Srikakulam District Police

Call Directions Website Contact the organization

Srikakulam District Police Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Srikakulam District Police, Government Organization, Srikakulam.

శ్రీకాకుళం జిల్లా పోలీసు.రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామ సభలు, పల్లె నిద్ర కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఎన్న...
10/11/2026

శ్రీకాకుళం జిల్లా పోలీసు.

రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామ సభలు, పల్లె నిద్ర కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఎన్నికలపై విస్తృత అవగాహన కల్పిస్తున్న జిల్లా పోలీసులు.

గ్రామాల్లో గ్రామస్తులతో మమేకమవుతూ, ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఓటు హక్కు వినియోగం, ఎన్నికల సమయంలో పాటించాల్సిన నిబంధనలు, శాంతిభద్రతల పరిరక్షణ తదితర అంశాలపై జిల్లా పోలీసు అధికారులు ప్రజలకు సమగ్ర అవగాహన కల్పిస్తున్నారు.

ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేలా పోలీసులకు సహకరించాలని, ఎలాంటి ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగకుండా, ఎటువంటి తగాదాలు లేకుండా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు.
Andhra Pradesh Police Dgp Andhra Pradesh Srikakulam District Police

శ్రీకాకుళం జిల్లా పోలీసుదీపావళి పండుగను ఆనందోత్సాహాలతో.. అప్రమత్తతతో జరుపుకోవలి.జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మహేశ్వర రెడ్డి,...
07/11/2026

శ్రీకాకుళం జిల్లా పోలీసు

దీపావళి పండుగను ఆనందోత్సాహాలతో.. అప్రమత్తతతో జరుపుకోవలి.

జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస్.

శ్రీకాకుళం నవంబర్ 07. దీపావళి పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో, సురక్షిత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస్ గారు జిల్లా ప్రజలకు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రమాదాలకు తావులేకుండా, పండుగను సంప్రదాయబద్ధంగా సంతోషంగా,కాలుష్య రహితంగా జరుపుకోవాలని
ముఖ్యంగా చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని శనివారం విడుదల చేసిన ప్రకటనలో జిల్లా ఎస్పీ కోరారు.పండుగ వేళ చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీయవచ్చు. కావున ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, తమ కుటుంబ సభ్యులతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో అగ్ని మాపక విభాగం 101, డయల్ 112, 6309990933 పోలీసు కంట్రోల్ రూమ్ సమాచారం అందించాలని కోరారు.

Andhra Pradesh Police Dgp Andhra Pradesh Srikakulam District Police

శ్రీకాకుళం జిల్లా పోలీసు.కౌంటింగ్ కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ.ఎంపీటీసీ, జెడ్పీటీసీ ...
07/11/2026

శ్రీకాకుళం జిల్లా పోలీసు.

కౌంటింగ్ కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస్.

శ్రీకాకుళం నవంబర్ 07. శనివారం చిలకపాలెంలోని శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాల, టెక్కలిలోని ఐతమ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాలను జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస్ గారు సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయా కౌంటింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియను, పోలీసు భద్రతా ఏర్పాట్లను, కేంద్రాల వద్ద చేపట్టిన నియంత్రణ చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, ప్రతి కదలికను నిశితంగా గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులకు సూచించారు. అదేవిధంగా పలాస కాశీబుగ్గ పట్టణంలో జరుగుతున్న ప్రాదేశిక ఎన్నికల కౌంటింగ్ లెక్కింపు ప్రక్రియను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ..కౌంటింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమతి ఉన్న వ్యక్తులను మాత్రమే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించాలని ఆదేశించారు. ఎన్నికల నిబంధనల మేరకు ఎక్కడ కూడా ప్రజలు గుమ్ముకూడదని స్పష్టం చేశారు.కౌంటింగ్ కేంద్రాల వద్ద ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, ప్రజల రాకపోకల క్రమబద్ధీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని, డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు నిరంతర పోలీసు నిఘా కొనసాగించాలని స్పష్టం చేశారు.

ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు.

మూడంచెల పటిష్ట భద్రతతో ఎన్నికల లెక్కింపు ప్రక్రియ సజావుగా ప్రశాంతంగా జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు.
Dgp Andhra Pradesh Srikakulam District Police Andhra Pradesh Police

శ్రీకాకుళం జిల్లా పోలీసు.ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ.కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్ట పోలీసు భద్రత –...
07/11/2026

శ్రీకాకుళం జిల్లా పోలీసు.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ.

కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్ట పోలీసు భద్రత – డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా.

జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర రెడ్డి ఐపీఎస్.

✳️ కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట పోలీసు భద్రతా ఏర్పాట్లు చేపట్టిన జిల్లా పోలీసు యంత్రాంగం.

✳️ డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా కౌంటింగ్ కేంద్రాలు, పరిసర ప్రాంతాలపై నిరంతర నిఘా ఏర్పాటు.

✳️ అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం, నిర్దేశిత ప్రవేశ మార్గాల ద్వారా నిబంధనల ప్రకారం కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతి.

✳️ కౌంటింగ్ కేంద్రాల వద్ద అనధికార వ్యక్తులు ప్రవేశించకుండా కట్టుదిట్టమైన తనిఖీలు, పర్యవేక్షణ.
Andhra Pradesh Police Dgp Andhra Pradesh Srikakulam District Police

శ్రీకాకుళం జిల్లా పోలీసుMPTC/ZPTC – 2026 ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు చర్యలు.కౌంటింగ్ కేంద్రం పరిసరాల్లో...
07/11/2026

శ్రీకాకుళం జిల్లా పోలీసు

MPTC/ZPTC – 2026 ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు చర్యలు.

కౌంటింగ్ కేంద్రం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.

వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలి: శ్రీకాకుళం సబ్ డివిజన్ పోలీసు అధికారి సి.హెచ్. ధనుంజయ నాయుడు.

ఎచ్చెర్లలోని శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించనున్న MPTC/ZPTC ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు, కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు పోలీసు శాఖ ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా సబ్ డివిజన్ పోలీసు అధికారి సి.హెచ్. ధనుంజయ నాయుడు ప్రజలకు పలు సూచనలు చేశారు.

ట్రాఫిక్ మళ్లింపు మరియు ప్రవేశ మార్గాలకు సంబంధించిన సూచనలు:

1. కౌంటింగ్ కేంద్రం చుట్టూ రెండు కిలోమీటర్ల పరిధిని రెడ్ జోన్‌గా ప్రకటించాం. నవంబర్ 7వ తేదీ ఉదయం 4 గంటల నుంచి కుశాలపురం జంక్షన్ వద్ద కుడివైపు సర్వీస్ రోడ్డు మీదుగా వాహనాలను మళ్లించడం జరుగుతుంది.

2. శ్రీకాకుళం వైపు నుంచి కౌంటింగ్ కేంద్రానికి వచ్చే కౌంటింగ్ సిబ్బంది, పోటీలో ఉన్న అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు NH-16పై కింతలి మిల్లు జంక్షన్ వద్ద సర్వీస్ రోడ్డులోకి ప్రవేశించి, అండర్ ఫ్లైఓవర్ కింద నుంచి ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ మీదుగా శివాని కళాశాల అండర్‌పాస్ వద్దకు చేరుకోవాలి.

3. శ్రీకాకుళం, గార, ఆమదాలవలస, బూర్జ, సరుబుజ్జిలి, పొందూరు, ఎచ్చెర్ల, జి.సిగడాం, లావేరు, నరసన్నపేట మండలాలకు చెందిన కౌంటింగ్ అభ్యర్థులు, ఏజెంట్లు గేట్ నం. 2 నుంచి ప్రవేశించాలి.

4. రణస్థలం, సారవకోట, పోలాకి, జలుమూరు మండలాలకు చెందిన కౌంటింగ్ అభ్యర్థులు, ఏజెంట్లు గేట్ నం. 3 నుంచి ప్రవేశించాలి.

5. కౌంటింగ్ సిబ్బంది గేట్ నం. 4 నుంచి మాత్రమే ప్రవేశించాలి.

6. కౌంటింగ్ ఏజెంట్లు తమ వాహనాలను వారికి కేటాయించిన పార్కింగ్ ప్రదేశాల్లో మాత్రమే నిలిపి, అక్కడి నుంచి కౌంటింగ్ కేంద్రానికి వెళ్లాలి.

7. అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు, సిబ్బంది తప్పనిసరిగా తమ అధికారిక గుర్తింపు కార్డులను వెంట ఉంచుకోవాలి.

8. కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్లు సెల్‌ఫోన్లు, నీళ్ల బాటిళ్లు, ఇంకు బాటిళ్లు తదితర నిషేధిత వస్తువులను కౌంటింగ్ హాల్లోకి తీసుకెళ్లకూడదు.

9. అధికారిక మీడియా ప్రతినిధులు శివాని కళాశాల ప్రధాన ద్వారం నుంచి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లోకి ప్రవేశించాలి. వారి వాహనాలను ప్రధాన గేటు వెలుపల కేటాయించిన ప్రదేశంలో పార్కింగ్ చేయాలి.

సాధారణ ప్రయాణికులకు ట్రాఫిక్ సూచనలు:

10. శ్రీకాకుళం నుంచి రాజాం వైపు వెళ్లే వాహనదారులు NH-16పై కింతలి మిల్లు జంక్షన్ వద్ద సర్వీస్ రోడ్డులోకి ప్రవేశించి, అండర్ ఫ్లైఓవర్ కింద నుంచి అంబేద్కర్ విశ్వవిద్యాలయం మీదుగా ఎదురువైపు మార్గంలో చిలకపాలెం చేరుకోవాలి.

11. విశాఖపట్నం వైపు వెళ్లే ప్రయాణికులు శివాని కళాశాల అండర్‌పాస్ మీదుగా చిలకపాలెం వెళ్లడానికి అనుమతి లేదు. వారు జాతీయ రహదారి, పాత ఎచ్చెర్ల హైవే, అంబేద్కర్ విశ్వవిద్యాలయం మీదుగా సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలి.

శాంతిభద్రతలకు సంబంధించిన సూచనలు:

12. కౌంటింగ్ కేంద్రం వద్ద ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశాం. వాహనదారులు, ప్రజలు పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించాలి.

13. కౌంటింగ్ ప్రక్రియ అనంతరం ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, ప్రదర్శనలు నిర్వహించకూడదు. బాణసంచా కాల్చడం పూర్తిగా నిషేధించబడింది.

14. పై నిబంధనలను ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

గమనిక :-అభ్యర్థులు, ఏజెంట్లు, కౌంటింగ్ సిబ్బంది మినహా మిగిలిన వారికి ఎవ్వరికి కౌంటింగ్ కేంద్రాలోకి, పరిసర ప్రాంతాల్లోకి అనుమతి నిషిద్ధం.

ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, జిల్లా ప్రజలు, మీడియా ప్రతినిధులు పోలీసు శాఖకు పూర్తిస్థాయిలో సహకరించాలని సబ్ డివిజన్ పోలీసు అధికారి సి.హెచ్. ధనుంజయ నాయుడు విజ్ఞప్తి చేశారు.
Andhra Pradesh Police Dgp Andhra Pradesh Srikakulam District Police

శ్రీకాకుళం జిల్లా పోలీసుఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల పటిష్ట భద్రత.జిల్లాలోని మూడు ప్రధాన ప...
06/11/2026

శ్రీకాకుళం జిల్లా పోలీసు

ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల పటిష్ట భద్రత.

జిల్లాలోని మూడు ప్రధాన ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాల భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస్.

స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాల వద్ద నిరంతర నిఘా – అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యలు.

జిల్లా ఎస్పీ శ్రీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్.

శ్రీకాకుళం, నవంబర్ 06. జిల్లాలో శనివారం (నవంబర్ 7) ఉదయం నుంచి నిర్వహించనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. జిల్లాలోని మూడు ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థను అమలు చేస్తూ, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్టమైన బందోబస్తు నిర్వహించాలని పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస్ గారు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం జిల్లా ఎస్పీ పలాసలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల కౌంటింగ్ కేంద్రాలు, టెక్కలిలోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల, శ్రీకాకుళం సమీపంలోని చిలకపాలెం శ్రీ శివానీ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను సంబంధిత పోలీసు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సందర్శించి భద్రతా ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు. గురువారం నిర్వహించిన ఎన్నికల పోలింగ్ అనంతరం బ్యాలెట్ పత్రాలు, ఎన్నికల సామగ్రిని ఆయా కేంద్రాల్లోని స్ట్రాంగ్ రూములలో పటిష్ట భద్రత నడుమ భద్రపరిచిన నేపథ్యంలో వాటి రక్షణకు తీసుకున్న చర్యలు, సీసీ కెమెరాల నిఘా, పోలీసు గస్తీ, ప్రవేశ మార్గాలు, బారికేడింగ్, వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు స్ట్రాంగ్ రూముల వద్ద నిరంతర సీసీ కెమెరాల నిఘా కొనసాగించాలని, పోలీసు గస్తీని మరింత ముమ్మరం చేయాలని, అనధికార వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ స్ట్రాంగ్ రూముల పరిసరాల్లోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విధుల్లో ఉన్న అధికారులు ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ రూములను, భద్రతా పరిసరాలను తనిఖీ చేస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ, ప్రతి భద్రతా వలయంలో విధులు నిర్వహించే సిబ్బంది తమ బాధ్యతలను సమన్వయంతో నిర్వర్తించాలని స్పష్టం చేశారు.

కౌంటింగ్ కేంద్రాలకు అభ్యర్థులు, వారి అధీకృత కౌంటింగ్ ఏజెంట్లు ఎన్నికల సంఘం జారీ చేసిన గుర్తింపు కార్డులు, సంబంధిత ధృవీకరణ పత్రాలను పరిశీలించిన అనంతరమే నిర్దేశిత ప్రవేశ మార్గాల ద్వారా అనుమతించాలని, ప్రతి మండలానికి కేటాయించిన ప్రత్యేక ప్రవేశ మార్గాలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. అనుమతి లేని వ్యక్తుల ప్రవేశాన్ని పూర్తిగా నియంత్రించాలని, విధుల్లో ఉన్న సిబ్బంది కూడా తమకు కేటాయించిన ప్రదేశాల్లోనే విధులు నిర్వహించేలా పర్యవేక్షించాలన్నారు. కౌంటింగ్ హాళ్లలోకి మొబైల్ ఫోన్లు, ఐప్యాడ్లు, ల్యాప్‌టాప్‌లు, ఆడియో, వీడియో రికార్డింగ్ పరికరాలు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరాదని స్పష్టం చేశారు.

కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బారికేడింగ్ ఏర్పాటు చేసి, అవసరమైన ప్రాంతాల్లో అదనపు భద్రతా వలయాలను ఏర్పాటు చేయాలని, జనసమూహాల నియంత్రణకు ప్రత్యేక సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తూ, బాడీ వోర్న్ కెమెరాలు, డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా కేంద్రాల పరిసరాలపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద చోటుచేసుకునే పరిణామాలను వీడియో, ఫొటోగ్రఫీ ద్వారా రికార్డు చేయాలని, ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు.

కౌంటింగ్ కేంద్రాల వద్ద ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం కలగకుండా ముందస్తు వాహనాల మళ్లింపు చర్యలు చేపట్టాలని, అభ్యర్థులు, ఏజెంట్లు, ఎన్నికల సిబ్బంది వాహనాల కోసం నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశాలను మాత్రమే వినియోగించేలా చూడాలని తెలిపారు.ఎన్నికల నియమావళి,30 పోలీసు యాక్ట్ సెక్షన్,163 అమలు మేరకు కేంద్రాల వెలుపల అనవసరంగా గుంపులుగా గుమిగూడడాన్ని, తాత్కాలిక షామియానాలు, పందిళ్లు ఏర్పాటు చేయడాన్ని అనుమతించరాదని, ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

కౌంటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించే సంబంధిత సబ్ డివిజన్ పోలీసు అధికారులు స్వయంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించాలని, విధులకు నియమించిన ప్రతి పోలీసు అధికారి, సిబ్బందికి వారి విధులు, బాధ్యతలపై ముందస్తుగా స్పష్టమైన అవగాహన కల్పించాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో సమస్యాత్మక వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలని,ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైన సందర్భాల్లో అదనపు పోలీసు బలగాలను తక్షణమే వినియోగించుకునేలా సిద్ధంగా ఉంచాలని తెలిపారు.

కౌంటింగ్ ప్రక్రియ పూర్తయి ఫలితాలు ప్రకటించిన అనంతరం ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, బాణసంచా కాల్చడం అనుమతి ఉండదని,ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రత్యర్థి వర్గాలను కించపరిచేలా, కక్షపూరితంగా వ్యవహరించడం, సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టులు, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం వంటి చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, వారి అనుచరులు సంయమనం పాటించాలని జిల్లా ఎస్పీ సూచించారు. కౌంటింగ్ ప్రక్రియ ముగిసి, ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ పత్రాల భద్రతకు సంబంధించిన ప్రక్రియ పూర్తయ్యే వరకు పోలీసు సిబ్బంది పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలని తెలిపారు.

ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసుశాఖ అన్ని ముందస్తు భద్రతా చర్యలు చేపట్టిందని, ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు పోలీసుశాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస్ గారు విజ్ఞప్తి చేశారు.

ఈ పరిశీలనలో జిల్లా ఎస్పీ తోపాటు విజిలెన్స్ అదనపు ఎస్పీ వివేకానంద, సంబధిత డివిజన్ ఆర్డీవోలు సాయి ప్రత్యూష, కృష్ణ మూర్తి, అప్పలరాజు,డీఎస్పీలు దనేంజయ నాయుడు, లక్ష్మణరావు ,జి వి రమణ, భాస్కర్ రెడ్డి, ఎస్బి ఇన్స్పెక్టర్ ఇమ్మాన్యూల్ రాజ్ పలువురు సిఐలు ఎస్సైలు పాల్గొన్నారు.
Dgp Andhra Pradesh Srikakulam District Police Andhra Pradesh Police

శ్రీకాకుళం జిల్లా పోలీసు.ll ఎట్టి అనుమతులు లేకుండా బాణాసంచా విక్రయాలు,నిల్వలు చేసినట్లయితే కఠిన చర్యలు.ll ll పర్యావరణ హి...
06/11/2026

శ్రీకాకుళం జిల్లా పోలీసు.

ll ఎట్టి అనుమతులు లేకుండా బాణాసంచా విక్రయాలు,నిల్వలు చేసినట్లయితే కఠిన చర్యలు.ll

ll పర్యావరణ హిత దీపావళి జరుపుకోవాలి.ll

ll జిల్లా ఎస్పీ శ్రీ కె.వి మహేశ్వర రెడ్డి ఐపీఎస్.ll

ll దీపావళి పండుగ జరుపుకొను సందర్భములో ప్రజలకు జిల్లా ఎస్పీ సూచనలు.ll

శ్రీకాకుళం, నవంబర్ 06. దీపావళి పండుగ జరుపుకొనే సమయములో ఎంత కాంతి, ఆనందాన్ని ఇస్తుందో... వికటిస్తే అంతే చీకటినీ, విషాదాన్ని తెచ్చిపెట్టి అవకాశం ఉంది.ప్రమాదాలేవీ లేకుండా కేవలం సంప్రదాయ వేడుకగా దీపావళి పండుగ జరుపుకొనుటకు, ముఖ్యంగా పిల్లల విషయంలో జిల్లా ప్రజలు అందరూ క్రింది జాగ్రత్తలు పాటించాలని శుక్రవారం ఓ ప్రకటన ద్వారా జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మహేశ్వర రెడ్డి గారు తెలిపారు.
బాణాసంచాల విక్రయాలకు పోలీస్ శాఖ తోపాటు, సంబంధిత శాఖల నుండి తప్పనిసరిగా ముందుస్తు అనుమతులు పొందిన తరువాత మాత్రమే బాణాసంచాలను అమ్మకములు చేయాలి. బాణాసంచా షాపులను మైదానం లేదా ప్రజల నివాసము ప్రదేశంనకు దూరంగా ఉన్న బహిరంగ ప్రదేశములో మాత్రమే ఏర్పాటు చేయాలి. షాపు, షాపులనుకు మద్య కనీసం మూడు నుంచి ఐదు మీటర్లు దూరంను తప్పనిసరిగా పాటించాలి. ముందు జాగ్రత్తగా తగినంత ఇసుక,నీరును డ్రమ్ములలోనూ మరియు అగ్ని మాపక పరికరములను తప్పనిసరిగా బాణాసంచా షాపుల దగ్గర అందుబాటులో ఉంచుకోవాలి.

బాణాసంచాను అక్రమముగా తయారు చేయడం, నిలువ ఉంచడం, అమ్మడం, కొనడం, రవాణా చేయడం చట్టరీత్యా నేరము.అట్టి చర్యలుకు పాల్పడువారిపై చట్టప్రకారము చర్యలు తీసుకొనబడును.ఎట్టి పరిస్థుతలలోనూ బాణాసంచాను ఇంటి వద్ద తయారు చేయకూడదు. అలా చేసినట్లు అయిన, వాటిని సరిగా ఉపయోగించడం తెలియనందున పెద్ద ప్రమాదములు జరిగే అవకాశం ఉంటుంది.గుర్తింపు పొందిన, నాణ్యమైన బాణాసంచాను అమ్ముచున్న షాప్ వద్దనే కొనడం శ్రేయస్కరము.

ll *దీపావళి పండుగ జరుపుకొను సందర్భములో ప్రజలకు జిల్లా పోలీస్ వారి సూచనలు*.ll

🌀పర్యావరణ హిత దివాళి జరుపుకోవాలి.తక్కువ కాలుష్యం కలిగించే గ్రీన్ క్రాకర్స్ (Green Crackers) మాత్రమే వినియోగించాలి.

🌀 లైసెన్స్ లేని దుకాణాలు, గోదాములు లేదా రోడ్ల పక్కన అక్రమంగా బాణసంచా విక్రయిస్తే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తారు.

🌀ప్రజలు ఇలాంటి అక్రమ విక్రయాలు, నిల్వలు గురించి సమాచారం ఉన్నచో వెంటనే డయల్ 112,సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలి.

🌀 శబ్ద కాలుష్యం నియంత్రణ,రాత్రి 10 గంటల తర్వాత బాణసంచా కాల్చడం నిషేధం.

🌀అధిక శబ్దం, ప్రజలకు ఇబ్బంది కలిగించే బాణసంచా ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

🌀 పెద్ద శబ్దాలతో పేలే టపాకాయలు కాకుండా చాలా తక్కువ శబ్దం, వెలుగులు ఇచ్చే చిచ్చుబుడ్లు, కాకరపూవత్తులు, పెన్సిళ్లు, భూచక్రాల వంటివి కాల్చడం మంచిది.

🌀బాణాసంచా కాల్చగానే వేడిమి తగలకుండా వీలైనంత దూరంగా వెళ్లాలి. కాలని / పిలని బాణాసంచాపై పట్టుకోవడం,చూడటం చేయరాదు.

🌀కంటికి రక్షణగా ప్లెయిన్ గాగుల్స్ (కళ్ళద్దాలు) వాడటం మంచిది. బాణాసంచాని వంటగదులలోనూ, పొయ్యి, గ్యాస్ సిలిండర్లు ఉన్న ప్రాంతాల్లో ఉంచకూడదు.

🌀 బాణాసంచా ఎప్పుడూ ఆరుబయటే కాల్చాలి. ఇంటి కారిడార్లలో, ఇంటి లోపలా, టెర్రెస్ పైన కాల్చకూడదు. బాణాసంచా కాల్చే సమయంలో వదులైన దుస్తులు ధరిస్తే, అవి వేలాడుతూ మంట అంటుకొనే ప్రమాదం ఉంది. అందుకే కొద్దిగా బిగుతైన దుస్తులు ధరించాలి.

🌀 బాణాసంచా కాల్చే సమయంలో టపాకాయకు వీలైనంత దూరంగా ఉండాలి.

🌀పేలే బాణాసంచాను డబ్బాలు, పెట్టెలతో పాటు... మరింత శబ్దం కోసం కుండల్లో,తేలికపాటి రేకు డబ్బాల్లో, గాజు వస్తువుల్లో ఉంచి అస్సలు కాల్చకూడదు.

🌀బాణాసంచాను గుంపులుగా కాల్చడము, ఒకరిపై ఇంకొకరు వేసుకోవడం, ఒకరిని ఒకరు రెచ్చగొట్టేటట్లు చేసుకొనుట ఎట్టి పరిస్థుతలలోనూ చేయరాదు.

🌀పెద్దవాళ్ల సహాయం లేకుండా చిన్నపిల్లలు వాళ్లంతట వాళ్ళే కాల్చడం సుతరామూ సరికాదు. పిల్లలు కాలుస్తున్నప్పుడు పెద్దలు పక్కనే ఉండి, జాగ్రత్తగా వారిని చూసుకోవాలి.

🌀ఒక సమయంలో ఒక క్రాకర్ను మాత్రమే వెలిగించాలి.సరిగ్గా కాల్చని బాణసంచా మళ్లీ వెలిగించే ప్రయత్నం చేయకూడదు.

🌀బాణాసంచా కాల్చే సమయం లో ముందుజాగ్రత్తగా బక్కెట్ లలో నీళ్లు, ఇసుకను పక్కనే ఉంచుకోవాలి. చర్మం కాలితే కంగారు పడకుండా తొలుత గాయంపై నీళ్లు ధారగా పడేలా కడగాలి. మంట తగ్గేవరకు అలా కడిగి అప్పుడు డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి.

🌀ప్రమాదవశాత్తు కంటికి ఏదైనా గాయం అయినప్పుడు ఒక కన్ను మూసి, ప్రమాదానికి గురైన కంటి చూపును స్వయంగా పరీక్షించి చూసుకోవాలి.

పై జాగ్రత్తలు చర్యలు ప్రజలు తూచ తప్పకుండా పాటించాలని, సురక్షితంగా దీపావళి జరుపుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర రెడ్డి ఐపీఎస్ గారు కోరారు
Dgp Andhra Pradesh Srikakulam District Police Andhra Pradesh Police

శ్రీకాకుళం జిల్లా పోలీసు.ప్రశాంతంగా ముగిసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ పరిషత్ ఎన్నికలు.ఎన్నికల సామాగ్రి స్ట్రాంగ్ రూములకు తరలి...
05/11/2026

శ్రీకాకుళం జిల్లా పోలీసు.

ప్రశాంతంగా ముగిసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ పరిషత్ ఎన్నికలు.

ఎన్నికల సామాగ్రి స్ట్రాంగ్ రూములకు తరలింపు – పటిష్టమైన భద్రత ఏర్పాటు

పోలింగ్ అనంతరం సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక పెట్రోలింగ్, నిరంతర పోలీసు నిఘా

జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస్.,,

శ్రీకాకుళం నవంబర్ 05. జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ముగిసింది అని జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర రెడ్డి గురువారం సాయంత్రం స్పష్టం చేశారు.ఓటర్లు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది అని ఆయన తెలిపారు.గురువారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీసు కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస్ సందర్శించి ఎన్నికల సరళి, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం ఒప్పంగి, అంపోలు, గార, బైరి సింగుపురం, రొట్టవలస, కొత్తకోట, ఫరీదుపేట, ఎస్.ఎం.పురం, బురిడికంచరం, పొందూరు, రణస్థలం తోపాటు పలు ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి క్యూలైన్లు, బారికేడ్లు, వాహనాల పార్కింగ్, 100 మీటర్ల పరిధిలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేశారు.
పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రిని సంబంధిత స్ట్రాంగ్ రూములకు పటిష్టమైన పోలీసు భద్రత నడుమ తరలించి భద్రపరిచేలా చర్యలు చేపట్టారు. స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచెల భద్రత, నిరంతర నిఘా, సీసీ కెమెరాల పర్యవేక్షణ ఏర్పాటు చేశారు.హైపర్ సెన్సిటివ్, సెన్సిటివ్ ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అవసరమైన ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా పరిస్థితులను పర్యవేక్షించడంతో పాటు సీసీ కెమెరాల సహాయంతో నిరంతర నిఘా, పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా విధులు నిర్వహించారు అని ఆయన అభినిదించారు.ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడంలో ప్రజలు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ఎన్నికల సిబ్బంది, మీడియా ప్రతినిధులు అందించిన సహకారంపై జిల్లా ఎస్పీ సంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

పోలింగ్ అనంతర భద్రతపై ప్రత్యేక దృష్టి:-
:జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలింగ్ అనంతరం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఆయా గ్రామాల్లో అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి, రాత్రి వేళల్లోనూ ప్రత్యేక గస్తీ నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎలాంటి ఘర్షణలు, తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలు సంయమనం పాటిస్తూ శాంతియుత వాతావరణానికి సహకరించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Dgp Andhra Pradesh Andhra Pradesh Police Srikakulam District Police

శ్రీకాకుళం జిల్లా పోలీసు.ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలుజిల్లావ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలన...
05/11/2026

శ్రీకాకుళం జిల్లా పోలీసు.

ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు

జిల్లావ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మహేశ్వర రెడ్డి ఐపీఎస్

శ్రీకాకుళం జిల్లాలో పటిష్టమైన పోలీసు భద్రతా చర్యల నడుమ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.

ఈ క్రమంలో గురువారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీసు కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మహేశ్వర రెడ్డి ఐపీఎస్ సందర్శించి, ఎన్నికల సరళిని పర్యవేక్షించారు. అక్కడి నుంచి పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుంటూ భద్రతా ఏర్పాట్లపై సమీక్షించి, అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.

అనంతరం ఒప్పంగి, అంపోలు, గార, బైరి సింగుపురం, రొట్టవలస, కొత్తకోట, ఫరీదుపేట, ఎస్.ఎం.పురం, బురిడికంచరం, పొందూరు తదితర ప్రాంతాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి, క్షేత్రస్థాయిలో పోలింగ్ సరళి, పోలీసు భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్ల నిర్వహణ, బారికేడ్లు, వాహనాల పార్కింగ్ సౌకర్యాలు, 100 మీటర్ల పరిధిలో భద్రతా నిబంధనల అమలును పరిశీలించి, విధుల్లో ఉన్న అధికారులకు పలు సూచనలు చేశారు. క్యూలైన్లలో వేచి ఉన్న ఓటర్లతో మాట్లాడి, క్రమపద్ధతిలో తమ వంతు వచ్చినప్పుడు ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు కొనసాగుతున్నాయని తెలిపారు. మిగిలిన పోలింగ్ సమయాన్ని కూడా ఓటర్లు సద్వినియోగం చేసుకుని, ఎలాంటి భయం, ఒత్తిడికి లోనుకాకుండా తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Andhra Pradesh Police Dgp Andhra Pradesh Srikakulam District Police

శ్రీకాకుళం జిల్లా పోలీసు.ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల వేళ ఓటర్లకు జిల్లా పోలీసుల సహాయక చర్యలు.పోలింగ్ కేంద్రాల్లో నడవలేని...
05/11/2026

శ్రీకాకుళం జిల్లా పోలీసు.

ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల వేళ ఓటర్లకు జిల్లా పోలీసుల సహాయక చర్యలు.

పోలింగ్ కేంద్రాల్లో నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు, దివ్యాంగులకు పోలీసు సిబ్బంది సహకారం అందిస్తూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు తోడ్పాటు అందిస్తున్నారు.

క్యూ లైన్ల క్రమబద్ధీకరణ, జనసమూహాల నియంత్రణ, ఓటర్లకు అవసరమైన సూచనలు తదితర అంశాలపై పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా జిల్లా పోలీసులు చర్యలు చేపడుతున్నారు.
Andhra Pradesh Police Dgp Andhra Pradesh Srikakulam District Police

Address

Srikakulam
532001

Alerts

Be the first to know and let us send you an email when Srikakulam District Police posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Srikakulam District Police:

Shortcuts

Share