29/09/2026
*విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ..*
*ప్రజా సమస్యలను విస్మరిస్తున్న కూటమి ప్రభుత్వంపై నిరంతర పోరాటం*
*విశాఖ నగర భవిష్యత్తును కాపాడేందుకు ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలి*
*విశాఖపట్నం, సెప్టెంబర్ 28:* విశాఖపట్నం మహానగర పాలక సంస్థ (జీవీఎంసీ) ఎన్నికలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, నగరంలోని ప్రతి వార్డులోనూ గెలుపు అవకాశాలు ఉన్న బలమైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు పార్టీ సిద్ధంగా ఉందని పార్టీ నాయకులు తెలిపారు.
విశాఖపట్నం మద్దిలపాలెం కృష్ణా కాలేజ్ రోడ్డులోని జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు *శ్రీ కె.కె రాజు గారు* ఆధ్వర్యంలో సోమవారం జీవీఎంసీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహలు, వార్డుల వారీగా పార్టీ పరిస్థితి, బలమైన అభ్యర్థుల ఎంపిక, ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన ఉద్యమాలు తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
ఈ సమావేశంలో శాసన మండలి ప్రతిపక్ష నేత *శ్రీ బొత్స సత్యనారాయణ గారు*, పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ *శ్రీ కురసాల కన్నబాబు గారు,మాజీ మంత్రి వర్యులు పసుపులేటి బాలరాజు గారు*,మాజీ పార్లమెంట్ సభ్యురాలు *శ్రీమతి సత్యవతి గారు* ,*మాజీ ఎమ్మెల్యేలు శ్రీమతి శోభా హైమావతి గారు*,*శ్రీ కరణం ధర్మశ్రీ గారు,శ్రీ మళ్ల విజయప్రసాద్ గారు,శ్రీ తైనాల విజయకుమార్ గారు,శ్రీ కంబాల జోగులు గారు,శ్రీ అన్నంరెడ్డి అదీప్ రాజ్ గారు,శ్రీ చింతలపూడి వెంకటరామయ్య గారు,శ్రీ తిప్పల గురుమూర్తిరెడ్డి గారు*, సమన్వయకర్తలు *శ్రీ తిప్పల శ్రీనివాస్, దేవన్ రెడ్డి గారు,శ్రీ మొల్లి అప్పారావు గారు,శ్రీమతి బొత్స అనూష గారు*,నియోజకవర్గ పరిశీలకులు *చింతకాయల సన్యాసి పాత్రుడు గారు,శ్రీ సతిష్ వర్మ గారు,శ్రీ జహీర్ అహ్మద్ గారు,శ్రీమతి పెడాడ రమణికుమారి గారు* తదితరులు పాల్గొన్నారు.
పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు *గౌ" శ్రీ వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు* ఆదేశాల మేరకు విశాఖ నగరంలో పార్టీ శ్రేణులను అన్ని స్థాయిల్లో సమన్వయం చేసి ఎన్నికలకు సిద్ధం చేస్తున్నట్లు నాయకులు తెలిపారు. ప్రతి వార్డులోనూ ప్రజలతో నిరంతరం మమేకమై పనిచేసి, ప్రజలకు అందుబాటులో ఉండే, గెలుపు సామర్థ్యం కలిగిన అభ్యర్థులను గుర్తించి ఎన్నికల బరిలో నిలబెడతామని పేర్కొన్నారు.
*విశాఖ కార్పొరేషన్ పాలనపై తీవ్ర విమర్శలు..*
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో విశాఖపట్నం అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని నాయకులు గుర్తుచేశారు. సాధారణ కుటుంబానికి చెందిన మహిళకు విశాఖ మేయర్‌గా అవకాశం కల్పించడం ద్వారా సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చిన ఘనత వైఎస్ జగన్ గారి ప్రభుత్వానిదని తెలిపారు.
అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నం నగర అభివృద్ధి, జీవీఎంసీ పాలనపై తగినంత దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. అభివృద్ధి పనులు మందగించడం, కాంట్రాక్టర్లకు బకాయిలు ఉండటం, రహదారులపై గుంతలు, పారిశుధ్యం, ఇతర పౌర సేవల్లో లోపాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని అన్నారు.
ముఖ్యంగా మంచినీటి సమస్య తీవ్ర రూపం దాల్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. మూడు, నాలుగు రోజులకు ఒకసారి నీరు సరఫరా చేసే పరిస్థితి విశాఖ నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఏర్పడిందని విమర్శించారు. వర్షాలు, తుపాను కారణంగా తాత్కాలికంగా నీటి పరిస్థితి మెరుగుపడినప్పటికీ, భవిష్యత్తులో నగర ప్రజలకు తాగునీటి భద్రత కల్పించేందుకు ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు రావాలని డిమాండ్ చేశారు.
*ప్రభుత్వ భూములు, విలువైన ఆస్తులను కాపాడాలి..*
విశాఖపట్నంలోని విలువైన ప్రభుత్వ భూములు, ఆస్తుల విషయంలో ప్రభుత్వం పూర్తి పారదర్శకత పాటించాలని నాయకులు డిమాండ్ చేశారు. గీతం కాలేజీ పరిధిలోని 54 ఎకరాల భూమికి సంబంధించిన వివాదాన్ని ప్రస్తావిస్తూ, ప్రజా ఆస్తుల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని కోరారు.
మధురవాడతో పాటు విశాఖ నగరంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న విలువైన ప్రభుత్వ భూముల విషయంలో కూడా ప్రజలకు పూర్తి సమాచారం అందించాలని అన్నారు. ప్రభుత్వ ఆస్తులు వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగపడకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.
*పర్యావరణ పరిరక్షణపై రాజీ పడేది లేదు..*
విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పర్యావరణ విధ్వంసంపై సమావేశంలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. కొండలను తవ్వడం, అక్రమ మైనింగ్ వంటి కార్యకలాపాలను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉందన్నారు.
పంచదార్ల కొండ, బావికొండ, సింహాచలం కొండ వంటి ప్రాంతాలకు ఉన్న పర్యావరణ, చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కాపాడాలని కోరారు. పంచదార్ల కొండ అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గతంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసిందని, విశాఖ పర్యావరణ పరిరక్షణ కోసం భవిష్యత్తులోనూ పోరాటం కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు.
*ధరల పెరుగుదలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం..*
నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు అన్నారు. వంటనూనె, కందిపప్పు, పెసరపప్పు తదితర నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో మధ్యతరగతి, పేద కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతోందని పేర్కొన్నారు.
ఒకవైపు ధరల పెరుగుదల, మరోవైపు ప్రజా సమస్యలు తీవ్రతరం అవుతున్నప్పటికీ ప్రభుత్వం వాటిపై తగినంత దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
*వార్డు పునర్విభజనలో పారదర్శకత అవసరం..*
విశాఖపట్నం కార్పొరేషన్ వార్డుల పునర్విభజన విషయంలో అధికారులు పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఒక్కో డివిజన్‌లో ఓటర్ల సంఖ్యలో భారీ వ్యత్యాసాలు ఉండటం, రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వార్డు సరిహద్దులు నిర్ణయించారనే అనుమానాలకు తావిస్తోందని నాయకులు పేర్కొన్నారు. ప్రజల ప్రాతినిధ్యం, భౌగోళిక అనుసంధానం, సామాజిక సమగ్రత, పరిపాలనా సౌలభ్యం, జనాభా సమతుల్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వార్డు పునర్విభజన జరగాలని కోరారు. ఈ అంశంపై ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని, అవసరమైతే ప్రజల హక్కుల పరిరక్షణ కోసం న్యాయపరమైన పోరాటానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
*ఎన్నికల ప్రక్రియలో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి..*
రాబోయే ఎన్నికల ప్రక్రియలో అధికారులు, పోలీసు అధికారులు పూర్తిగా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సూచించారు. అధికార పార్టీకి అనుకూలంగా జరిగే అక్రమాలకు అధికారులు సహకరించకూడదని అన్నారు. ప్రభుత్వం మారుతూ ఉంటుందని, అయితే అధికారుల నిర్ణయాలు, చర్యలు అధికారిక రికార్డుల్లో శాశ్వతంగా ఉంటాయని గుర్తుంచుకోవాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా రాజ్యాంగబద్ధంగా, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని కోరారు.
*విశాఖ భవిష్యత్తు కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం..*
విశాఖపట్నం కేవలం భూములు, ఆస్తులు, వ్యాపార ప్రయోజనాల కేంద్రంగా కాకుండా ప్రజల నగరంగా, పర్యావరణాన్ని కాపాడుకునే నగరంగా, మెరుగైన పౌర సేవలు అందించే నగరంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని నాయకులు అన్నారు. ప్రజల సమస్యలపై ప్రతిపక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. మంచినీటి సమస్య, రహదారులు, పారిశుధ్యం, పౌర సేవలు, పర్యావరణ పరిరక్షణ, ప్రభుత్వ ఆస్తుల రక్షణ వంటి అంశాలపై భవిష్యత్తులో మరింత బలమైన ప్రజా ఉద్యమాలు చేపడతామని తెలిపారు.
జీవీఎంసీ ఎన్నికల్లో ప్రజలకు అందుబాటులో ఉండే, ప్రజల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించేందుకు కృషి చేసే బలమైన అభ్యర్థులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దింపుతామని నాయకులు తెలిపారు.
విశాఖ నగర భవిష్యత్తును కాపాడేందుకు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా నిలవాలని వారు విజ్ఞప్తి చేశారు.