేసిన తొలగింపులను కప్పిపుచ్చే మాటే. ఎన్నికల సమీకరణాన్ని BJP, దాని మిత్రపక్షాలకు అనుకూలంగా మార్చేందుకే ఇదంతా చేశారు. అక్టోబర్ 1న ఎన్నికల సంఘం ఈ తాజా సర్క్యులర్ ఇస్తున్న సమయంలోనే, పాట్నాలో CPI(ML) కార్యకర్తలు తొలగింపునకు గురైన ఓటర్లతో బహిరంగ విచారణ నిర్వహిస్తున్నారు. 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పోటీ చేసిన ఇరవై నియోజకవర్గాల్లోని పది నియోజకవర్గాలలో ఎంపిక చేసిన యాభై బూత్‌లలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు పార్టీ కార్యకర్తలు ఇంటింటి సర్వే చేశారు. ఇప్పుడు భారత ఎన్నికల కమిషన్ BLO లను చేయమని చెప్పిన పనినే వారు చేశారు. అంటే SIR తర్వాత ఓటర్ల జాబితాను, SIR కు ముందు 2025 జూన్ నాటి జాబితాతో పోల్చి, తొలగించిన ఓటర్లను గుర్తించారు. తప్పుగా తొలగించిన ఓట్లు 17 శాతం ఉన్నాయని ఈ సర్వేలో తేలి అందరినీ నివ్వెరపరిచింది.
ఓటర్ల జాబితాలో పేర్లను పెద్దఎత్తున తొలగించడానికి, కావాల్సిన వాళ్ల పేర్లను మాత్రమే ఎంపిక చేసి చేర్చడానికి BJP, ECI కలిసి ఫారం 6, ఫారం 7 లను ఆయుధాలుగా వాడుకున్నాయి. ఫారం 6 లో చేసిన మార్పులు భారత ఎన్నికల కమిషన్ లోని ఇద్దరు కమిషనర్ల అనుమతి లేకుండా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఇష్టారాజ్యంగా, చట్టవిరుద్ధంగా చేసినవని బయటపడ్డాయి. ఫారంలోని నిబంధనలను మార్చే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. దీంతో ఎన్నికల సంఘం ఎలాంటి వివరణా ఇవ్వకుండా ఆ వివాదాస్పద నిబంధనలను వెనక్కి తీసుకుంది. ఫారం 6 లో చేసిన మార్పులకు సుప్రీంకోర్టు ఆమోదం ఉందని ఎన్నికల సంఘం చెప్పుకునే ప్రయత్నాన్ని స్వయంగా CJI సూర్యకాంత్ ఖండించారు. జెన్ - జెడ్ ఓటర్లు ఓటర్ల జాబితాలో చేరకుండా అడ్డుకోవడానికే ఈ మార్పులు చేసినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. మొదటిసారి ఓటు వేసేవారు చట్టప్రకారం ఓటర్ల జాబితాలోకి ప్రవేశించడానికి ఉద్దేశించిన ఫారం 6 ను, తొలగించిన ఓటర్లు మళ్లీ జాబితాలో చేరాలంటే నింపాల్సిన ఫారంగా మార్చి ECI దుర్వినియోగం చేస్తోంది. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం. మొదటి రోజు నుంచే అభ్యంతరాలు వచ్చినా ఈ అక్రమ పద్ధతిని ECI కొనసాగిస్తూనే ఉంది.
అంతకన్నా దుర్మార్గం, అర్హులైన ఓటర్లను తొలగించడానికి ఫారం 7 ను అనూహ్యమైన స్థాయిలో దుర్వినియోగం చేయడం. ముఖ్యంగా ముస్లిం ఓటర్లను, BJP కి దాని మిత్రపక్షాలకు వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉన్న ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ముందే నింపిన ఫారం 7 కట్టలను స్వాధీనం చేసుకున్న ఘటనలు అనేకం బయటపడ్డాయి. ఫారం 7 ఆధారంగా వచ్చిన ఫిర్యాదుల మీద ఓటర్లను తొలగించిన ప్రతి సందర్భంలోనూ, సంబంధిత ఓటర్లకు సరైన నోటీసులు ఇవ్వాలి, సమాధానం చెప్పుకునే అవకాశమూ కల్పించాలి. కానీ భారీ స్థాయిలో తొలగింపునకు గురైన ఓటర్లకు ఎదురైన అనుభవం ఇది కాదు. ఈ విధంగా ఓటర్లను లక్ష్యంగా చేసుకుని వేధించిన అత్యంత దిగ్భ్రాంతికరమైన తీరు పశ్చిమ బెంగాల్‌లో కనిపించింది. అప్పిలేట్ ట్రైబ్యునల్ నెంబర్ 11 ఛైర్మన్ పదవికి ఇప్పుడు రాజీనామా చేసిన రిటైర్డ్ జస్టిస్ ఇంద్రజిత్ ఛటర్జీ ఒక విషయం వెల్లడించారు. న్యాయాధికారులు సైతం అర్హులని తేల్చిన ఓటర్లను తొలగించాలని కోరుతూ, పశ్చిమ బెంగాల్ అదనపు ముఖ్య ఎన్నికల అధికారి స్వయంగా 2.54 లక్షల ఫారం 7 అప్పీళ్లను తన ట్రైబ్యునల్ ముందు దాఖలు చేశారని ఆయన చెప్పారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పరిశోధనాత్మక కథనం ప్రకారం, పశ్చిమ బెంగాల్‌లోని 19 ట్రైబ్యునళ్ల ముందు ఉన్న 16,10,311 తొలగింపు అప్పీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయో, వాటికి అనుమతి ఎవరిచ్చారో తనకు గానీ, తోటి ఎన్నికల కమిషనర్ వివేక్ జోషికి గానీ, బెంగాల్ CEO కి గానీ ఏమాత్రం తెలియదని ఎన్నికల కమిషనర్ సుఖ్‌బీర్ సింగ్ సంధు ఫిర్యాదు చేశారు.
భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య సంస్థాగత నిర్మాణం, అధికారాల విభజన సిద్ధాంతం, పరస్పర నియంత్రణ వ్యవస్థ (checks and balances) వలసపాలన తర్వాతి భారతదేశంలో ప్రజాస్వామ్యం నిలబడటానికి కేంద్రబిందువులుగా ఉన్నాయి. ఇప్పుడు అవి తమ చరిత్రలోనే అత్యంత తీవ్రమైన పరీక్షను ఎదుర్కొంటున్నాయి. ఎన్నికల సంఘాన్ని అడ్డుకోగలిగిన, అడ్డుకోవాల్సిన సుప్రీంకోర్టు, ఈ భారీ ఎన్నికల మోసానికి పాల్పడేందుకు దానికి దాదాపు పూర్తి స్వేచ్ఛను ఇచ్చేసింది. 'ఒకే దేశం, ఒకే ఎన్నిక' బిల్లులను పరిశీలిస్తున్న ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ, సుప్రీంకోర్టు మధ్య అక్టోబర్ 6న ఒక సమావేశం జరపాలని ప్రతిపాదించారు. శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ మధ్య ఉండాల్సిన గీత చెరిగిపోయే ఆ దిగ్భ్రాంతికర పరిణామం ఇప్పుడు తప్పనిసరై వాయిదా పడింది. రాజ్యాంగ సంస్థల నుంచి ఏమాత్రం అండలేని ఈ పరిస్థితుల్లో, భారత ప్రజాస్వామ్య మనుగడ పూర్తిగా భారత ప్రజల పరిణతి మీద, వారి అప్రమత్తత మీద ఆధారపడి వుంది. అదే విధంగా BJP యేతర రాజకీయ శక్తులు, పౌర సమాజం, ప్రత్యామ్నాయ మీడియా మీద ఆధారపడి ఉంది. ఆలస్యంగా అయినా సెప్టెంబర్ 30 న జరిగిన ఇండియా కూటమి సమావేశం, వామపక్ష విద్యార్థి కార్యకర్తలు, ఇతర జెన్ Z నిరసనకారులు, ప్రగతిశీల పౌరులు, ప్రత్యామ్నాయ మీడియా కార్యకర్తలు, NDA యేతర ప్రతిపక్ష పార్టీలలో పెరుగుతున్న గళం, ఫాసిస్టు పట్టును బద్దలు కొట్టి ప్రజాస్వామ్యాన్ని దృఢంగా నిలబెడతామనే ఆశను చూపుతున్నాయి.